మా అన్నయ్య బాహుబలి లో ప్రభాస్ టైపు : కార్తీ
ఇదొక మాస్ మసాలా ఫిల్మ్.. అందరికీ నచ్చుతుందని ప్రామిస్ చేస్తున్నా : సూర్య
దిగివచ్చిన దేవుడే ‘వీరభద్రుడు’
సూర్య, త్రిష జంటగా ఆర్జే బాలాజీ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన తమిళ చిత్రం ‘కరుప్పు’. తెలుగులో ‘వీర భద్రుడు’ టైటిల్‌లో విడుదలవుతోంది. మే 14న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో అన్నదమ్ములు సూర్య, కార్తీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. కార్యక్రమానికి హాజరైన దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ ‘ఒక డివైన్ ఎలిమెంట్‌తో పాటు సోషల్ యాంగిల్‌ను అద్భుతంగా మిక్స్ చేసి ఆర్.జే. బాలాజీ గారు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా అన్ని చోట్ల పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రస్తుతం సూర్య గారితో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా చేస్తున్నాను. ఆయన ఎంతో హంబుల్ హ్యూమన్ బీయింగ్. ఆయనతో దాదాపు 90 రోజులు పని చేసే అవకాశం వచ్చింది. ఆయన చేసే సమాజ సేవ కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా గొప్ప విజయాలు సాధించి, అద్భుతాలు క్రియేట్ చేయాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో సూర్య మాట్లాడుతూ ‘నాకు తెలుగు అంత బాగా రాకపోవచ్చు… కానీ తెలుగు వారి మనసు మాత్రం నాకు బాగా తెలుసు. సుప్రియ గారితో మాకు ఎప్పటినుంచో చాలా మంచి స్నేహం ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాను రిలీజ్ చేయడం చాలా గౌరవంగా భావిస్తున్నాం. ఈ సినిమాతో ప్రేక్షకులు ఖచ్చితంగా చాలా సంతృప్తి పొందుతారు. ఆర్.జే. బాలాజీ మల్టీ టాలెంటెడ్. ఈ కథను చాలా సిన్సియర్‌గా రాశారు. అంతే సిన్సియర్‌గా తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ చాలా మంచి ఎమోషనల్ కోర్ట్‌రూమ్ డ్రామాగా సాగుతుంది. సెకండ్ హాఫ్ మాత్రం పూర్తి స్థాయి థియేటర్ మాస్ మసాలా మూమెంట్స్‌తో ఉంటుంది. చాలా మంచి హ్యూమర్, ఫన్ ఉంటాయి ఇది నా ప్రామిస్. త్రిషతో 23 ఏళ్ల తర్వాత కలిసి పనిచేసిన సినిమా ఇది. తను చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ దీన్ని చాలా స్పెషల్‌గా ట్రీట్ చేసి పనిచేశారు. ఆ సిన్సియర్ ఎఫర్ట్ మీ అందరికీ సినిమాలో కనిపిస్తుంది’ అని చెప్పారు.
హీరో కార్తీ మాట్లాడుతూ ‘ఈ సినిమా ఫస్ట్ లుక్ నాకు చాలా నచ్చింది. ఇది మాస్ మసాలా అలాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని కూడా చెప్పొచ్చు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ట్రైలర్‌ని నేను చాలా ఎంజాయ్ చేశాను. గజని డేస్ గుర్తుకు వచ్చాయి. ఇలాంటి క్యారెక్టర్‌ను అన్నయ్య మాత్రమే చేయగలరు. ఆ మాస్ ఆయనకే సాధ్యపడుతుంది. మా అన్నయ్య బాహుబలి లో ప్రభాస్ టైపు. ఆయనలా ఎలాంటి పాత్రనైనా పైకి ఎత్తగలరు. సినిమాను సెలబ్రేట్ చేసుకునే ప్రేక్షకుల కోసం తీసిన చిత్రం ఇది. పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.
డైరెక్టర్ ఆర్.జే. బాలాజీ మాట్లాడుతూ ‘సూర్య గారి సినిమాలను తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో గొప్పగా సెలబ్రేట్ చేస్తుంటారు. ఈ సినిమాలో ఏముంటుందో ట్రైలర్‌లో కొంత మాత్రమే చూపించాం. ఇంకా చాలా సర్‌ప్రైజ్‌లు ఉన్నాయి. ఇది పూర్తి స్థాయి ఎంటర్‌టైనింగ్ మాస్ మసాలా ఫిల్మ్. అభిమానులు చూడాలనుకునే సూర్య సార్‌ను ఈ సినిమాలో చూపించాం. ఈ సినిమాతో సూర్య గారికి ఒక బ్లాక్‌బస్టర్ ఇస్తానని నేను మాట ఇచ్చాను. ఖచ్చితంగా ఈ సినిమా మా నమ్మకాన్ని నిలబెడుతుంది. ఇది ఒక ఇంటెలిజెంట్ కమర్షియల్ ఫిల్మ్. సుప్రియ గారికి ధన్యవాదాలు. తెలుగు డైలాగ్స్‌ను రాకేందు మౌళి గారు అద్భుతంగా రాశారు. సాయి అభ్యంకర్ చాలా మంచి సంగీతం అందించారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది’ అని చెప్పారు.
రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ ‘ఇది చాలా అద్భుతమైన ఎమోషన్స్‌తో కూడిన సినిమా. పాటలన్నీ కూడా ఎంతో అద్భుతంగా వచ్చాయి. ఈ వేడుకలో సూర్య గారిని, కార్తి గారిని పక్కపక్కన చూడడం కన్నుల పండుగలా అనిపించింది. సాయి అభ్యంకర్ చాలా అద్భుతమైన సంగీతం అందించారు. బాలాజీ గారి ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. ఈ సినిమా ఘనవిజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని అన్నారు.
రైటర్ రాకేందు మౌళి మాట్లాడుతూ ‘సూర్య గారు హీరోగా వస్తేనే అదరగొడతారు. ఇప్పుడు ‘గాడ్ మోడ్’లో వస్తున్నారు . ఇక ఏ లెవెల్‌లో ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. ఈరోజుల్లో న్యాయం అనేదే ఒక మిరాకిల్ అయిపోయింది. ఆ మిరాకిల్‌ని చూడాలంటే దేవుడే దిగి రావాలి అన్నట్టుగా పరిస్థితులు ఉన్నాయి. అలా దిగివచ్చిన దేవుడే ‘వీరభద్రుడు’. ‘వీరభద్రుడు’ అన్యాయాన్ని అస్సలు వదలడు’ అని చెప్పారు.
ఫైట్ మాస్టర్ విక్రమ్ సహా టీమ్ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.





