Venkatesh Aadarsha Kutumbam Movie Review
చిత్రం : ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47 (AK 47)
రేటింగ్ : 2.75/5
నటీనటులు : వెంకటేష్, శ్రీనిధి శెట్టి, నారా రోహిత్, నివేదా పేతురాజ్, సత్య, రావు రమేష్, బ్రహ్మాజీ, రఘుబాబు, వెన్నెల కిషోర్, యువినా, రాజా ప్రజ్వల్, తదితరులు
బ్యానర్ : హారిక అండ్ హాసిని క్రియేషన్స్
నిర్మాత : ఎస్. రాధాకృష్ణ (చినబాబు)
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్
సంగీతం : ఎస్.ఎస్. తమన్
సినిమాటోగ్రఫీ (DOP) : రవి కె. చంద్రన్
ఎడిటర్ : నవీన్ నూలి
విడుదల తేదీ : అక్టోబర్ 30, 2026
Venkatesh Aadarsha Kutumbam Movie Review
కథ విషయానికొస్తే..
చిట్టిబాబు (వెంకటేష్) ఓ మధ్యతరగతి వ్యక్తి. భార్య స్వర్ణ (శ్రీనిధి శెట్టి), పిల్లలతో కలిసి సాధారణ జీవితం గడుపుతుంటాడు. అయితే కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఒక్కొక్కటిగా చుట్టుముడతాయి. భార్య చేసిన అప్పులు, కొడుకు ఆరోగ్య సమస్యలు, మరోవైపు ఉద్యోగం కోల్పోవడం.. ఇలా చిట్టిబాబు జీవితం కష్టాల సుడిగుండంలో చిక్కుకుంటుంది. అలాంటి సమయంలో అనుకోకుండా అతడికి రూ.100 కోట్ల లాటరీ తగులుతుంది. దీంతో ఆ కుటుంబం జీవితమే మారిపోతుంది. చిన్న ఇంటి నుంచి విలాసవంతమైన విల్లాకు చేరుకుంటారు. అయితే ఈ సంతోషం ఎంతోకాలం నిలవదు. వంద కోట్ల డబ్బుపై కన్నేసిన ఓ దొంగల ముఠా చిట్టిబాబు కుటుంబాన్ని టార్గెట్ చేస్తుంది. ఆ కుటుంబంలోకి చొరబడిన దొంగలు తమ పథకాన్ని అమలు చేయాలని చూస్తారు. కానీ ఆ ఇంట్లో వాళ్లు అనుకున్నదొకటి.. అక్కడ జరిగేదొకటి! చిట్టిబాబు కుటుంబం వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? దొంగల ముఠాకు ఎదురైన పరిణామాలేంటి? పోలీసుల విచారణలో బయటపడే రహస్యాలేంటి? అన్నదే మిగతా కథ.
నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి..
వెంకటేష్ తనదైన కామెడీ టైమింగ్‌తో చిట్టిబాబు పాత్రకు న్యాయం చేశారు. మధ్యతరగతి కుటుంబ పెద్దగా కనిపిస్తూనే, పరిస్థితులు మారినప్పుడు చూపించే వైవిధ్యం ఆకట్టుకుంటుంది. కామెడీ, ఎమోషన్స్‌తో పాటు యాక్షన్ సన్నివేశాల్లోనూ తన అనుభవాన్ని ప్రదర్శించారు. స్వర్ణ పాత్రలో శ్రీనిధి శెట్టి మెప్పించారు. అమాయకత్వం, కుటుంబ బాధ్యతలు, కథలో వచ్చే కీలక మలుపుల్లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఆమె పాత్రకు సంబంధించిన ట్విస్ట్ కథపై ఆసక్తిని పెంచుతుంది. సత్య తనదైన కామెడీతో సినిమాకు ప్రధాన బలంగా నిలిచారు. ఆయన కనిపించే సన్నివేశాలు ప్రేక్షకులకు నవ్వులు పంచుతాయి. వెంకటేష్‌తో కలిసి చేసే సన్నివేశాలు వినోదాన్ని అందిస్తాయి. నారా రోహిత్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించి కథకు మరో కోణాన్ని జోడించారు. రావు రమేష్, రఘుబాబు, వెన్నెల కిషోర్ తమ పాత్రల పరిధిలో ఆకట్టుకున్నారు. పిల్లల పాత్రల్లో నటించిన యువినా, రాజా ప్రజ్వల్ కూడా మెప్పించారు. నివేదా పేతురాజ్ పాత్ర నిడివి పరిమితంగానే ఉన్నప్పటికీ గ్లామర్‌కే పరిమితమైంది.

టెక్నికల్ టీమ్ గురించి..
