Nagabandham movie review
రివ్యూ : నాగబంధం.. గ్రాండ్ విజువల్ ఎక్స్పీరియన్స్
నటీనటులు : విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్, దక్ష నగర్కర్, మహేష్ మంజ్రేకర్, జగపతిబాబు, మురళీ శర్మ, రిషబ్ సావ్నీ తదితరులు..
కథ, కథనం, దర్శకత్వం : అభిషేక్ నామా
బ్యానర్ : ఎన్వీ స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్
నిర్మాతలు : కిషోర్ అన్నపురెడ్డి, నిశిత్ నాగిరెడ్డి
సినిమాటోగ్రఫీ : సౌందర్ రాజన్ ఎస్
ఎడిటర్ : ఆర్.సి.ప్రణవ్
మ్యూజిక్ : జునైద్ కుమార్, అభి
విడుదల తేదీ : 03/07/2026
నిడివి : 3 గంటల 5 నిమిషాలు
రేటింగ్ : 3/5 ⭐⭐⭐☆☆
‘పెదకాపు’ తర్వాత విరాట్ కర్ణ, అలాగే ‘డెవిల్’ తర్వాత నిర్మాత అభిషేక్ నామా దర్శకుడిగా రూపొందించిన చిత్రం ‘నాగబంధం’. అభిషేక్ నామా డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కిన ఈ చిత్రం అనంత పద్మనాభ స్వామి ఆలయం బ్యాక్‌డ్రాప్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ట్రైలర్, ప్రమోషన్స్‌తో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. విజువల్‌గా గ్రాండ్‌గా కనిపించిన ఈ చిత్రం నిజంగానే ఆ హైప్‌కు తగ్గట్టుగా ఉందా? కథ, స్క్రీన్‌ప్లే, ఎమోషన్స్, థ్రిల్ అంశాలతో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అసలు `నాగబంధం` థియేటర్లలో ఎలాంటి అనుభూతి ఇస్తుంది? అనే విషయాలను ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథ విషయానికొస్తే..
మరణాన్ని జయించే శక్తి, అపారమైన సంపద, ఈ సృష్టిని శాసించే ఆధిపత్యం.. ఇవన్నీ ఒకే చోట కలిసే మిస్టికల్ ప్రపంచమే `నాగబంధం` కథకు కేంద్రబిందువు. 1960ల కాలంలో సాగే ఈ కథలో పురావస్తు శాస్త్రవేత్త ప్రభాకర్ (జగపతిబాబు) నాగబంధం అనే అంతుచిక్కని రహస్యాన్ని ఛేదించే ప్రయత్నంలో ఉంటాడు. హిమాలయాల్లో లభించిన ఓ పురాతన గ్రంథం ద్వారా నాగబంధానికి, అలాగే అమోఘ శక్తులు కలిగిన `బ్రహ్మకమలం`కు సంబంధించిన కీలక సమాచారం బయటపడుతుంది. ఆ బ్రహ్మకమలం శ్రీరంగనాథ స్వామి నాభి వద్ద దాగి ఉందని తెలిసిన తర్వాత, దాన్ని చేజిక్కించుకోవడానికి కుట్రలు మొదలవుతాయి. ఈ అమూల్యమైన శక్తిని స్వాధీనం చేసుకుని అసాధారణ బలం, చిరంజీవత్వం సంపాదించాలని విలన్ అలీ/అజాత్ (రిషబ్ సావ్నీ) ప్రయత్నిస్తాడు. అతని లక్ష్యం కేవలం బ్రహ్మకమలం దక్కించుకోవడమే కాదు.. నాగబంధం వెనక దాగి ఉన్న మహా రహస్యాన్ని తెరపైకి తేవడం కూడా. ఇందుకోసం అతడు విధ్వంసానికి తెరలేపుతాడు. ఇదే సమయంలో మరోవైపు రుద్ర (విరాట్ కర్ణ) తన కుటుంబంతో ప్రశాంతంగా జీవిస్తుంటాడు. చెల్లెలంటే ప్రాణంగా చూసుకునే రుద్ర జీవితంలో, ఆమె పెళ్లి రోజు చోటుచేసుకునే ఘోర సంఘటనలు అన్నింటినీ తారుమారు చేస్తాయి. విలన్ దాడిలో రుద్ర కుటుంబం దారుణంగా నాశనం అవుతుంది. ఆ క్రమంలో బ్రహ్మకమలం కోసం జరుగుతున్న ఈ రక్తపాతం, రుద్ర వ్యక్తిగత విషాదంతో ముడిపడుతుంది. ఇక రుద్ర ప్రేమించిన పార్వతి (నభా నటేష్) పాత్ర కూడా కథలో కీలక మలుపు తీసుకొస్తుంది. నాగబంధం విడుదలైతే ఏమవుతుంది? బ్రహ్మకమలం కోసం జరుగుతున్న ఈ వేట వెనక అసలు ఉద్దేశం ఏమిటి? రుద్రకు నాగబంధంతో, అలాగే అనంత పద్మనాభస్వామి ఆలయ రహస్యాలతో ఉన్న సంబంధం ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే `నాగబంధం` సినిమా కథ.
