Rao Bahadur Movie Review
రివ్యూ : రావు బహదూర్.. ప్రేక్షకుడి సహనానికి పరీక్ష
నటీనటులు : సత్యదేవ్, వికాస్ ముప్పాల, దీపా థామస్, బాలా పరాశర్, ఆనంద్, ప్రణయ్ వాకా, కునాల్ కౌశిక్, మాస్టర్ కిరణ్ తదితరులు
కథ, కథనం, దర్శకత్వం : వెంకటేశ్ మహా
సమర్పణ : మహేష్ బాబుకు సంబంధించిన జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్
బ్యానర్ : A+S మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్, మహాయాన మోషన్ పిక్చర్స్
నిర్మాతలు : అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చింతా గోపాలకృష్ణా రెడ్డి
సినిమాటోగ్రఫీ : కార్తీక్ పర్మార్
ఎడిటర్ : వెంకటేశ్ మహా
మ్యూజిక్ – : స్మరణ్ సాయి
విడుదల తేదీ : 03/07/2026
నిడివి : 2 గంటల 49 నిమిషాలు
రేటింగ్ : 2.5/5
Rao Bahadur Movie Review
వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో సత్యదేవ్, దర్శకుడు వెంకటేష్ మాహా మరోసారి ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ తర్వాత వీరిద్దరి కాంబోలో రూపొందిన ‘రావు బహదూర్’ చిత్రంపై మంచి బజ్ నెలకొంది. భిన్నమైన కథ, వినూత్నమైన ట్రీట్మెంట్తో వస్తోన్న ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన ‘రావు బహదూర్’ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది? వెంకటేష్ మాహా మరోసారి తన మ్యాజిక్ చూపించగలిగాడా? సత్యదేవ్ ఖాతాలో ఇది మరో గుర్తుండిపోయే సినిమాగా నిలిచిందా? పూర్తి రివ్యూలో తెలుసుకుందాం.
కథ విషయానికొస్తే..
1969 నుంచి 1991 మధ్యకాలం నేపథ్యంలో సాగే ‘రావు బహదూర్’ కథ మొత్తం రామప్ప అలియాస్ రామప్ప రావు బహదూర్ చుట్టూనే తిరుగుతుంది. ఓ రాజ కుటుంబానికి వారసుడైన రామప్ప (సత్యదేవ్) వయసులో ఉన్నప్పుడు ఇల్లు వదిలి ప్రపంచయాత్ర చేస్తుంటాడు. ఒకానొక సమయంలో తన తండ్రికి ఆరోగ్యం క్షీణించడంతో ఇంటికి చేరుకుంటాడు. అప్పుడే ఆయన తండ్రిని చూసుకోవడానికి నర్స్ రేణుక (దీపా థామస్) వాళ్ల ఇంటికి వస్తుంది. తర్వాత వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉంటారు. కానీ ఎనిమిదేళ్లుగా ఒకే గదికి పరిమితమైన రామప్ప.. తన భార్య రేణుక (దీపా థామస్) కూడా మరో గదిలో దూరంగా ఉండి జీవిస్తుంటారు. ఒకప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో ఇలా దూరంగా జీవించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? వారి చిన్న కుమారుడు కుసుమప్ప కొలనులో పడి చనిపోయిన తర్వాత రామప్ప మనసులో మొదలైన అనుమానం ఏంటి? కుసుమప్ప తన సొంత కొడుకు కాదని అతను ఎందుకు నమ్ముతుంటాడు? ఆ అనుమానమే తన ప్రాణాన్ని కూడా విడిచిపెట్టనివ్వడం లేదని రామప్ప తన స్నేహితుడు, వైద్యుడు అయిన ఆచారికి చెబుతుంటాడు. రాజభవనాన్ని, కుటుంబ వ్యవహారాలను చూసుకుంటూ పెద్ద కొడుకు లవనప్ప ఉండగా.. రామప్ప మాత్రం గతం, అనుమానం, నమ్మకాల మధ్య నలుగుతుంటాడు. అసలు రామప్పను వెంటాడుతున్న ఆ మానసిక వేదనకు కారణం ఏమిటి? కుసుమప్ప మరణం వెనక ఉన్న నిజం ఏంటి? రేణుకతో అతని బంధం ఎందుకు విచ్ఛిన్నమైంది? చివరికి రామప్ప మనసును ఏళ్ల తరబడి తొలిచేసిన ప్రశ్నకు సమాధానం దొరికిందా? అనుమానం అనే పెనుభూతం నుంచి అతనికి విముక్తి లభించిందా లేదా? అన్నదే ‘రావు బహదూర్’ కథ.
ఎవరెలా చేశారంటే..
నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో ప్రధాన బలం సత్యదేవ్ అనే చెప్పాలి. ఒకరకంగా ఇది అతడి వన్ మ్యాన్ షోలా అనిపిస్తుంది. యువకుడిగా, వయసు మీదపడి మానసిక వేదనతో కృంగిపోయే వ్యక్తిగా.. రెండు భిన్నమైన షేడ్స్‌లో సత్యదేవ్ అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా తన రెండో కుమారుడు తనకు పుట్టలేదనే అనుమానంతో కసి, కోపం, భయం, ఆవేదన మధ్య ఊగిసలాడే సన్నివేశాల్లో అతని నటన పీక్స్‌లో ఉంటుంది. గెటప్స్, లుక్స్, బాడీ లాంగ్వేజ్ మాత్రమే కాదు.. డబ్బింగ్లో చూపించిన వేరియేషన్స్ కూడా పాత్రను మరింత బలంగా నిలబెట్టాయి. మరోసారి తనలోని నటుడి స్థాయిని సత్యదేవ్ ఈ సినిమాతో రుజువు చేశాడనే చెప్పాలి. రేణుక పాత్రలో దీపా థామస్ స్క్రీన్‌పై అందంగా కనిపించడమే కాకుండా, తన పాత్రకు అవసరమైన భావోద్వేగాలను కూడా బాగా పలికించింది. అయితే కథ మొత్తం రామప్ప చుట్టూనే తిరగడంతో ఆమె పాత్రకు అంతగా స్పేస్ దక్కలేదనే భావన కలుగుతుంది. ఆచారి పాత్రలో వికాస్ ముప్పాల మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సత్యదేవ్ తర్వాత సినిమాలో ఎక్కువగా గుర్తుండిపోయే పాత్రల్లో ఇదొకటి. స్నేహితుడిగా, వైద్యుడిగా కథలో కీలకమైన పాత్రను అతను సహజంగా మోశాడు. ఇక లవణ, కుసుమ, అచ్చమ్మ వంటి పాత్రల్లో కనిపించిన నటీనటులు తమ తమ పరిధిలో బాగానే చేశారు. సత్యదేవ్ కుమారుడి పాత్రలో నటించిన బాల నటుడు కూడా ఆకట్టుకుంటాడు. చివర్లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించిన ఆనంద్ చిన్నపాటి పాత్రలోనే మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు. మొత్తంగా చూస్తే.. ఈ సినిమాలో నటన పరంగా సత్యదేవ్ స్పష్టంగా హైలైట్‌గా నిలిచినా, మిగిలిన నటీనటులు కూడా కథకు అవసరమైన స్థాయిలో తమ వంతు న్యాయం చేశారు.
టెక్నికల్‌గా ఎలా ఉందంటే..
సాంకేతికంగా ‘రావు బహదూర్’ మంచి స్థాయిలో నిలుస్తుంది. దాదాపు ఒకే ప్రదేశం, ఒకే సెటప్ చుట్టూ కథ తిరిగినా కూడా దాన్ని విజువల్‌గా రిపిటేటివ్‌గా కాకుండా కొత్తగా చూపించడంలో టీమ్ బాగా సక్సెస్ అయింది. కొన్ని ఫ్రేమ్స్, కెమెరా యాంగిల్స్, సన్నివేశాలను డిజైన్ చేసిన తీరు సినిమాకు ప్రత్యేకమైన మూడ్ తీసుకొచ్చాయి. 1969 నుంచి 1991 మధ్యకాలం నేపథ్యాన్ని ఛాయాగ్రహణం అందంగా ఆవిష్కరించగా, ఆర్ట్ డిపార్ట్మెంట్ పని కూడా ఆ కాలపు వాతావరణాన్ని బలంగా నిలబెట్టింది. కాస్ట్యూమ్స్, సెట్స్, ప్రొడక్షన్ డిజైన్ ఇవన్నీ పీరియడ్ ఫీల్ తీసుకొచ్చాయి. స్మరణ్ సాయి సంగీతం కథకు తగ్గట్టుగా పనిచేసింది. పాటలు, నేపథ్య సంగీతం రెండూ కథ మూడ్‌ను మోసే ప్రయత్నం చేశాయి. కొన్ని పాటలు కథనాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఉపయోగపడినా, మధ్య మధ్యలో అవి కాస్త డిస్టర్బెన్స్‌గా అనిపించే అవకాశం ఉంది. ఎడిటింగ్ కూడా ఓవరాల్‌గా ఓకే అనిపిస్తుంది. ముఖ్యంగా కథ నెమ్మదిగా సాగే స్వభావాన్ని దృష్టిలో పెట్టుకుంటే, అటు ఇటు మారిపోయే స్ర్కీన్‌ప్లేకు తనదైన పదును పెట్టారు.
