విభిన్న కథలతో అలరించే అడివి శేష్.. ఇప్పటికే హీరోగా, రైటర్ గా, దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా తన చిన్ననాటి స్నేహితుడు, సినిమాటోగ్రాఫర్ షానియల్ డియో దర్శకత్వంలో డెకాయిట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు, దర్శకుడు అనురాగ్ కశ్యప్, అతుల్ కులకర్ణి, సునీల్, కామాక్షి భాస్కర్ల లాంటి నటులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఎస్ ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్ బ్యానర్లపై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. ఏప్రిల్ 10న విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం..
కథ ఏమిటంటే..
ఓపెన్ చేస్తే.. కొవిడ్ టైమ్‌లో జరిగిన కథగా దీనిని పరిచయం చేస్తారు. ఓ హత్య కేసులో కడప సెంట్రల్ జైలులో 13 ఏళ్లుగా ఖైదీలా అడివి శేష్.. హరి దాస్ పాత్రలో కనిపిస్తాడు. తనను కలవడానికి ఇషాద్ భాయ్ (అతుల్ కులకర్ణి) వస్తాడు. అసలు హరి ఎందుకు జైలుకు వచ్చాడో వివరించే క్రమంలో ఆడియెన్స్‌ను పదిహేనేళ్లు వెనక్కి అంటే 2005 ఫ్లాష్‌బ్యాక్‌కు తీసుకెళ్తాడు. అప్పుడే యవ్వనంలో ఉన్న హరికి.. సరస్వతి (మృణాల్ ఠాకూర్) పరిచయం అవుతుంది. వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. చెట్టాపట్టాలేసుకుని ప్రేమపావురాల్లా తిరుగుతారు. మధ్యలో ఒక లవ్ సాంగ్‌తో అంతా సజావుగా సాగుతున్న సమయంలోనే.. హరి అద్దెకు ఉండే ఇంటి ఓనర్ మల్లి (కామాక్షి భాస్కర్ల)ను సరస్వతి అన్నయ్య తమ బ్యాచ్‌తో గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసినట్టుగా చూపిస్తారు. అప్పుడే సరస్వతి అన్నయ్యను హరి ఓ బండ రాయితో ముఖంపై కొట్టి కొట్టి చంపేస్తాడు. అదిచూసిన సరస్వతి హరిపై కేసు పెట్టి జైలుకు పంపిస్తుంది. అసలు విషయం తెలుసుకోకుండా తనను ఈ కేసులో ఇరికించినందుకు జైలులో సరస్వతిపై పగ పెంచుకుంటూ ఉంటాడు. మరోవైపు కొవిడ్ కేసులు ఎక్కువ అవుతున్న తరుణంలో ఓరోజు హరిని కడప జైలు నుంచి వేరొక జైలుకు మారుస్తుండగా ఇషాద్ భాయ్ సపోర్ట్‌తో పోలీసుల నుంచి తప్పించుకుంటాడు. ఇషాద్ తనను దుబాయ్ పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేయగా, తనకు చివరిగా ఒక పని ఉందని చెప్పి తన ఎక్స్ లవర్ సరస్వతి దగ్గరకు వెళ్తాడు. అప్పటికే ఆమె ఓ ఆరేళ్ల కూతురికి తల్లిగా కనిపిస్తుంది. భర్త అనారోగ్యంతో హాస్పిటిల్ పాలవుతాడు. వైద్యానికి అయ్యే ఖర్చు కోసం నానా తిప్పలు పడుతూ కనిపిస్తుంది. ఇదే అదనుగా ఆమెకు హెల్ప్ చేసినట్టు చేసి.. ఆమెకు కూడా జైలు జీవితం పరిచయం చేయాలని ప్లాన్ చేస్తాడు హరి. మరి హరి తన రివేంజ్ ఎలా తీర్చుకున్నాడు. ఈ నేపథ్యంలో తనకు ఎదురైన అనుభవాలతో కథ సాగుతుంది.
‘డెకాయిట్’ ఎలా ఉందంటే…
ఒక్కముక్కలో చెప్పాలంటే చాలా డెలికేట్‌గా ఉందని చెప్పొచ్చు.
ఫస్ట్ హాఫ్ చూస్తున్నంతసేపు సెకండాఫ్‌లో ఏదో ఉన్నట్టుగా చూపించి మొత్తానికి ‘డెకాయిట్’లో ఏమీ లేదు.. మొత్తం డొల్లే అన్నట్టుగా ఉంది. కథ సాగే తీరు సగటు ప్రేక్షకుడిని అయోమయానికి గురి చేస్తుంది.
