BhagyashreeBorse desire to Rajamouli direction
కెరీర్ ప్రారంభం నుంచే తెలుగు ప్రేక్షకులు తనను ఎంతో ప్రేమగా ఆదరిస్తున్నారని హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే చెప్పింది. తనను ఓ తెలుగు అమ్మాయిలా స్వీకరించడం జీవితాంతం గుర్తుంచుకుంటానని, ప్రేక్షకుల అభిమానానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని వెల్లడించింది.
అఖిల్ అక్కినేనికి జంటగా భాగ్యశ్రీ నటించిన ‘లెనిన్’ చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మీడియాతో ఇలా ముచ్చటించింది. ఇందులో ఆమె పోషించిన ‘భారతి’ పాత్రకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన, అఖిల్‌తో వర్క్ ఎక్స్పీరియన్స్, హైదరాబాద్‌తో తన అనుబంధం, భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఆసక్తికర విషయాలు తెలియజేసింది.
‘‘లెనిన్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న ప్రేమ, ప్రశంసలు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. సోషల్ మీడియాలో నా నటనపై వస్తున్న మెసేజ్‌లు ఎంతో ఉత్సాహాన్నిస్తున్నాయి. ఈ విజయం నా కెరీర్లోనే ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుంది. దర్శకుడు మురళీ కథ చెప్పినప్పుడే ఈ పాత్రపై నమ్మకం కలిగింది. నటిగా నా ప్రతిభను చూపించే అవకాశం ఈ పాత్ర ద్వారా లభించింది. ప్రేక్షకులు ‘భారతి’ పాత్రను ఇంతగా ఆదరించడం నా అదృష్టంగా భావిస్తున్నా. నా నటన గురించి నాగార్జున గారు వేదికపై ప్రత్యేకంగా మాట్లాడటం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అది నాకు లభించిన గొప్ప ప్రశంసల్లో ఒకటిగా భావిస్తున్నా. సినిమా చూసిన తర్వాత మా అమ్మ ఫోన్ చేసి నా నటనను అభినందించారు. ‘భారతి’ పాత్ర ముగింపు చూసి చాలా భావోద్వేగానికి గురయ్యారు. మా అమ్మ నాన్న ఇద్దరూ నా నటనపై ఎంతో సంతోషంగా ఉన్నారు. అఖిల్ అద్భుతమైన డ్యాన్సర్, పెర్ఫార్మర్. ఆయనతో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది. ఆయనకు మరిన్ని విజయాలు రావాలని కోరుకుంటున్నా”అని చెప్పింది.
BhagyashreeBorse desire to Rajamouli direction
అలాగే నటిగా తన ప్రయాణం హైదరాబాద్ నుంచే ప్రారంభమైందని గుర్తు చేసుకుంది. తెలుగు సినిమా తనకు గొప్ప అవకాశాలు ఇచ్చిందని చెప్పింది. చివరి సినిమా వరకు హైదరాబాద్‌లోనే ఉంటానని, ఈ పరిశ్రమతో తన అనుబంధం కొనసాగుతుందని వెల్లడించింది. భవిష్యత్తులో మహారాణి, యువరాణి పాత్రలు చేయాలని ఉందని, అలాంటి భారీ చిత్రాలకు రాజమౌళి సరైన దర్శకుడని పేర్కొంది. ఎప్పుడో ఒక రోజు ఆయన దర్శకత్వంలో నటించాలని తన కల అని చెప్పింది. మరోవైపు సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ చూసి ఎంతో ఇన్స్పైర్ అయ్యానంది. అవకాశం వస్తే మహిళా ప్రధాన కథల్లో కూడా నటించాలని ఉందని తెలిపింది.
ప్రస్తుతం శివకార్తికేయన్‌తో ‘సీయోన్’ సినిమాలో నటిస్తున్నట్లు, మరికొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయని తెలియజేసింది. తెలుగులో కూడా మంచి కథలు వింటున్నానని, నచ్చితే తప్పకుండా చేస్తానని చెప్పింది.