VijayDevarakonda About Telugu Film Industry
బ్లాక్ బస్టర్ ‘బేబీ’ జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన మోస్ట్ అవైటెడ్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. ’90s’ వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న యువ దర్శకుడు ఆదిత్య హాసన్ ఈ చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతుండటం విశేషం. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. సెప్టెంబర్ 11న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ లోని దస్పల్లా హోటల్ లో మంగళవారం సాయంత్రం ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఆసక్తికరంగా మాట్లాడుతూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
VijayDevarakonda About Telugu Film Industry
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘‘ఇలా అభిమానులను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇకపై వచ్చే మూడు నెలలు రెగ్యులర్‌గా మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను. సెప్టెంబర్ 11న ఆనంద్ దేవరకొండ ‘ఎపిక్’ వస్తోంది. అక్టోబర్ 16న నా సినిమా విడుదల కానుంది. నవంబర్‌లో దేవరకొండ-రష్మిక సినిమా కూడా ఉంది’’ అంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపారు.
తాను ప్రస్తుతం ‘రణబాలి’ షూటింగ్ నుంచి నేరుగా ఈ కార్యక్రమానికి వచ్చినట్లు విజయ్ తెలిపారు. ‘‘రిలీజ్ దగ్గర పడుతుండటంతో షూటింగ్‌ను వేగంగా పూర్తి చేస్తున్నాం. ఈ మధ్య సినిమాలు ఆలస్యమవుతున్నాయని ప్రేక్షకులు తిడుతున్నారు. ఆ భయంతోనే విగ్ కూడా తీయకుండా ఇక్కడికి వచ్చేశా. నిజానికి షూటింగ్ కాస్ట్యూమ్స్‌లోనే వచ్చేయాలనుకున్నా. కానీ మళ్లీ ‘రణబాలి’ ప్రమోషన్ కోసం వచ్చాడనుకుంటారేమోనని త్వరగా డ్రెస్ మార్చుకుని వచ్చాను’’ అంటూ సరదాగా మాట్లాడారు.
ఈ ఏడాది తెలుగు సినిమా పరిశ్రమకు ఎంతో మంచి సమయం నడుస్తోందని విజయ్ అన్నారు. ‘‘వరుసగా సినిమాలు విజయం సాధిస్తున్నాయి. సెప్టెంబర్ 11న ‘ఎపిక్’ వస్తోంది. ఆ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో ‘ప్యారడైజ్’, తర్వాత ‘రణబాలి’.. ఆపై ‘మైసా’, ‘ఈ నగరానికి ఏమైంది 2’, ‘ఫౌజీ’, బాలయ్య ‘దాదా’ వంటి భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ ఏడాది ముగింపు చాలా సాలిడ్‌గా ఉండబోతోంది. ఇప్పటికే ‘ఇరుముడి’ దుమ్ముదులుపుతోంది. రవితేజ బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. ఇప్పుడు ‘ఎపిక్’తో మొదలై వరుస బ్లాక్బస్టర్లు చూడబోతున్నాం. తెలుగు సినిమా మరో స్థాయికి వెళ్లబోతోంది’’ అని ధీమా వ్యక్తం చేశారు.
‘ఎపిక్’ దర్శకుడు ఆదిత్య గురించి విజయ్ ప్రత్యేకంగా మాట్లాడారు. ‘‘ఆదిత్య అంతకుముందు ఎవరో నాకు తెలియదు. నిజం చెప్పాలంటే నేను జీవితంలో ఈటీవీ చూసిన వ్యక్తిని కాదు. సీరియల్స్ బోర్ అనిపించేవి కాబట్టి జెమినీలో వచ్చే సినిమాలు చూసేవాడిని. కానీ ‘90స్’ సిరీస్‌తో ఆదిత్య సింగిల్ హ్యాండెడ్‌గా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈటీవీ విన్ యాప్‌ను డౌన్లోడ్ చేయించాడు. అసలు జీవితంలో ఈటీవీ చూడని నేను కూడా ఆ సిరీస్ కోసం యాప్ సబ్‌స్క్రైబ్ చేశాను’’ అన్నారు.
‘90స్’ చూసిన రోజే ఆదిత్య ఎప్పుడైనా సినిమా తీస్తే తన టికెట్ మాత్రం కచ్చితంగా ఉంటుందని అనుకున్నట్లు విజయ్ తెలిపారు. ‘‘షార్ట్ ఫిలిమ్స్ చూసి తరుణ్ భాస్కర్ డెబ్యూ కోసం ఎలా ఎదురుచూశానో, ఆదిత్య తొలి సినిమా కోసం కూడా అలాగే ఎదురుచూశాను. నాకు తరుణ్ భాస్కర్ మొదటి సినిమాలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తే, ఆదిత్య తొలి సినిమాలో ఆనంద్ నటించే అవకాశం రావడం కూడా అంతే అదృష్టంగా భావిస్తున్నాను’’ అని చెప్పారు.
తమ్ముడు ఆనంద్ దేవరకొండ గురించి మాట్లాడుతూ విజయ్ భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘ఆనంద్ సినిమాల ఎంపిక చూసి నాకు చాలా గర్వంగా ఉంటుంది. చిన్నప్పుడు నేను ఎక్కడికి వెళితే అక్కడికి నా వెంటే వచ్చేవాడు. ఇప్పటికీ ఒక సంఘటన నాకు బాగా గుర్తుంది. నన్ను పుట్టపర్తిలోని హాస్టల్లో చేర్పించడానికి నాన్న తీసుకెళ్తున్నప్పుడు, ఆనంద్ అమ్మను పట్టుకుని ‘నేను కూడా అన్నతో వెళ్తా’ అంటూ ఏడ్చాడు. తర్వాత మా కుటుంబంలో తొలిసారి ఫ్లైట్ ఎక్కి అమెరికా వెళ్లాడు. కానీ సినిమాలపై ఉన్న ప్యాషన్‌తో మళ్లీ ఇండియాకు వచ్చాడు. ఇప్పుడు ఎంతో మంచి సినిమాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ప్రయాణం కొనసాగిస్తున్నాడు’’ అని అన్నారు.
‘ఎపిక్’ ఆనంద్ కెరీర్లో ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని విజయ్ నమ్మకం వ్యక్తం చేశారు. ‘‘ఈ సినిమా ఆనంద్ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ మూవీగా నిలుస్తుందని భావిస్తున్నాను. వైష్ణవి చైతన్య బ్రిలియంట్ యాక్టర్. తన కుటుంబం కోసం ఎంతో చేసి, తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి చేరుకుంది. ‘90స్’ సిరీస్‌ను నేను ఎంతో ఎంజాయ్ చేశాను. అందులోని ప్రతి పాత్ర ఇప్పటికీ గుర్తుంది. ఆ సిరీస్ ఎన్నో జ్ఞాపకాలను గుర్తు చేసింది. అదే తరహాలో ‘ఎపిక్’ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకుంటుందని నమ్ముతున్నాను’’ అని విజయ్ దేవరకొండ అన్నారు.