Vishal Makutam Movie Telugu Review
చిత్రం : మకుటం
రేటింగ్ : 1.5/5
నటీనటులు : విశాల్, దుషారా విజయన్, అంజలి, జాన్ విజయ్, జయప్రకాశ్ తదితరులు
బ్యానర్ : సూపర్ గుడ్ ఫిల్మ్స్
సమర్పణ : ఆర్బీ చౌదరి
నిర్మాతలు : బి. సురేష్, ఆర్.బి. జీవన్ చౌదరి, జితన్ రమేష్, జీవా
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : విశాల్
సంగీత దర్శకుడు : జీవీ ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రాఫర్ (డీవోపీ):రిచర్డ్ ఎం. నాథన్ & అభినందన్ రామానుజం
ఎడిటర్ : ఎన్బీ శ్రీకాంత్
విడుదల తేదీ : 14 ఆగస్టు 2026
Vishal Makutam Movie Telugu Review
హీరోగా రెండు దశాబ్దాలకు పైగా ప్రేక్షకులను అలరిస్తున్న విశాల్.. తొలిసారి మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన సినిమా ‘మకుటం’. భారీ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ 99వ చిత్రంగా రూపొందిన ఈ సినిమాపై దర్శకుడిగా విశాల్ ఎలాంటి ముద్ర వేస్తారనే ఆసక్తి నెలకొంది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ విషయానికొస్తే..
కృప (విశాల్) ఓ సాధారణ మెడికల్ రిప్రజెంటేటివ్. నెలకు రూ.25 వేల జీతంతో భార్య (దుషారా విజయన్), ఇద్దరు పిల్లలతో కలిసి మధ్యతరగతి జీవితాన్ని సాగిస్తుంటాడు. పెళ్లికి ముందు తనకు కారు ఉందని మామగారికి చెప్పిన అబద్ధాన్ని నిజం చేసేందుకు ఓ పాత బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేస్తాడు. కుటుంబంతో కలిసి ఊటీకి వెళ్లిన కృప జీవితంలో అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటాయి. అసలు అంత సాధారణంగా కనిపించే కృపను కొందరు ఎందుకు చంపాలని ప్రయత్నిస్తారు? అతని గతం ఏంటి? లింగా ఎవరు? అన్నపూర్ణతో అతనికి ఉన్న సంబంధం ఏమిటి? తన కుటుంబాన్ని శత్రువుల నుంచి కృప ఎలా కాపాడుకుంటాడు? అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి..
విశాల్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయంలో కనిపిస్తారు. అయితే రెండు పాత్రల్లోనూ ఆయన నుంచి ఆశించే స్థాయి పెర్ఫార్మెన్స్ కనిపించదు. ముఖ్యంగా వృద్ధుడి పాత్రలో ఆయన గెటప్ సహజంగా అనిపించదు. ఫ్లాష్‌బ్యాక్‌లో కనిపించే లుక్ కూడా గతంలో చూసిన పాత్రలను గుర్తు చేస్తుంది. దుషారా విజయన్, అంజలి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేదు. కథలో కీలకంగా కనిపించినా వారి పాత్రలను సరిగ్గా ఎలివేట్ చేయలేదు. జాన్ విజయ్, జయప్రకాశ్, ఝాన్సీ తదితరుల నటనలోనూ అవసరానికి మించిన లౌడ్నెస్ కనిపిస్తుంది. మొత్తంగా సినిమాలో గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్ ఒక్కటి కూడా లేకపోవడం మైనస్‌గా మారింది.
టెక్నికల్ టీమ్ గురించి..
జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం ఈ సినిమాకు పెద్దగా ప్లస్ కాలేదు. పాటలు ఆకట్టుకునే స్థాయిలో లేవు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా సన్నివేశాల్లో ఎమోషన్‌ను పెంచాల్సింది పోయి సౌండ్ పోల్యూషన్లా
అనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాల్లో కొత్తదనం చూపించాలని ప్రయత్నించినా.. అవి థ్రిల్ కంటే కొన్ని సందర్భాల్లో కామెడీని పండిస్తాయి. భారీగా ఖర్చు పెట్టిన విషయం కొన్ని విజువల్స్‌లో కనిపించినా, కంటెంట్ బలహీనంగా ఉండటంతో ఆ గ్రాండియర్ మొత్తం వృథాగా అనిపిస్తుంది.
సినిమా ఎలా ఉందంటే..
‘మకుటం’కు ప్రధాన సమస్య కథలో కొత్తదనం లేకపోవడం కాదు.. ఉన్న రొటీన్ కథను కూడా ఆసక్తికరంగా చెప్పలేకపోవడం. శత్రువుల నుంచి పిల్లాడిని కాపాడేందుకు తండ్రి తన గతాన్ని దాచడం, మరో ప్రాంతంలో సాధారణ వ్యక్తిగా జీవించడం, ఆ తర్వాత గతం బయటపడటం వంటి కథలను తెలుగు ప్రేక్షకులు ఇప్పటికే ఎన్నోసార్లు చూశారు. అలాంటి కథను ఎంచుకున్నప్పుడు స్క్రీన్ప్లేలోనైనా, టేకింగ్లోనైనా కొత్తదనం ఉండాలి. కానీ ‘మకుటం’లో మొదటి భాగం నుంచే సినిమా నెమ్మదిగా, నీరసంగా సాగుతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సన్నివేశాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించవు. కథ ఎప్పుడు అసలు పాయింట్లోకి వెళుతుందా అని ఎదురుచూస్తుండగానే సమయం గడిచిపోతుంది. ఇక యాక్షన్ ఎపిసోడ్లు వచ్చినా కథకు పెద్దగా బలం చేకూర్చవు. కొన్ని యాక్షన్ సీన్లు సీరియస్‌గా కాకుండా నవ్వు తెప్పించేలా ఉన్నాయి. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి ప్రయత్నించినా అవి ఎక్కడా పేలవు. దర్శకుడిగా విశాల్ తన మొదటి సినిమాతో ఏదైనా కొత్తగా చూపిస్తారని ఆశిస్తే.. అందుకు పూర్తి విరుద్ధమైన ఫలితం కనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
విశాల్ యాక్షన్ ఇమేజ్
కొన్ని యాక్షన్ సన్నివేశాల ప్రయత్నం
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్ :
పూర్తిగా రొటీన్ కథ
బోరింగ్ స్క్రీన్‌ప్లే
ఆకట్టుకోని దర్శకత్వం
ఆసక్తి కలిగించని ఫస్ట్ హాఫ్
పేలవమైన యాక్షన్ ఎపిసోడ్లు
బలహీనమైన సంగీతం, బీజీఎం
పాత్రలకు సరైన ప్రాధాన్యత లేకపోవడం
ఫైనల్‌గా చెప్పాలంటే..
‘మకుటం’లో మకుటం పెట్టుకునేంత కొత్తదనం ఏమీ లేదు. పాత కథ, పాత ఫార్ములా, బోరింగ్ స్క్రీన్‌ప్లే, నిరాశపరిచే టేకింగ్‌తో సినిమా సాగుతుంది. హీరోగా విశాల్ నుంచి మంచి కమర్షియల్ సినిమా ఆశించే అభిమానులకు కూడా ఇది సంతృప్తినివ్వడం కష్టమే. దర్శకుడిగా తొలి ప్రయత్నంలో విశాల్ నుంచి కొత్త తరహా కథనం ఆశిస్తే.. ‘మకుటం’ మాత్రం తీవ్రంగా నిరాశపరుస్తుంది. థియేటర్లో రెండు గంటలకు పైగా కూర్చొని ఈ రొటీన్ కథను భరించడం కంటే.. స్కిప్ చేయడమే బెటర్.