Sandeep Saroj’s ‘Veta’ Launched with Grand Pooja Ceremony
‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన యువ నటుడు సందీప్ సరోజ్ హీరోగా మరో ఆసక్తికరమైన చిత్రం ప్రారంభమైంది. ‘వేట’ అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాలో సాత్విక జంపా హీరోయిన్గా నటిస్తోంది. ఎస్ఆర్డీ ప్రొడక్షన్స్, ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశోక్ కోటిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఫణి అడపాక, జయలక్ష్మీ అడపాక నిర్మిస్తున్నారు.
సోమవారం ‘వేట’ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నటుడు, ఏపీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు, దర్శకులు కేఎస్ రవికుమార్, వీఎన్ ఆదిత్య, మెహర్ రమేష్, సాయి రాజేష్, ఎస్కేఎన్ హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
Sandeep Saroj’s ‘Veta’ Launched with Grand Pooja Ceremony
ముహూర్తపు సన్నివేశానికి నాగబాబు స్క్రిప్ట్ అందించగా, కేఎస్ రవికుమార్ క్లాప్ కొట్టారు. సాయి రాజేష్, ఎస్కేఎన్, వీఎన్ ఆదిత్య, నిర్మాత ఫణి అడపాక కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మెహర్ రమేష్, యదు వంశీ, అనుదీప్ దేవ్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హీరో సందీప్ సరోజ్ మాట్లాడుతూ.. “‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయం అయ్యాను. ఇప్పుడు ‘వేట’తో మరో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉంది. మా సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన నాగబాబు గారితో పాటు అందరికీ ధన్యవాదాలు. ‘వేట’ అనేది మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాకు సంబంధించిన టైటిల్. మా కథకు ఈ టైటిల్ చాలా యాప్ట్‌గా ఉంటుందని భావిస్తున్నాం. ప్రేక్షకులు మా సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాను” అని అన్నారు.
హీరోయిన్ సాత్విక మాట్లాడుతూ.. “‘వేట’ నా కెరీర్లో ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని ఆశిస్తున్నాను. మా సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నాపై నమ్మకం ఉంచి ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు” అని అన్నారు.
ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న కేఎస్ రవికుమార్ మాట్లాడుతూ.. దర్శకుడు అశోక్ కోటిపల్లి తనకు ఫోన్లోనే కథ వివరించారని తెలిపారు. కథ వినగానే ఎంతో ఆసక్తిగా అనిపించిందని చెప్పారు. “కొత్త టీమ్ కలిసి చేస్తున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఇందులో నేను ఊర్లో పెద్దరాయుడు తరహా పాత్రలో కనిపించబోతున్నాను. నా పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంది. ముఖ్యంగా జెన్ జీ ప్రేక్షకులను కూడా ఈ కథ ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాను” అని కేఎస్ రవికుమార్ పేర్కొన్నారు.
దర్శకుడు అశోక్ కోటిపల్లి మాట్లాడుతూ.. “‘వేట’ నా తొలి చిత్రం. ఈ సినిమా ప్రారంభోత్సవానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన నాగబాబు గారికి, ఇతర సినీ ప్రముఖులకు ప్రత్యేక ధన్యవాదాలు. కథ చెప్పిన వెంటనే కేఎస్ రవికుమార్ గారు అంగీకరించడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. నాపై నమ్మకం ఉంచి ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, ఈటీవీ విన్ టీమ్‌కు కృతజ్ఞతలు” అని అన్నారు.
నిర్మాత ఫణి అడపాక మాట్లాడుతూ.. ఈటీవీ విన్‌తో కలిసి చేస్తున్న మూడో ప్రాజెక్ట్ ఇదని తెలిపారు. “‘కమిటీ కుర్రోళ్లు’ తరహాలోనే ఇది కూడా గ్రామీణ నేపథ్యంతో సాగుతుంది. అయితే కథనం పూర్తిగా కొత్తగా ఉంటుంది. దర్శకుడు అశోక్ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. సినిమా ఎంతో సహజంగా ఉంటూనే ప్రేక్షకులను ఆకట్టుకునే కమర్షియల్ అంశాలతో రూపొందుతుంది” అని చెప్పారు. ఈ ప్రయాణంలో తమకు సహకరిస్తున్న ఈటీవీ విన్ టీమ్‌తో పాటు కల్కి రాజా, నాగబాబు, సాయి రాజేష్, మెహర్ రమేష్, వీఎన్ ఆదిత్య, ఎస్కేఎన్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
‘వేట’ చిత్రంలో సందీప్ సరోజ్, సాత్విక జంపా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. కేఎస్ రవికుమార్, రాజీవ్ కనకాల, రఘు బాబు, రవీంద్ర విజయ్, ప్రభావతి, ప్రమోదిని, వికాస్ వశిష్ట తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి వాజిద్ బేగ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తుండగా, రాఘవేంద్ర తిరుణ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఏ. విజయ్ యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంతో పాటు కమర్షియల్ హంగులతో రూపొందనున్న ‘వేట’పై ప్రారంభం నుంచే ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌కు సంబంధించిన వివరాలను చిత్ర బృందం వెల్లడించనుంది.