Mega Sankranti Twist Kaaka Vs Viswambhara
ఊహించని ట్విస్ట్ : సంక్రాంతి రేసులో ‘విశ్వంభర’
సంక్రాంతి సీజన్ అంటే టాలీవుడ్లో బాక్సాఫీస్ పోరు మామూలుగా ఉండదు. స్టార్ హీరోల సినిమాలు పండగ బరిలో నిలిస్తే అభిమానుల్లో సందడి మొదలవుతుంది. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయంలో మాత్రం ఓ ఆసక్తికరమైన పరిణామం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సంక్రాంతి విడుదలను లక్ష్యంగా పెట్టుకున్న ‘కాకా’కు షాక్ తప్పదని తెలుస్తోంది. చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట మల్లిడి తెరకెక్కిస్తున్న సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ‘విశ్వంభర’ సినిమా విడుదల విషయంలో తాజాగా మరో ఆసక్తికరమైన అంశం తెరపైకి వచ్చింది. వీఎఫ్ఎక్స్ పనుల కారణంగాఈ సినిమా విడుదల ఆలస్యమవుతూ వచ్చింది. కానీ ఓటీటీ ఒప్పందానికి సంబంధించిన గడువు నేపథ్యంలో ‘విశ్వంభర’ను జనవరి 13న విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌తో డీల్ కారణంగా ఎట్టిపరిస్థితుల్లో జనవరి 13న ఈ సినిమా విడుదల చేయక తప్పదట. ఈ తేదీ ఖరారైతే మాత్రం సంక్రాంతి బాక్సాఫీస్ సమీకరణాలు ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే అదే రోజున ‘కాకా’ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
Mega Sankranti Twist Kaaka Vs Viswambhara
మరి ‘కాకా’ వెనక్కి తగ్గాల్సిందేనా?
దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న ‘కాకా’పై కూడా మెగా అభిమానుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా సంక్రాంతికి వస్తుందనే ప్రకటనతో ఇప్పటికే ప్రమోషన్స్ కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పుడు ‘విశ్వంభర’ విడుదల తేదీ చుట్టూ జరుగుతున్న చర్చలు ‘కాకా’ విడుదల ప్రణాళికపై ప్రభావం చూపుతాయా? అనే ప్రశ్న తలెత్తుతోంది. సాధారణంగా ఒక స్టార్ హీరో నటించిన రెండు సినిమాలు ఒకే రోజున థియేటర్లలోకి రావడం వల్ల వసూళ్లు, థియేటర్ల కేటాయింపు, ప్రేక్షకుల దృష్టి వంటి అంశాల్లో సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సంక్రాంతి వంటి కీలకమైన సీజన్లో ప్రతి సినిమాకు థియేటర్ల పరంగా పోటీ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రెండు చిత్రాల విడుదల తేదీల విషయంలో నిర్మాతలు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
దర్శకుడు బాబీ మాత్రం ‘కాకా’ సినిమా సంక్రాంతికి రావడం ఖాయమని ఇటీవల ప్రకటించారు. దీంతో ఒకవైపు ‘కాకా’ టీమ్ సంక్రాంతి విడుదలపై నమ్మకంగా ఉండగా, మరోవైపు ‘విశ్వంభర’ విడుదల తేదీపై వినిపిస్తున్న వార్తలు కొత్త చర్చకు తెరలేపుతున్నాయి.
చిరంజీవి జోక్యంతోనే క్లారిటీ వస్తుందా?
ఈ రెండు సినిమాలకు చిరంజీవే హీరో కావడంతో విడుదల తేదీల విషయంలో ఆయన నిర్ణయం కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ రెండూ సినిమాల మేకర్స్ కూడా సంక్రాంతికే రావాలని పట్టుబడటంతో ఈ విషయం చిరంజీవి దగ్గరకు వెళ్లింది. కానీ ‘విశ్వంభర’ను విడుదల చేయక తప్పనిపరిస్థితుల్లో చిరు కూడా ‘విశ్వంభర’ వైపే మొగ్గు చూపుతారని తెలుస్తోంంది.
రెండు సినిమాలపైనా భారీ అంచనాలు
‘విశ్వంభర’లో చిరంజీవి సరసన త్రిష, ఆశికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కునాల్ కపూర్ విలన్‌గా కనిపించనుండగా, ఇషా చావ్లా, సురభి, రమ్య పసుపులేటి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్, కథా ప్రపంచం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇక ‘కాకా’ విషయానికొస్తే.. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్నారు. అనస్వర రాజన్, నివేదా పేతురాజ్, సునీల్, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి బరిలో నిలవాలనే లక్ష్యంతో ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు కూడా ఊపందుకున్నాయి.