Rashmika Faces 6-Week Break After Injury
టాలీవుడ్లో వరుసగా స్టార్ హీరోలు గాయాల బారిన పడుతున్న వేళ.. ఇప్పుడు స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కూడా అదే జాబితాలో చేరింది. ఇటీవల పలువురు హీరోలు షూటింగ్‌ల సమయంలో గాయపడి విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రష్మికకు కూడా సినిమా చిత్రీకరణలో ప్రమాదం చోటుచేసుకుంది. ఓ సినిమా కోసం భారీ డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో ఆమెకు గాయం అయింది. ప్రస్తుతం రష్మిక చేతిలో వరుసగా భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘మైసా’తో పాటు విజయ్ దేవరకొండ సరసన ‘రణబాలి’ లో నటిస్తోంది. ఈ రెండు సినిమాల్లోనూ యాక్షన్‌తో పాటు ఫిజికల్‌గా ఎంతో కష్టపడాల్సిన సన్నివేశాలు ఉండటంతో గత కొన్ని నెలలుగా ఆమెపై తీవ్ర శారీరక ఒత్తిడి పడినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో డ్యాన్స్ షూట్ సందర్భంగా ఆమె తుంటి భాగంలోని టెండన్‌కు గాయం అయినట్లు వైద్యులు నిర్ధారించారు. టెండన్ డిటాచ్మెంట్ కారణంగా కనీసం ఆరు వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. సరైన విశ్రాంతి తీసుకుంటేనే గాయం పూర్తిగా నయమవుతుందని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. ఇలాంటి టెండన్ గాయాలు సాధారణంగా నిరంతరం శారీరక శ్రమ చేసే అథ్లెట్లలో ఎక్కువగా కనిపిస్తాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే వరుస షూటింగ్‌లు, యాక్షన్ ఎపిసోడ్లు, డ్యాన్స్ రిహార్సల్స్ కారణంగా రష్మికకు కూడా ఇదే సమస్య ఎదురైనట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
Rashmika Faces 6-Week Break After Injury
ప్రస్తుతం రష్మిక నాలుగు భారీ చిత్రాలతో పాటు ముప్పైకి పైగా ప్రముఖ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతోంది. ఆమెకు వైద్యులు విశ్రాంతి సూచించడంతో ఇప్పటికే ప్లాన్ చేసిన పలు షూటింగ్ షెడ్యూల్స్ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆమె సినిమాల నిర్మాతలు, బ్రాండ్ కమిట్మెంట్ల షెడ్యూల్స్ కూడా తిరిగి ప్లాన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అభిమానులు మాత్రం రష్మిక త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్లలో పాల్గొనాలని సోషల్ మీడియాలో ఆకాంక్షిస్తున్నారు.