అవసరం లేని భారీ యాక్షన్ సీన్స్, పాత్రకు సరైన స్కోప్ లేకపోయినా భారీ తారాగణంతో హంగామా చేయాలనుకున్నారు. శేష్ యాక్టింగ్ మాత్రం గత చిత్రాలతో పోలిస్తే మరింత పరిణితి చెందాడనిపిస్తుంది. కొన్ని కొన్ని సీన్స్ మినహా మిగతాదంతా ఇప్పుడెందుకు ఇంత చేస్తున్నారనిపిస్తుంది. క్లైమాక్స్‌లో అయితే పోలీసులకు, శేష్ కు మధ్య జరిగే ఎపిసోడ్ అసలు ఏం జరుగుతుందిరా బాబు.. అనుకుంటాం. మొదటివరకు సరస్వతి భర్త భాస్కర్ (వైభవ్)కు హెల్త్ బాగోలేదని, హార్ట్ ట్రాన్స్‌ఫ్లాంటేషన్ చేయాలని చెబుతూ.. చివరకు హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సరస్వతి కోసమేనని.. దీనికోసం తానే స్వయంగా డబ్బులు సమకూర్చుకోవాలనుకోవడం, దొంగలా మారాలనుకోవడం, ట్రీట్‌మెంట్ జరుగుతున్న హాస్పిటల్‌లోనే దొంగతనం చేయాలనుకోవడం చాలా సిల్లీగా, ఫన్నీగా ఉంటుంది. ఇకపోతే ప్రతి సీన్‌ను ఎలివేట్ చేస్తూ, డైలాగ్ కూడా అర్ధం కాకుండా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో జనాలకు మరింత తలనొప్పి తెప్పించాడు గ్యానీ. దీనికితోడు రాయలసీమ యాస చాలామందికి అర్ధంకాక ఇబ్బందిపెట్టినట్టు అనిపిస్తుంది.
‘డెకాయిట్’లో ఎవరెలా చేశారంటే..
హరిదాస్ పాత్రలో శేష్ సరికొత్తగా కనిపిస్తూ మాసివ్‌గా ఆకట్టుకున్నాడు. రాయలసీమ యాసలో డైలాగులు చెప్పినప్పటికీ కొన్ని పదాలు మిగితా వారికి అర్ధం కావడానికి కాస్త టైమ్ పడుతుంది. యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేశాడు. ఈ చిత్రంలో ఫస్ట్ టైమ్ స్టెప్స్ వేయడం విశేషం. యాక్షన్ సీన్స్‌లోనూ మెప్పించాడు. ఇక సరస్వతి అలియాస్ జూలియట్‌గా సరస్వతి క్యారెక్టర్‌లో మృణాల్ ఠాకూర్ తనదైన ఎమోషన్‌తో అలరించింది. సీఐ రాంబాబుగా స్వామి మాలలో ఉన్న అనురాగ్ కశ్యప్ తన పాత్రకు న్యాయం చేశారు. అయితే ఈ క్యారెక్టర్ ఎవరుచేసినా అంతకుమించి చేయాల్సి ఏమీ ఉండదు. బాలీవుడ్ మార్కెట్ కోసం, ఓ హైప్ కోసం పెట్టినట్టుగా ఉన్నారు. ఇక కామాక్షి భాస్కర్ల పాత్ర ఎందుకు పెట్టారో తెలియకుండానే ముగుస్తుంది. అలాగే కరుణ హాస్పిటల్ చైర్మన్‌గా ప్రకాష్ రాజ్ ను విలన్‌గా చూపించినా యాక్టింగ్‌కు ఎక్కువ స్కోప్ లేదనే చెప్పాలి.
కథ, కథనం సరిగా లేనప్పుడు ఎంతమంచి స్టార్ కాస్ట్ ఉన్నా ఫలితం శూన్యమే.
ప్లస్‌లు :
అడివి శేష్, మృణాల్ ఠాకూర్ నటన
యాక్షన్, ఎమోషన్
మైనస్‌లు :
కథ, కథనం
మ్యూజిక్
ఫైనల్‌గా ‘ప్రేయసిరావే’ చిత్రానికి ‘డెకాయిట్’ ఒక డూప్లికేట్‌లా చూపించారు.
రేటింగ్: ⭐⭐ (2/5)






