Shraddha Kapoor Stuns in Eetha Teaser
‘స్త్రీ 2’ బ్లాక్‌బస్టర్ తర్వాత శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా హిందీ చిత్రం ‘ఈథ’. ‘ఛావా’ ఫేమ్ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా లెజెండరీ మరాఠీ లవానీ నృత్యకళాకారిణి విఠాబాయి నారాయణగాంకర్ జీవిత కథ ఆధారంగా రూపొందుతోంది. మంగళవారం విడుదలైన టీజర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది.
Shraddha Kapoor Stuns in Eetha Teaser
టీజర్ ప్రారంభంలో ఈథబాయి నృత్యాన్ని చూసేందుకు ప్రేక్షకులు టికెట్లు కొనుగోలు చేసి భారీ సంఖ్యలో థియేటర్‌కు తరలివస్తారు. స్టేజ్‌పై గ్రూప్ డ్యాన్స్‌లు జరుగుతున్నా ప్రేక్షకులు మాత్రం “ఈథబాయిని పిలవండి” అంటూ నినాదాలు చేస్తుంటారు. ఇదే సమయంలో స్టేజ్ వెనుక నిండు గర్భిణిగా ఉన్న ఈథబాయి ప్రసవ వేదనతో తల్లడిల్లుతూ ఎవరి సహాయం లేకుండానే బిడ్డకు జన్మనిస్తుంది.
అయితే విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితిలో కూడా “నేను స్టేజ్‌పైకి వెళ్లాలి… రెడీ అవ్వాలి” అని పట్టుదలగా చెబుతుంది. “ఇప్పుడు వెళ్తే ప్రాణాలకు ప్రమాదం” అని సన్నిహితులు అడ్డుకున్నా… “ఇక్కడే చనిపోతే ఓ అభాగ్యురాలిగా మిగిలిపోతాను. అదే నృత్యం చేస్తూ చనిపోతే ఓ లెజెండ్‌గా గుర్తుండిపోతాను” అంటూ స్టేజ్‌పైకి అడుగుపెడుతుంది. ఈ సన్నివేశం టీజర్‌కే ఎమోషనల్ హైలైట్‌గా నిలిచింది.
మరాఠీ సంప్రదాయ లవానీ దుస్తుల్లో శ్రద్ధా కపూర్ లుక్ ఆకట్టుకోగా, నృత్యకారిణిగా ఆమె హావభావాలు, స్క్రీన్ ప్రెజెన్స్ ప్రత్యేకంగా మెప్పించాయి. టీజర్ చివర్లో వినిపించిన **”పాన్‌లో రుచి చూడాలంటే మీఠా… తుఫాన్‌లా నాట్యం చూడాలంటే ఈథ!” అనే డైలాగ్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
ఈ చిత్రంలో రణదీప్ హుడా, మహమ్మద్ జీషాన్ అయ్యూబ్, అనంత్ జోషి కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.