SreeVishnu Family Pack Teaser – Unlimited Fun
కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు మరోసారి తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధమయ్యారు. ‘సామజవరగమన’తో సూపర్ హిట్ అందించిన దర్శకుడు రామ్ అబ్బరాజుతో ఆయన చేస్తున్న రెండో సినిమా ‘ఫ్యామిలీ ప్యాక్’. ఈ చిత్రాన్ని కూడా సంక్రాంతి రేసులో పెట్టారు మేకర్స్. 2027 జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు అనౌన్స్ చేశారు. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ చూస్తుంటే.. సంక్రాంతికి థియేటర్లలో నవ్వుల పండగ ఖాయమనిపిస్తోంది. రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు భిన్నంగా, విచిత్రమైన పాత్రలు, వెరైటీ క్యారెక్టరైజేషన్లు, ఫన్నీ సిట్యువేషన్లతో టీజర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది.
SreeVishnu Family Pack Teaser – Unlimited Fun
ముఖ్యంగా శ్రీ విష్ణు క్యారెక్టరైజేషన్ ఈ టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తూనే.. కుటుంబ బాధ్యతలను పట్టించుకోని స్వార్థపరుడైన వ్యక్తిగా ఆయన చూపించిన బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ నవ్వులు తెప్పిస్తున్నాయి. సాధారణంగా పోలీస్ అంటే సీరియస్‌గా ఉంటారని అనుకుంటాం. కానీ ఈ సినిమాలో శ్రీ విష్ణు పోలీస్ అవతారమే పూర్తి డిఫరెంట్‌గా కనిపిస్తోంది. ఆయన చేసే పనులు, మాట్లాడే విధానం, చుట్టూ ఉన్నవారితో ప్రవర్తించే తీరు చూస్తుంటే.. ఈసారి కామెడీ డోస్ గట్టిగానే ఉండబోతోందనిపిస్తోంది.
ఇక టీజర్లో బోరబండ, బంజారాహిల్స్ అంటూ రెండు ప్రాంతాల జీవనశైలిని పోలుస్తూ పండించిన కామెడీ ప్రత్యేక ఆకర్షణ. ఒకవైపు మధ్యతరగతి నేపథ్యం.. మరోవైపు హైఫై లైఫ్‌స్టైల్.. వీటి మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇలాంటి విచిత్రమైన వ్యక్తి జీవితంలోకి తన పై అధికారి కూతురు రావడంతో కథలో అసలు గందరగోళం మొదలవుతుంది. అక్కడి నుంచి ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో అన్న క్యూరియాసిటీని టీజర్ క్రియేట్ చేసింది.
శ్రీ విష్ణు కామెడీ టైమింగ్‌కు తోడు నరేష్ వీకే, సత్య, వెన్నెల కిషోర్, సుదర్శన్ వంటి నటుల పాత్రలు కూడా సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా శ్రీ విష్ణు, నరేష్ కాంబినేషన్ మరోసారి నవ్వుల విందు అందించేలా కనిపిస్తోంది. హీరోయిన్గా సాక్షి మధోల్కర్ అందంగా కనిపించడంతో పాటు తన నటనతోనూ ఆకట్టుకునేలా ఉన్నారు. శ్రీ విష్ణు తల్లిగా అభిరామి, తమ్ముడిగా బుల్లిరాజు, సాక్షి తండ్రిగా మురళీ శర్మ తమ పాత్రల్లో ప్రత్యేకంగా కనిపించారు.
ఈ టీజర్లో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కామెడీ కోసం ప్రత్యేకంగా సన్నివేశాలను ఇరికించినట్లు కాకుండా, పాత్రల స్వభావాల నుంచే సహజమైన హాస్యం పుట్టించడం. ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకమైన యాటిట్యూడ్ ఉండటం, వాటి మధ్య వచ్చే సంఘర్షణలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. టీజర్ చివరి వరకు అదే ఫన్ టెంపోను కొనసాగించడం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భాను భోగవరపు, నందు సావిరిగాన కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.
ఇక టీజర్ లాంచ్ ఈవెంట్లో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. ‘ఫ్యామిలీ ప్యాక్’ ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని, ఇందులో టీజర్లోనూ, ట్రైలర్లోనూ చూపించని కొత్త యాంగిల్ ఉంటుందని తెలిపారు. థియేటర్లలోనే ఆ సర్ప్రైజ్ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని చెప్పారు. రామ్ అబ్బరాజు దర్శకత్వం, డైలాగ్స్, టీమ్ వర్క్ అద్భుతంగా కుదిరాయని, సంక్రాంతికి కుటుంబంతో కలిసి థియేటర్లలో సినిమా చూస్తే అన్లిమిటెడ్ ఫన్ ఉంటుందని అన్నారు.
దర్శకుడు రామ్ అబ్బరాజు మాట్లాడుతూ.. టీజర్ కంటే ట్రైలర్, ట్రైలర్ కంటే సినిమా ఇంకా అద్భుతంగా ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. శ్రీ విష్ణుతో తనది రెండో సినిమా అని, ఆయన తనకు ఫ్యామిలీ మెంబర్ లాంటివారని చెప్పారు. హీరోయిన్ సాక్షి మధోల్కర్ కూడా సంక్రాంతికి తమ సినిమాతో ప్రేక్షకులను కలవడం ఆనందంగా ఉందని తెలిపారు.