ఎవరెలా చేశారంటే ..
`నాగబంధం`లో రుద్ర పాత్రలో విరాట్ కర్ణ మంచి ఎనర్జీతో కనిపించాడు. సాధారణ యువకుడిగా, కుటుంబానికి అండగా నిలిచే వ్యక్తిగా ఒక వైపు, యాక్షన్ మోడ్‌లో మరోవైపు తన పాత్రకు తగ్గట్టు నటించాడు. రెండు షేడ్స్‌లో కనిపించే ఈ పాత్రలో బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో ఆయన పెర్ఫార్మెన్స్ బాగుంది. క్లైమాక్స్‌కు ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్‌లో కూడా తన వంతు ఇంపాక్ట్ చూపించాడు. హీరోగా విరాట్ కర్ణకు ఇది మరో మెట్టు ఎక్కించే సినిమా అనిపించినా, సినిమా డిమాండ్ చేసిన భారీ స్థాయికి ఆయన ఇమేజ్ పూర్తిగా మ్యాచ్ కాలేదనే భావన మాత్రం కలుగుతుంది. పార్వతి పాత్రలో నభా నటేష్‌కి కథలో మంచి ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కింది. గ్లామర్‌కే పరిమితం కాకుండా, కథను మలుపు తిప్పే కీలక పాత్రలో ఆమె కనిపించింది. పాత్రలోని ట్విస్ట్ కూడా బాగా వర్కవుట్ అయింది. కొన్ని చోట్ల నటనకు కూడా మంచి స్కోప్ దక్కగా, నభా ఆ అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకుంది. మరోవైపు ఐశ్వర్య మీనన్, దక్ష నగర్కర్ పాత్రలు పరిమితంగానే ఉన్నా, తమ స్క్రీన్ టైమ్‌లో ఓకే అనిపించారు. ఆర్కియాలజిస్ట్ ప్రభాకర్‌గా జగపతిబాబు తన అనుభవాన్ని మరోసారి చూపించాడు. కథను ముందుకు నడిపించే పాత్రలో ఆయన తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో మెప్పించాడు. ఆయన పాత్రలో దాచిన మలుపు కూడా సినిమాకు ఆసక్తి పెంచే అంశంగా నిలుస్తుంది. విలన్‌గా రిషబ్ సావ్నీ పాత్ర మాత్రం సినిమాకు మంచి బలం. క్రూరత్వం, ఆశ, మిస్టిక్ పవర్ కోసం పడే తపన ఈ మూడు కోణాలను బాగా చూపిస్తూ ప్రభావం చూపించాడు. హీరోకి సరైన ప్రతినాయకుడిగా నిలిచాడు. బైరాగి పాత్రలో గరుడ రామ్ కనిపించే విధానం, ఆయన గెటప్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పాత్రకు అవసరమైన మిస్టీరియస్ టచ్‌ను బాగా తీసుకువచ్చాడు. అనసూయ, మురళీ శర్మ, శ్రీనిధి సింగ్, శరత్, అంకిత్ కొయ్య, ముకేష్ తదితరులు తమ తమ పాత్రల పరిధిలో కథకు అవసరమైన సపోర్ట్ ఇచ్చారు.
టెక్నికల్ విషయానికొస్తే..
