Sai Rajesh’s Maina Begins with Mythri Movie Makers
విభిన్నమైన కథలను ఎంచుకుంటూ దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సాయి రాజేష్ మరో కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. ‘కలర్ ఫొటో’, ‘బేబీ’ చిత్రాలతో దర్శకుడిగా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతోపాటు జాతీయ అవార్డును అందుకున్న ఆయన.. ఇటీవల ‘చెన్నై లవ్‌స్టోరీ’ చిత్రానికిగానూ కథను అందించి నిర్మాణ రంగంలోనూ తన అభిరుచిని చాటుకున్నారు. ఇప్పుడు ‘మిట్టి అండ్ మూన్ ఫిలింస్’ పేరుతో సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి, తొలి చిత్రంగా ‘మైనా’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
Sai Rajesh’s Maina Begins with Mythri Movie Makers
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి సాయి రాజేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనే లక్ష్యంతో రూపొందుతున్న ఈ చిత్రానికి చంటిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. శివమణి పట్నంశెట్టి, గీత మహావడి, చంటిబాబు, దివ్య జయరాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మహి ఇప్పలపెల్లి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తుండగా.. మెలొడీ బ్రహ్మ మణిశర్మ సంగీత బాధ్యతలు చేపట్టారు.
రెండు ప్రేమజంటలు.. ఆసక్తి రేపుతున్న ఫస్ట్ లుక్
‘మైనా’ సినిమాను హైదరాబాద్‌లోని ఫిలింనగర్ దైవసన్నిధానంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా నేపథ్యంపై ఆసక్తిని పెంచుతోంది. ప్రేమకు ఎదురయ్యే అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు సాగుతున్న రెండు ప్రేమజంటలను ప్రతిబింబించేలా పోస్టర్‌ను రూపొందించారు. మహిళ చేతికి ఇనుప కంచె చుట్టుకున్నట్టుగా చూపించడం, దానిపై రెండు జంటలు, సీతాకోకచిలుకల రూపాలు కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ విజువల్స్ సినిమా కథలో ప్రేమతోపాటు భావోద్వేగాలకు కూడా ప్రాధాన్యం ఉండబోతోందనే ఆసక్తిని కలిగిస్తున్నాయి.
లవ్‌స్టోరీలను ఎంచుకోవడంలోనూ, వాటిని నిర్మాణపరంగా ప్రేక్షకులకు చేరువ చేయడంలోనూ సాయి రాజేష్‌కు ప్రత్యేకమైన శైలి ఉంది. ఈ నేపథ్యంలో ‘మైనా’ మరో విభిన్నమైన ప్రేమకథగా తెరకెక్కనుండటం విశేషం. మరోవైపు, కొత్త దర్శకుడు చంటిబాబుకు ఈ సినిమా మంచి అవకాశంగా నిలవనుంది. మైత్రీ మూవీ మేకర్స్ వంటి ప్రముఖ సంస్థ భాగస్వామ్యం, మణిశర్మ సంగీతం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.
కొత్త టాలెంట్‌కు ప్రోత్సాహమే లక్ష్యం
‘మిట్టి అండ్ మూన్ ఫిలింస్’ ప్రారంభం సందర్భంగా సాయి రాజేష్ తన ఆలోచనను స్పష్టం చేశారు. గొప్ప సినిమా తీయడానికి భారీ బడ్జెట్ ఒక్కటే ప్రామాణికం కాదని, బలమైన ఆలోచనలే అసలైన బలమని ఆయన పేర్కొన్నారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు తమ నిర్మాణ సంస్థ సిద్ధంగా ఉందని తెలిపారు.