Satyadev: Rao Bahadur Will Redefine My Career
సత్య దేవ్ హీరోగా జూలై 3న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న సైకాలజికల్ థ్రిల్లర్ ‘రావు బహదూర్’**పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ సమర్పణలో, దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మించారు. ఈ చిత్రం ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, పాటలతో ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగించింది.
సినిమా విడుదలకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో హీరో సత్యదేవ్ ‘రావు బహదూర్’ విశేషాలను, తన పాత్ర కోసం పడిన కష్టాన్ని, మహేష్ బాబు ఇచ్చిన ప్రశంసలను, ఈ సినిమా తన కెరీర్‌కు ఎంత హెల్ప్ అవుతుందో వివరించారు.
Satyadev: Rao Bahadur Will Redefine My Career
ఈ సినిమా ప్రారంభించినప్పుడే ‘మునుపెన్నడూ చూడని విధంగా తెలుగు సినిమా’ అనే ట్యాగ్‌లైన్ అనుకున్నామని, అయితే సినిమా పూర్తయి చూసిన తర్వాత ఆ మాటపై మరింత నమ్మకం వచ్చిందన్నారు. ముఖ్యంగా మహేష్ బాబు సినిమా చూసిన తర్వాత కూడా అదే మాట చెప్పారని వెల్లడించారు. ఇప్పటివరకు సినిమా చూసిన పలువురు దర్శకులు, ఫిల్మ్‌మేకర్స్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపారు. ఇది పూర్తి స్థాయి సైకాలజికల్ డ్రామా అని, ఇందులో మ్యాజికల్ రియలిజం, డార్క్ కామెడీ అంశాలు ఉంటాయని చెప్పారు. ఒక మెటాఫర్‌ను విజువల్ రూపంలో చూపించడం మ్యాజికల్ రియలిజం అని వివరించారు. టీజర్లో కనిపించిన వేర్లు వెంటాడే విజువల్స్ ప్రేక్షకులకు థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు పూర్తిగా అర్థమవుతాయని తెలిపారు.
కమల్ హాసన్, విక్రమ్, సూర్య వంటి నటులు భారీ మేకప్‌తో విభిన్న పాత్రలు చేయడాన్ని చూస్తూ, తానూ ఎప్పుడో ఒకరోజు అలాంటి సినిమా చేయాలని కోరుకునేవాడినని తెలిపారు. నటుడిగా మారినప్పటి నుంచి ఆ కల తనలో ఉందని, అది ఇప్పుడు ‘రావు బహదూర్’తో నెరవేరిందన్నారు. అయితే ఈ సినిమాలో మేకప్ కంటే ‘మైండ్ మేకప్’ ఎంతో ముఖ్యమని చెప్పారు. ప్రతిరోజూ 16 గంటలపాటు పని చేయాలని ముందే మానసికంగా సిద్ధమయ్యానని, ఎంతో ఆనందంగా షూటింగ్ చేశానని తెలిపారు. తన పాత్రకు మేకప్ వేయడానికి ఐదు గంటలు, తీసేయడానికి గంటన్నర సమయం పట్టేదని, ఇలాంటి పాత్రలు చేయడానికి ఎంతో సహనం అవసరమని అన్నారు.
తాను పోషించిన రామప్ప పాత్రకు ఎలాంటి రిఫరెన్స్ లేదని, సినిమా విడుదలైన తర్వాత రామప్పే ఒక రిఫరెన్స్ పాయింట్ అవుతాడని ధీమా వ్యక్తం చేశారు. షూటింగ్ సమయంలో తాను పూర్తిగా ఆ పాత్రలో లీనమైపోయానని, రామప్ప తననే ఆవహించినట్లు అనిపించేదని చెప్పారు. దర్శకుడు వెంకటేష్ మహా ప్రతి సన్నివేశాన్ని అనేక లేయర్లతో అద్భుతంగా రాశారని, సినిమా ఒకసారి చూసి పూర్తిగా అర్థం కాకపోవచ్చని, మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంటుందని అన్నారు.
ఈ సినిమా తన కెరీర్లో అత్యంత సవాలుతో కూడుకున్న పాత్ర అని సత్యదేవ్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు తన కెరీర్‌ను ‘జ్యోతిలక్ష్మి’కి ముందు, తర్వాత అని చూసుకునేవాడినని, ఇకపై ప్రేక్షకులు తనను ‘రావు బహదూర్’కు ముందు… రావు బహదూర్ తర్వాత’ అన్నట్టుగా గుర్తుంచుకుంటారని నమ్మకం వ్యక్తం చేశారు.