`నాగబంధం`కు టెక్నికల్‌గా మంచి బలమే ఉంది. ముఖ్యంగా సంగీతం సినిమాకు పెద్ద ప్లస్‌గా నిలుస్తుంది. జునైద్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అధిక ప్రభావం చూపిస్తుంది. కీలక సన్నివేశాల్లో బీజీఎం సినిమాకు కావాల్సిన ఎలివేషన్ తీసుకొచ్చి, మిస్టిక్ థ్రిల్లర్ ఫీలింగ్‌ను బలపరిచింది. సౌందర్‌రాజన్ సినిమాటోగ్రఫీ కూడా ఈ చిత్రానికి మరో హైలైట్. హిమాలయాల బ్యాక్‌డ్రాప్, దేవాలయ సన్నివేశాలు, యాక్షన్ బ్లాక్స్‌ను ఆయన గ్రాండ్‌గా చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. కొన్ని ఫ్రేమ్స్ అయితే నిజంగా విజువల్‌గా రిచ్‌గా అనిపిస్తాయి. వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా సినిమా స్కేల్‌కు తగ్గట్టుగానే కనిపిస్తుంది. ముఖ్యంగా ఫాంటసీ, మిస్టికల్ ఎలిమెంట్స్ ఉన్న సన్నివేశాల్లో గ్రాఫిక్స్ బాగానే ఉపయోగించారు. అయితే కొన్ని చోట్ల మాత్రం ఆ క్వాలిటీ పూర్తిగా నిలబడలేదు. ప్రొడక్షన్ డిజైన్ పరంగా అశోక్ పనితనం కనిపిస్తుంది. సెట్స్, కాలానికి తగ్గ ఆర్ట్ వర్క్, కథలోని పురాణ-మిస్టిక్ ప్రపంచాన్ని తెరపై చూపించిన తీరు సినిమాకు గ్రాండియర్ తీసుకొచ్చాయి. నిర్మాతలు ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదనే విషయం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. అయితే టెక్నికల్ బలం ఉన్నప్పటికీ, కంటెంట్ పరంగా మరింత స్ట్రాంగ్‌గా ఉంటే బాగుండనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే విజువల్స్, మ్యూజిక్, ప్రొడక్షన్ విలువలతో `నాగబంధం` మెప్పించినా.. కథనం, స్క్రీన్‌ప్లే పరంగా మాత్రం ఆశించిన స్థాయికి చేరలేకపోయింది.
సినిమా ఎలా ఉందంటే..
పురాణాలు, దైవశక్తులు, రహస్య గ్రంథాలు, ఆలయాల వెనుక దాగి ఉన్న మిస్టరీలు.. ఈ జానర్ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పటినుంచో ప్రత్యేక ఆదరణ ఉంది. కథలో ఆధ్యాత్మికత, అడ్వెంచర్, థ్రిల్ సహజంగా మిళితమైతే అలాంటి చిత్రాలు మంచి అనుభూతిని ఇస్తాయి. `నాగబంధం` కూడా అదే తరహాలో మిస్టిక్ ఎలిమెంట్స్, పురాణ నేపథ్యం, దైవశక్తుల కాన్సెప్ట్‌తో ఒక ఆసక్తికరమైన ప్రపంచాన్ని సృష్టించే ప్రయత్నం చేసింది. `నాగబంధం`, `బ్రహ్మకమలం`, వాటి వెనుక ఉన్న రహస్యాలు, మిస్టిక్ పవర్స్ వంటి అంశాలు సినిమాపై ఆసక్తిని నిలబెడతాయి. ముఖ్యంగా ఈ కథకు ఎంచుకున్న బ్యాక్‌డ్రాప్, దాన్ని విజువల్‌గా ప్రెజెంట్ చేసిన తీరు ప్రేక్షకుడిని ఓ కొత్త లోకంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాయి. సినిమా మొదటి నుంచి చివరి వరకు ఒక పెద్ద కాన్వాస్‌పై సాగుతుంది. మిస్టరీ, యాక్షన్, పురాణ గాధల మేళవింపుతో కథను నడిపించే ప్రయత్నం