Manoj Manchu Renovates Dasari Memorial
తెలుగు సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన దర్శకరత్న, స్వర్గీయ దాసరి నారాయణరావు స్మారక ఘాట్ దుస్థితిపై సోషల్ మీడియాలో వచ్చిన ఒక వీడియోకు హీరో మనోజ్ మంచు హృదయపూర్వకంగా స్పందించారు. యాంకర్ గౌతమి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆ వీడియోలో ఘాట్ పరిసరాల నిర్లక్ష్య స్థితి స్పష్టంగా కనిపించడంతో, మనోజ్ వెంటనే చర్యలకు దిగారు.
Manoj Manchu Renovates Dasari Memorial
వీడియోను చూసిన అనంతరం సోషల్ మీడియా వేదికగా స్పందించిన మనోజ్ మంచు, “దాసరి గారి ఘాట్ చుట్టూ ఉన్న ఈ పరిస్థితిని చూసి నిజంగా చాలా బాధ కలిగింది. తెలుగు సినిమా అభివృద్ధికి అపార సేవలు అందించిన దాసరి నారాయణరావు గారికి మనమందరం రుణపడి ఉంటాం. ఈ విషయాన్ని అందరి దృష్టికి తీసుకువచ్చిన వారికి ధన్యవాదాలు. నా వంతుగా చేయగలిగిన సహాయం తప్పకుండా చేస్తాను” అంటూ హామీ ఇచ్చారు.
ఆ మాటలను నిలబెట్టుకుంటూ మరుసటి రోజు ఉదయమే తన సినిమా షూటింగ్‌కు వెళ్లే ముందు మనోజ్ మంచు తన టీమ్‌తో కలిసి దాసరి ఘాట్ వద్దకు చేరుకున్నారు. అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించి, ఆయన సమాధిని, చుట్టూ పెరిగిఉన్న చెట్టను శుభ్రపరిచారు.
ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ, “మూడు నాలుగేళ్ల క్రితం ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు చూడటం చాలా బాధ కలిగించింది. చిత్రపురి కాలనీ దాటుతుండగా దాసరి గారి విగ్రహం కనిపించి ఘాట్ గుర్తొచ్చింది. తర్వాత మా టీమ్ ఆ వీడియో చూపించడంతో అసలు పరిస్థితి తెలిసింది. ఆ దృశ్యాలు నన్ను తీవ్రంగా కలిచివేశాయి. అందుకే నా షూటింగ్‌కు వెళ్లే ముందు ఇక్కడికి వచ్చి ఈ పనికి ప్రాధాన్యత ఇచ్చాను” అని తెలిపారు.
మనోజ్ మంచు తన టీమ్‌తో కలిసి ఘాట్ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్త, ఎండుటాకులు తొలగిస్తూ మొత్తం ప్రాంతాన్ని శుభ్రం చేయించారు. దాసరి నారాయణరావుపై తనకున్న గౌరవాన్ని కార్యరూపంలో చూపిస్తూ ఆయన చేసిన ఈ చర్య ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది.
Manoj Manchu Renovates Dasari Memorial
ఇటీవల మనోజ్ మంచు, ఆయన సతీమణి మౌనిక కలిసి ప్రారంభించిన ‘ఐక్య ధైర్య సేన సమితి’ ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రక్తదాన శిబిరాలు, అవసరమైన వారికి సహాయం, అనాథాశ్రమాల సందర్శనలు వంటి కార్యక్రమాల ద్వారా సమాజానికి అండగా నిలుస్తున్నారు. “వాయిస్‌లెస్‌కు వాయిస్” అనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఈ సంస్థ సేవా కార్యక్రమాల్లో దాసరి ఘాట్ పునరుద్ధరణ మరో విశిష్ట ఘట్టంగా నిలిచింది.
సినిమా రంగానికి విశిష్ట సేవలు అందించిన మహనీయుల పట్ల గౌరవాన్ని కేవలం మాటల్లో కాకుండా చేతల్లో చూపించిన మనోజ్ మంచు చర్య సినీ వర్గాలతో పాటు అభిమానుల ప్రశంసలను అందుకుంటోంది. దాసరి నారాయణరావు ఘాట్ పునరుద్ధరణ కోసం ఆయన తీసుకున్న ఈ చొరవ, సామాజిక బాధ్యత పట్ల ఆయన నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది.