రివ్యూ : తిమ్మరాజుపల్లి టీవీ :
అలనాటి జ్ఞాపకాలతో ఆకట్టుకునే తిమ్మరాజుపల్లి టీవీ
నటీనటులు :- సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణ, లతీష్, తదితరులు
రచన, ఎడిటింగ్, దర్శకత్వం – వి. మునిరాజు
ప్రొడ్యూసర్ : కిరణ్ అబ్బవరం
-సినిమాటోగ్రఫీ : – అక్షయ్ రామ్ పొదిశెట్టి
మ్యూజిక్ -: వంశీకాంత్ రేఖన
విడుదల తేదీ : ఏప్రిల్ 17, 2026
నిడివి : 2 గంటల 4 నిమిషాలు
Rating: 2.75 ⭐ / 5
హీరోగా వరుస సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్న కిరణ్ అబ్బవరం.. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసేందుకు నిర్మాతగా మారి క ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సినిమాలను నిర్మిస్తున్నారు. ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘తిమ్మరాజుపల్లి టీవీ’. ఈ మూవీతో నటీనటులు, టెక్నీషియన్స్ అందర్నీ కొత్త వాళ్లను పరిచయం చేయడం విశేషం. దాదాపు 50మంచి న్యూ టాలెంట్ ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ మూవీ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ విషయానికొస్తే ..
నైంటీస్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ ఇది. అప్పుడప్పుడే ఊళ్లలోకి టీవీలు వస్తున్న పరిస్థితులు. తిమ్మరాజుపల్లి అనే పల్లెటూరిలో ఈ కథ సాగుతుంది. శివరాత్రి వచ్చిదంటే ఆ గ్రామ ప్రజలంతా ఒకచోటకు చేరి అందరూ కలిసి చందాలు వేసుకుని టీవీ, వీసీడీ క్యాసెట్‌లు అద్దెకు తెచ్చుకుంటారు. అలాంటి ఊళ్లోకి (ప్రదీప్ కొట్టే) రాజప్ప అనే అతను తన పెళ్లికి వచ్చిన కట్నంతో టీవీ కొని డిష్ పెట్టిస్తాడు. అప్పట్నుంచీ ఊళ్లో జనం అంతా ఎప్పుడు చూసిన రాజప్ప ఇంట్లోనే ఉండటం మొదలుపెడతారు. ఒకనొక సమయంలో హీరో సాయి తేజ్ (సతీష్)కు, రాజప్పకు మధ్య గొడవ అవుతుంది. తాను కూడా టీవీ కొని చూపిస్తానని సవాల్ చేసి వెళ్లిపోతాడు సతీష్. తెల్లారేసరికి రాజప్ప ఇంట్లో టీవీ ఉండదు. ఊరి ప్రజలంతా ఆ టీవీని సతీష్ దొంగిలించారనుకుంటారు. రెండు వారాల్లో టీవీ, లేదంటే డబ్బులు ఇవ్వకపోతే తనతోపాటు తన తల్లికి గుండు కొట్టిస్తామని చెబుతారు. మరోవైపు రాజప్ప చెల్లెలు శారద (వేద జలంధర్) సతీష్‌ను ప్రేమిస్తుంటుంది. ఆ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెకు వేరొకరితో నిశ్చితార్థం ఏర్పాట్లు చేస్తుండగా సతీష్ వచ్చి వారిని కొడతాడు. తాను దొంగనో కాదో తేలేవరకు పెళ్లి ప్రస్తావన రాకుండా ఉండాలని అంటాడు. ఓ వైపు ప్రేమించిన అమ్మాయి కోసం, మరోవైపు తల్లి పరువు కాపాడాలని సతీష్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు. అసలు టీవీ దొంగను పట్టుకోవడానికి ఏం చేశాడనేది కథ.
ఎవరెలా చేశారంటే..
ఈ చిత్రంలో నటించిన వారంతా దాదాపు కొత్తవారే. అయినా తమదైన నటనతో ఆకట్టుకున్నారు. రాయలసీమ యాసలో డైలాగ్స్, పల్లెటూరి గెటప్స్‌లో సూపర్బ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సతీష్‌గా సాయితేజ్, శారదగా వేద జలంధర్, రాజప్పగా ప్రదీప్, ఊరి పెద్ద రామచంద్రయ్యగా అమ్మ రమేష్ సహా ప్రతి పాత్రకు న్యాయం చేశారు.
ఎలా ఉందంటే..
దాదాపు ముప్పై ఏళ్ల క్రితం పల్లెటూరిలో ఎలా అయితే ఉంటుందో అలా చక్కని విజువల్స్‌తో ఫ్రెష్ ఫీల్‌ని ఇచ్చేలా సినిమా సాగింది. అప్పట్లో టీవీ ఉన్న వారింటికి మిగతావారంతా వెళ్లడంతో ఎలాంటి సమస్యలు వచ్చాయో కళ్లకు కట్టినట్టు చూపించారు. చిన్న ఇల్లు అయినా జనంతో నిండిపోయి ఎలాంటి ప్రైవసీ లేకుండా ఎలా ఉంటుందో పాత మొమరీస్‌ను గుర్తు చేశాడు దర్శకుడు మునిరాజు. ముఖ్యంగా థర్టీ ప్లస్ ఏజ్ వారందరికీ ఇందులోని సీన్స్ కనెక్ట్ అవుతాయి. ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ఊరిజనంలోని మనస్తత్వాలు, అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను చూపించడంలో మేకర్స్ సఫలమయ్యారు. కొంతమందికి ఈ పాయింట్ సిల్లీగా, ఫన్నీగా అనిపించినా ఇది వాస్తవమే కదా అని తెలుసుకుంటారు. తిమ్మరాజుపల్లి ఊరిలో జరిగిన ఘటనల నేపథ్యంగా థ్రిల్లింగ్ గా, ఎంగేజింగ్ గా మునిరాజు ఈ సినిమా రూపొందించారు. ఇక నిర్మాత కిరణ్ అబ్బవరం గురించి చెప్పాలంటే.. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన చెప్పినట్టుగానే చిన్న చిత్రాల్లో “తిమ్మరాజుపల్లి టీవీ” బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది. యాభై కుటుంబాల ఆశలను ఈ సినిమాతో నిలబెట్టారు.
ఫైనల్‌గా.. అలనాటి జ్ఞాపకాలతో తిమ్మరాజుపల్లి టీవీ ఆకట్టుకుంటుంది.
Rating: 2.75 ⭐ / 5