కనిపిస్తుంది. హీరో రుద్ర జీవితాన్ని, బ్రహ్మకమలం చుట్టూ తిరిగే ప్రధాన కథను, నాగబంధం రహస్యాన్ని కలిపి చెప్పాలన్న దర్శకుడి ఆలోచన ఆకర్షణీయంగానే ఉంటుంది. కొన్ని సన్నివేశాలు విజువల్‌గా బలంగా ఉండటమే కాకుండా, మిస్టిక్ థ్రిల్లర్ ఫీల్‌ను కూడా తీసుకొస్తాయి. ముఖ్యంగా విలన్ ట్రాక్, దైవశక్తులకు సంబంధించిన ఎపిసోడ్లు, కథలో వచ్చే కొన్ని ట్విస్టులు ప్రేక్షకుడిలో ఆసక్తిని నిలబెట్టే అంశాలుగా నిలుస్తాయి. అయితే ఈ ఆసక్తికరమైన ప్రపంచాన్ని కథనం పరంగా ఇంకా కాస్త బలంగా కట్టిపడేస్తే ఫలితం మరింత మెరుగ్గా ఉండేదనిపిస్తుంది. హీరో వ్యక్తిగత జీవితం, కుటుంబ భావోద్వేగాలు, ప్రధాన మిస్టిక్ ట్రాక్ ఈ మూడు లేయర్స్ కొన్నిచోట్ల మరింత స్ట్రాంగ్‌గా ఉంటే ప్రేక్షకుడికి ఇంకా గట్టిగా కనెక్ట్ అయ్యేదేమో అనిపిస్తుంది. అలాగే కొన్ని సన్నివేశాల్లో ఎలివేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల కథన ప్రవాహం కొద్దిగా ఎగుడుదిగుడుగా అనిపించే సందర్భాలు ఉన్నాయి. ఎమోషనల్ ట్రాక్ కూడా కొన్ని చోట్ల ఇంకాస్త బలంగా డిజైన్ అయి ఉంటే, రుద్ర ప్రయాణం మరింత ప్రభావవంతంగా నిలిచేదనే భావన కలుగుతుంది. మొత్తానికి `నాగబంధం` ఒక గ్రాండ్ విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే లక్ష్యంతో రూపొందిన మిస్టిక్ అడ్వెంచర్ థ్రిల్లర్. పురాణ-ఫాంటసీ అంశాలు, మిస్టరీ ఎలిమెంట్స్, విజువల్ స్కేల్ ఈ సినిమాను ఆసక్తికరంగా నిలబెడతాయి.
ప్లస్ పాయింట్స్ :
మిస్టిక్ అడ్వెంచర్ థ్రిల్లర్‌కు తగ్గ గ్రాండ్ విజువల్స్
సౌందర్‌రాజన్ సినిమాటోగ్రఫీ
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కొన్ని పాటలు
విరాట్ కర్ణ, నభా నటేష్, జగపతిబాబు, రిషబ్, గరుడ రామ్ నటన
ప్రొడక్షన్ డిజైన్, మేకింగ్‌లో కనిపించిన రిచ్‌నెస్
మైనస్ పాయింట్స్ :
కథ, కథనం
బలహీనమైన స్క్రీన్‌ప్లే
బలవంతంగా వచ్చినట్టు అనిపించే కొన్ని ట్రాక్స్, ఎలివేషన్స్
ఫైనల్‌గా.. :
`నాగబంధం` ఒక భారీ స్కేల్లో రూపొందిన మిస్టిక్ అడ్వెంచర్ థ్రిల్లర్. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ విలువలు, కొంతమంది నటీనటుల పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు బలంగా నిలుస్తాయి. ముఖ్యంగా తెరపై కనిపించే గ్రాండియర్, పురాణ-మిస్టిక్ బ్యాక్‌డ్రాప్, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకుడికి ఒక పెద్ద కాన్వాస్‌పై సినిమా చూస్తున్న ఫీలింగ్‌ను ఇస్తాయి. నాగబంధం, బ్రహ్మకమలం, ఆలయ రహస్యాలు, దైవశక్తులు వంటి ఆసక్తికరమైన అంశాలు ఉన్నప్పటికీ, స్క్రీన్‌ప్లే మరింత బలంగా ఉంటే బాగుండేది. గ్రాండ్ మేకింగ్‌తో వండర్ఫుల్ విజువల్ ఎక్స్‌పీరియెన్స్ అందిస్తుంది.