దర్శకుడు త్రివిక్రమ్ ఈసారి తనకు అలవాటైన కుటుంబ కథా నేపథ్యానికి క్రైమ్, యాక్షన్ అంశాలను జోడించి కొత్త తరహా ప్రయత్నం చేశారు. కుటుంబంలో జరిగే సరదా సంఘటనలను, అనూహ్యమైన పరిణామాలను కలిపి కథను ముందుకు నడిపించారు. ఆయన మార్క్ సంభాషణలు కొన్ని చోట్ల బాగా పేలాయి. తమన్ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలకు బలాన్ని ఇచ్చింది. ముఖ్యంగా ఉత్కంఠభరితమైన సన్నివేశాల్లో బీజీఎం ఉపయోగపడింది. పాటలు మాత్రం కథనంలో పెద్దగా ప్రభావం చూపించవు. రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ బాగుంది. విలాసవంతమైన ఇంటి నేపథ్యం, యాక్షన్ సన్నివేశాలను తెరపై ఆకర్షణీయంగా చూపించారు. నవీన్ నూలి ఎడిటింగ్ కూడా చాలా వరకు కథకు అనుగుణంగా సాగింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

సినిమా ఎలా ఉందంటే..
వెంకటేష్ కెరీర్లో మైల్ స్టోన్‌గా నిలిచిన ‘నవ్వు నాకునచ్చావ్’, ‘మల్లీశ్వరి’ చిత్రాల విజయంలో రచయితగా తన మార్క్ చూపించిన త్రివిక్రమ్.. దాదాపు 22 ఏళ్ల తర్వాత వెంకటేష్‌ను డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై సహజంగానే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ కుటుంబ కథలకు పెట్టింది పేరైన ఈ ఇద్దరూ తొలిసారి దర్శకుడు–హీరోగా కలిసి పనిచేయడంతో ‘ఆదర్శ కుటుంబం’పై ఆసక్తి పెరిగింది. అయితే ఈసారి పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాకుండా, కుటుంబ కథలో క్రైమ్ థ్రిల్లర్ అంశాలను కలిపి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే ప్రయత్నం చేశారు. సినిమా ప్రారంభంలో చిట్టిబాబు కుటుంబంలోని సమస్యలు, భార్యాభర్తల మధ్య సరదా గొడవలు, పిల్లలతో వచ్చే సన్నివేశాలు వినోదాన్ని పంచుతాయి. మధ్యతరగతి కుటుంబంలో ఉండే ఇబ్బందులను హాస్యంతో చూపించడం బాగుంది. లాటరీ తగిలిన తర్వాత కథలో వచ్చే మార్పులు, విల్లాకు మారడం, కొత్త పాత్రల పరిచయంతో కథ వేగం పుంజుకుంటుంది. ముఖ్యంగా త్రివిక్రమ్ మార్క్ డైలాగులు బాగా పేలాయి. ‘‘మనిషి మృగంలా మారడం అనేది ఒక ప్రొసెస్’, ‘చచ్చే సైన్యం లేకుండా గెలిచే యుద్ధం ఏది సార్.?’ లాంటి కొన్ని డైలాగులు బాగా పండాయి. ముఖ్యంగా సత్య పాత్ర ఎంట్రీ తర్వాత వినోదం మరింత పెరుగుతుంది. ఆయన కామెడీకి వెంకటేష్ టైమింగ్ తోడవడంతో కొన్ని సన్నివేశాలు బాగా పండాయి. మరోవైపు దొంగల ముఠా కుటుంబాన్ని టార్గెట్ చేయడం, ఆ తర్వాత చోటుచేసుకునే పరిణామాలు కథపై ఆసక్తిని పెంచుతాయి. ఇంటర్వెల్ సమయానికి వచ్చే ట్విస్ట్ కథను మరో మలుపు తిప్పుతుంది. అప్పటివరకు చూసిన కుటుంబాన్ని కొత్త కోణంలో చూసేలా చేయడం ఈ చిత్రంలో ఆసక్తికరమైన అంశం. అయితే సెకండాఫ్‌లో మాత్రం అదే స్థాయి వేగం కొనసాగదు. కుటుంబం వెనుక ఉన్న అసలు నేపథ్యాన్ని వివరించే క్రమంలో కథనం నెమ్మదిస్తుంది. కొన్ని సన్నివేశాలు ముందే ఊహించేలా ఉండటం, ఫ్యామిలీ ఎమోషన్స్ మరింత బలంగా కనెక్ట్ కాకపోవడం కొంత నిరాశ కలిగిస్తాయి. క్రైమ్, యాక్షన్ అంశాలను కుటుంబ భావోద్వేగాలతో మరింత సహజంగా మేళవించి ఉంటే ఫలితం మరో స్థాయిలో ఉండేది.
ప్లస్ పాయింట్స్
– వెంకటేష్ నటన, కామెడీ టైమింగ్
– సత్య కామెడీ సన్నివేశాలు
– ఇంటర్వెల్ ట్విస్ట్, కొన్ని కీలక మలుపులు
– త్రివిక్రమ్ మార్క్ సంభాషణలు
– సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
– సెకండాఫ్‌లో నెమ్మదించే కథనం
– కొన్ని సన్నివేశాల్లో లాజిక్ సమస్యలు
– కొన్ని ట్విస్టులు ముందే ఊహించే అవకాశం
– పాటలు, కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో బలం తగ్గడం
ఫైనల్‌గా..
మామూలు సగటలు ప్రేక్షకుడికి అయితే ‘ఏకే 47’.. నవ్వుల గన్‌ఫైరింగ్.. ట్విస్టులతో థ్రిల్లింగ్ రైడ్‌లా ఉంటుంది. మరి ఎక్కువ ఆశిస్తే ఏం చేయలేం.