ఈ సినిమా కథ 1960–99 మధ్య కాలంలో జరుగుతుందని చెప్పారు. దేశసంచారి అయిన కథానాయకుడు ఎన్నో ప్రాంతాలు తిరిగి చివరకు తన ప్యాలెస్ ‘భువనాలయం’కు చేరుకున్న తర్వాత జరిగే సంఘటనలే సినిమా ప్రధాన కథ అని తెలిపారు. సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు లేవని, కానీ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే నటనతో కూడిన సన్నివేశాలు ఉంటాయని చెప్పారు. ఒక పాట పూర్తిగా రోప్‌పై చిత్రీకరించారని, విడుదల కాని మరో మూడు పాటలు సినిమాలో ఉన్నాయని తెలిపారు. వాటిలో రెండు డాన్స్ నంబర్స్ అని, తన కెరీర్లో తొలిసారి ఇంతగా డ్యాన్స్ చేశానని చెప్పారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సాల్సా కూడా నేర్చుకున్నానని వెల్లడించారు.
రామప్ప మనసులోకి ప్రేక్షకులను తీసుకెళ్లేలా దర్శకుడు వెంకటేష్ మహా ఒక ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించారని చెప్పారు. ఆ ప్రపంచాన్ని నిజమైన అనుభూతి కలిగించేలా సీజీ రూపొందించారని తెలిపారు.ఆర్ట్ డైరెక్టర్లు రోహన్, శిల్పా, సినిమాటోగ్రాఫర్ కార్తీక్, సంగీత దర్శకుడు స్మరణ్ సాయి, కాస్ట్యూమ్స్ టీమ్ సహా ప్రతి విభాగం అసాధారణంగా పనిచేసిందన్నారు. అలాగే హీరో నాని సినిమా చూసిన తర్వాత “ప్రతి ఒక్కరూ తమ డ్యూటీ సరిగ్గా చేస్తే సినిమా ‘రావు బహదూర్’లా ఉంటుంది” అని చెప్పడం తనకు ఎంతో ఆనందం కలిగించిందన్నారు.
ఇక సినిమా చూసిన తర్వాత మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ దాదాపు 40 నిమిషాల పాటు సినిమా గురించి మాట్లాడారని సత్యదేవ్ తెలిపారు. టీజర్‌కు మహేష్ బాబు ఇచ్చిన వాయిస్ ఓవర్ తనకు ఎంతో ప్రత్యేకమని చెప్పారు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో తాను నటించినప్పటికీ తన సీన్ తొలగించారని గుర్తు చేసుకున్నారు. అలాంటి మహేష్ బాబు ఇప్పుడు “సత్యదేవ్ ఇన్…” అంటూ తన సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం జీవితంలో మరిచిపోలేని అనుభూతి అని, ఆ వాయిస్ ఓవర్ వెలకట్టలేనిదని అన్నారు.
తమిళం, మలయాళంలో వచ్చిన వినూత్న చిత్రాలకు లభించే ఆదరణ ఇప్పుడు తెలుగు సినిమాకూ రావాల్సిన సమయం వచ్చిందన్నారు. ‘రావు బహదూర్’ ప్రేక్షకులకు పూర్తిగా కొత్త తరహా సినీ అనుభూతిని అందిస్తుందని, బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘రావు బహదూర్’ చూసే ప్రతి ప్రేక్షకుడికి ఇది ఒక విభిన్నమైన విజువల్ స్పెక్టాకిల్ అనుభూతిని ఇస్తుందని చెప్పారు. ప్రేక్షకుడు థియేటర్‌కు వచ్చి పెట్టే ప్రతి టికెట్‌కు పూర్తి విలువ ఇచ్చే సినిమా ఇదేనని సత్యదేవ్ విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ‘సమవర్తి’ అనే ఫారెస్ట్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్ సినిమా చేస్తున్నట్లు తెలిపారు. అదనంగా ఒక కామెడీ సినిమా, అలాగే ‘ఫుల్ బాటిల్’లో మాస్ పాత్రలో కూడా కనిపించనున్నట్లు ఆయన వెల్లడించారు.
మొత్తానికి ‘రావు బహదూర్’ కేవలం ఒక సినిమా కాదని, తన నట జీవితాన్ని నిర్వచించే చిత్రంగా నిలుస్తుందని నటుడు సత్యదేవ్ స్పష్టంగా చెబుతున్నారు.