Varuntej Korean Kanakaraju Movie Telugu Review
చిత్రం : కొరియన్ కనకరాజు
రేటింగ్ : 2.75/5
నటీనటులు : వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య, సునీల్, అవసరాల శ్రీనివాస్, మహేష్ ఆచంట, రచ్చరవి, వీటీవీ గణేష్, బుల్లిరాజు, మురళీధర్ గౌడ్ తదితరులు
బ్యానర్: యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్
నిర్మాతలు : రాజీవ్ రెడ్డి, సాయిబాబా జాగర్లమూడి
కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం : మేర్లపాక గాంధీ
సంగీత దర్శకుడు: ఎస్ఎస్ తమన్
సినిమాటోగ్రాఫర్ (డీవోపీ): మనోజ్ రెడ్డి
ఎడిటర్: సత్య జీ
విడుదల తేదీ: 7 ఆగస్టు 2026
Varuntej Korean Kanakaraju Movie Telugu Review
కథ విషయానికొస్తే :
కొరియాలో ఓ వ్యక్తి చనిపోగా అతని అస్థికలు ఓ సీసాలో భద్రపరుస్తారు. అనుకోకుండా ఆ సీసా చేతులు మారుతూ పెనుగొండకు వస్తుంది. కనకరాజు(వరుణ్ తేజ్) పెనుగొండలో ఓ భజన బృందం నడుపుతూ, ఫోటోగ్రాఫర్ అయిన తన ఫ్రెండ్ కృష్ణప్ప(సత్య)తో తిరుగుతూ ఉంటాడు. ఆ ఊళ్ళో ఉన్న చెంగారెడ్డి(సునీల్), అతని మనుషులతో కనకరాజుకు గొడవలు ఉంటాయి. పెనుగొండ కియా కంపెనీలో పనిచేసే చైత్ర(రితిక నాయక్)తో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు కనకరాజు. కొరియన్ కంపెనీ కావడంతో కియా కంపెనీలో చాలా మంది కొరియన్స్ ఉంటారు. చైత్ర ఎప్పటికైనా కొరియాకి వెళ్లాలనుకుంటుంది. ఓ రోజు కనకరాజు చెంగారెడ్డి మనుషులతో గొడవపడుతూ అనుకోకుండా ఆత్మ ఉన్న సీసా మూత తీసి అందులో మందు పోసుకొని తాగుతాడు. దాంతో అందులో ఉండే ఆ కొరియా ఆత్మ కనకరాజు శరీరంలోకి వస్తుంది. ఆ ఆత్మ వచ్చాక కనకరాజు పూర్తిగా కొరియన్ వ్యక్తిలా బిహేవ్ చేస్తూ అతనికి ఎదురొచ్చిన వాళ్లని కిరాతకంగా చంపేస్తుంటాడు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణప్ప, చైత్ర కనకరాజులో ఉన్న ఆ ఆత్మను ఎలాగైనా వెళ్లిపోయేలా చూస్తారు. ఈ క్రమంలో కనకరాజు, చైత్ర, కృష్ణప్ప కొరియాకు వెళ్తారు. అసలు ఆ కొరియన్ ఆత్మ ఎవరిది? కొరియాలో అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి? కొరియాకు వెళ్ళాక అక్కడ వీరికి ఎదురైన సంఘటనలు ఏంటి.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే..
నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి..
వరుణ్ తేజ్ ఈ సినిమాలో రెండు భిన్నమైన షేడ్స్‌లో ఆకట్టుకున్నాడు. అనంతపురం యాసలో డైలాగ్స్ చెబుతూ ఆకట్టుకుంటాడు. అలాగే కొరియన్ గ్యాంగ్‌స్టర్ ఆత్మ ఆవహించిన తర్వాత అతని బాడీ లాంగ్వేజ్, స్టైల్, యాక్షన్ సన్నివేశాల్లో కొత్తదనం కనిపిస్తుంది. ఈ పాత్ర కోసం చేసిన హోమ్‌వర్క్ తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. రితికా నాయక్ తన పాత్రకు తగ్గట్టుగా సహజంగా నటించింది. అయితే ఈ సినిమాకు అసలు సర్ప్రైజ్ ప్యాకేజ్ సత్య. అతను కనిపించే ప్రతి సీన్లో నవ్వులు పూయిస్తాడు. అతని కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ సినిమాకు పెద్ద ప్లస్. మురళీధర్ గౌడ్ కూడా కొన్ని సన్నివేశాల్లో మంచి వినోదాన్ని పంచాడు. సునీల్, అవసరాల శ్రీనివాస్, మహేష్ ఆచంట తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. కొరియన్ నటీనటులు కూడా కథకు మంచి నమ్మకాన్ని తీసుకొచ్చారు.
టెక్నీకల్ టీమ్ గురించి..