ఇక రచన, డైలాగ్స్ పరంగా కూడా పర్వాలేదనిపిస్తాయి. ముఖ్యంగా తండ్రి కోసం కొడుకు రాసిన కవిత, కొన్ని సంభాషణలు గుర్తుండిపోతాయి. దర్శకుడు వెంకటేష్ మాహా తన ఆలోచన, విజన్, కథ చెప్పే శైలిని ఈ సినిమాతో మరోసారి బలంగా చూపించాడు. అయితే అదే సమయంలో ఈ కథనం, ట్రీట్మెంట్ ప్రతి ఒక్కరికీ ఒకే స్థాయిలో కనెక్ట్ అవుతుందా అన్నది మాత్రం ప్రశ్నగానే మిగులుతుంది. వేగంగా సాగే కమర్షియల్ కథలను ఆశించే ప్రేక్షకులకు ఇది కాస్త నెమ్మదిగా, హెవీగా అనిపించొచ్చు. కానీ ఓపికగా, కథలోని భావాన్ని పట్టుకుని చూస్తే మాత్రం ‘రావు బహదూర్’ టెక్నికల్‌గా మంచి అనుభూతిని ఇచ్చే సినిమా అని చెప్పొచ్చు.
సినిమా ఎలా ఉందంటే..
‘రావు బహదూర్’ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్లో సాగే సినిమా కాదు. ఇది పూర్తిగా ఒక వ్యక్తి మనస్తత్వం, అనుమానం, ఆత్మపరిశీలన, సంబంధాల మధ్య జరిగే అంతర్మథనంపై నిలిచిన కథ. అందుకే మొదటి నుంచే దర్శకుడు వెంకటేష్ మాహా తనకు అలవాటైన నెమ్మదైన, ఆలోచింపజేసే కథన శైలినే ఎంచుకున్నాడు. కథలోని భావోద్వేగాలు, రామప్ప పాత్రలోని మానసిక సంఘర్షణ, ఆ అనుమానం చుట్టూ నడిచే డ్రామా సినిమాకు ప్రధాన బలాలుగా నిలుస్తాయి. ముఖ్యంగా సత్యదేవ్ నటన, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు, కథలో దాచిన మిస్టరీని దర్శకుడు ఒక్కో దశలో విప్పే తీరు ప్రేక్షకుడిని కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాయి. అయితే ఇదే సమయంలో సినిమా అందరికీ ఒకేలా కనెక్ట్ అవుతుందనుకోవడం కష్టం. కథ చెప్పిన తీరు, నెమ్మదిగా ముందుకు సాగే స్క్రీన్‌ప్లే, కొన్ని చోట్ల ఎక్కువగా అనిపించే సింబాలిజం కారణంగా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఆశించే ప్రేక్షకులకు ఇది కాస్త భారంగా అనిపించొచ్చు. దర్శకుడు చెప్పాలనుకున్న భావం, అందులోని అంతర్మథనం, మానసిక వేదనను పట్టుకుని చూస్తే మాత్రం సినిమా మంచి అనుభూతినే ఇస్తుంది. కానీ కేవలం టైమ్‌పాస్ ఎంటర్టైన్మెంట్ కోణంలో చూస్తే ‘రావు బహదూర్’ అందరికీ నచ్చే సినిమా కాకపోవచ్చు. ఏ మాత్రం అర్ధం కాకపోయినా కన్ఫ్యూజన్ డ్రామాగా నిలిచే అవకాశం ఉంది. దర్శకుడు గెటప్పులు, యాక్టింగ్‌పైన పెట్టిన ఫోకస్ కథ, కథనంలో లేకపోవడం కాస్త నిరాశపరచవచ్చు. అలాగే కలర్ డిస్క్రిమినేషన్ ఆధారంగా బిడ్డను కాదనడం, భార్యను అనుమానించడం లాంటివి ప్రేక్షకుడిని అసహనానికి గురి చేస్తాయి. అనుమానం పెనుభూతం అనేలా
ప్లస్ పాయింట్స్ :
సత్యదేవ్ అద్భుతమైన నటన
పీరియడ్ ఫీల్ తీసుకొచ్చిన విజువల్స్, ఆర్ట్ వర్క్
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కొన్ని డైలాగ్స్
మైనస్ పాయింట్స్ :
నెమ్మదిగా సాగే స్క్రీన్‌ప్లే
కొన్ని చోట్ల కథనం మరీ హెవీగా అనిపించడం
మధ్య మధ్యలో వచ్చే అర్ధంకాని పాటలు
దర్శకుడు చెప్పాలనుకున్న భావం అందరికీ ఒకేలా రీచ్ కాకపోవచ్చు
ఫైనల్‌గా : ప్రేక్షకుడికి కనెక్ట్ అయితే జస్ట్ ఓకే.. లేదంటే సహనానికి పరీక్షే అన్నట్టుగా ఉంటుంది.