మేర్లపాక గాంధీ పాత కాన్సెప్ట్‌ను కొత్త బ్యాక్‌డ్రాప్‌తో చెప్పే ప్రయత్నం చేశాడు. కథలో పెద్ద కొత్తదనం లేకపోయినా, కొరియా సెటప్, అక్కడి యాక్షన్ ఎపిసోడ్స్‌తో ఆసక్తిని పెంచాడు. మనోజ్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకు మంచి విజువల్ రిచ్‌నెస్ తీసుకొచ్చింది. ముఖ్యంగా కొరియాలో చిత్రీకరించిన సన్నివేశాలు స్టైలిష్‌గా కనిపిస్తాయి. తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్, కామెడీ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు కూడా సినిమా స్థాయిని పెంచాయి. అయితే ఎడిటింగ్ విషయంలో కొంత కత్తెర పడాల్సిన సన్నివేశాలు ఉన్నాయి. ముఖ్యంగా మొదటి భాగంలో కొన్ని ఎపిసోడ్స్, రెండో భాగంలోని బుల్లిరాజు ట్రాక్ సినిమాను కొద్దిగా నెమ్మదింపజేస్తాయి.
సినిమా ఎలా ఉందంటే..
ఆత్మ ఒకరి శరీరంలోకి ప్రవేశించి తన అసలు గమ్యాన్ని చేరుకోవడం అనే కాన్సెప్ట్ తెలుగు ప్రేక్షకులకు కొత్తది కాదు. కానీ దర్శకుడు దీనికి కొరియా బ్యాక్‌డ్రాప్ జోడించి వినోదాత్మకంగా చెప్పేందుకు ప్రయత్నించాడు. మొదటి అరగంట హీరో పరిచయం, ప్రేమ ట్రాక్, ఊరిలో గొడవలతో రొటీన్‌గా సాగుతూ, సత్య కామెడీతో సినిమాకు మంచి హై ఇస్తుంది. కొరియన్ ఆత్మ కనకరాజు శరీరంలోకి వచ్చిన తర్వాత సినిమా అసలు ట్రాక్‌లోకి వస్తుంది. అక్కడి నుంచి కామెడీ, యాక్షన్ రెండూ సమానంగా నడుస్తాయి. ఇంటర్వెల్ బ్లాక్ బాగుంటుంది. రెండో భాగంలో కొరియాలో జరిగే ఎపిసోడ్స్, ఆత్మ గతాన్ని వెతికే ప్రయత్నాలు, సత్య కామెడీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. ముఖ్యంగా సత్య డైలాగ్స్, వరుణ్ తేజ్‌తో అతని కాంబినేషన్ సీన్స్ బాగా పేలాయి. అయితే రెండో భాగంలో కొన్ని కామెడీ ట్రాక్స్ కథ వేగాన్ని తగ్గిస్తాయి. క్లైమాక్స్‌కి వచ్చే సరికి సినిమా ఎమోషనల్‌గా ముగిసే అవకాశం ఉన్నా, దర్శకుడు కామెడీ-ఫాంటసీ వైపు ఎక్కువగా వెళ్లడంతో ఆశించిన స్థాయి ప్రభావం కనిపించదు.
ప్లస్ పాయింట్స్ :
సత్య కామెడీ
వరుణ్ తేజ్ పెర్ఫార్మెన్స్
కొరియా బ్యాక్‌డ్రాప్
యాక్షన్ సన్నివేశాలు
విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్ :
రొటీన్ కథ
ఆశించిన స్థాయిలో లేని క్లైమాక్స్
ఫైనల్‌గా చెప్పాలంటే..
‘కొరియన్ కనకరాజు’ పూర్తిగా కొత్త కథతో ఆశ్చర్యపరిచే సినిమా కాకపోయినా, పాత కాన్సెప్ట్‌కు కొరియా బ్యాక్‌డ్రాప్, వరుణ్ తేజ్ స్టైలిష్ అవతార్, సత్య అదిరిపోయే కామెడీని జోడించి ప్రేక్షకులకు టైమ్‌పాస్ ఎంటర్టైనర్గా నిలుస్తుంది. క్లైమాక్స్ మరింత బలంగా ఉండి ఉంటే సినిమా మరో స్థాయికి వెళ్లేది. అయినప్పటికీ కుటుంబంతో కలిసి నవ్వుకుంటూ చూసే కమర్షియల్ కామెడీ-ఫాంటసీ ఎంటర్టైనర్గా ‘కొరియన్ కనకరాజు’ ఒకసారి థియేటర్లో చూడొచ్చు. సినిమా చివరిలో కనకరాజుకు కెన్యా ఆత్మ ఆవహించిందని చూపిస్తూ.. ఈసారి ‘కెన్యా కనకరాజు’గా దీనికి సీక్వెల్ ఉంటుందని హింట్ ఇచ్చారు. మరి ఇది ఎంతవరకు సఫలీకృతమవుతుందో చూడాలి.