Ravi Teja Turns Crime Maharaja in Thulabharam
మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు వివేక్ ఆత్రేయ కలయికలో ఓ ఆసక్తికరమైన చిత్రం రూపుదిద్దుకుంటోంది. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘తులాభారం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై లక్ష్మణ్, శ్రీనిరావు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఆదివారం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వినూత్నమైన ‘ది టైటిల్ డాక్యుమెంటరీ’ వీడియో సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.
సాధారణంగా సినిమా టైటిల్‌ను ప్రకటిస్తూ పోస్టర్ లేదా గ్లింప్స్‌ను విడుదల చేయడం చూస్తుంటాం. అయితే ‘తులాభారం’ టీమ్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించింది. టైటిల్‌ను ఎలా ఎంపిక చేశారు? దాని వెనుక ఎలాంటి చర్చలు జరిగాయి? అనే అంశాలను సరదాగా, వినోదాత్మకంగా చూపిస్తూ ఓ ప్రత్యేకమైన డాక్యుమెంటరీ వీడియోను రూపొందించింది.
Ravi Teja Turns Crime Maharaja in Thulabharam
దర్శకుడు వివేక్ ఆత్రేయ తనదైన క్రియేటివ్ శైలిలో రూపొందించిన ఈ వీడియోను మై హోమ్ రామ్ విడుదల చేశారు. ‘తులాభారం’ అనే పేరును ఖరారు చేసే క్రమంలో జరిగిన సంభాషణలను ఆసక్తికరంగా ఆవిష్కరించారు. కేవలం టైటిల్‌ను ప్రకటించడానికే పరిమితం కాకుండా, సినిమా ప్రపంచాన్ని పరిచయం చేసే ప్రయత్నం చేయడం ఈ వీడియో ప్రత్యేకతగా నిలుస్తోంది.
టైటిల్ ఎంపిక వెనుక ఉన్న ఆలోచనలను వినోదభరితంగా చూపించడంతో పాటు సినిమాలోని కీలక పాత్రలను కూడా ఈ వీడియో ద్వారా పరిచయం చేశారు. దీంతో సినిమా కథ, పాత్రల స్వభావాలు, వివేక్ ఆత్రేయ ఎలాంటి కథనాన్ని సిద్ధం చేశారనే విషయాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది.
రవితేజ సినిమాలంటే గుర్తొచ్చేది ఆయన ఎనర్జీ, కామెడీ టైమింగ్, మాస్ యాక్షన్. అయితే ‘తులాభారం’లో ఆయనను సరికొత్త అవతార్‌లో పరిచయం చేయబోతున్నట్లు టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో స్పష్టం చేస్తోంది. ఇప్పటివరకు ‘మాస్ మహారాజా’గా అభిమానులను అలరించిన ఆయన.. ఈసారి ‘క్రైమ్ మహారాజా’గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
మాస్ ఇమేజ్‌కు భిన్నంగా క్రైమ్ నేపథ్యంలో సాగే కథలో రవితేజను చూడబోతుండటం ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తిని పెంచుతోంది. మరోవైపు, కథను ప్రత్యేకమైన స్క్రీన్‌ప్లేతో చెప్పడంలో గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ ఈ సినిమాను ఎలా తీర్చిదిద్దబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.
రవితేజ ట్రేడ్‌మార్క్ ఎనర్జీకి వివేక్ ఆత్రేయ విభిన్నమైన కథన శైలి తోడైతే తెరపై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ అవుతుందో చూడాలి. క్రైమ్, డ్రామా, ఎంటర్టైన్మెంట్ అంశాల కలయికతో ఈ సినిమా రూపొందనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.
‘తులాభారం’లో రవితేజతో పాటు ఇతర పాత్రల పేర్లను కూడా మేకర్స్ ప్రకటించారు. దేవరాజ్‌గా తరుణ్ భాస్కర్, శివాజీ రావుగా జేడీ చక్రవర్తి, కృష్ణవేణిగా ప్రియాంక మోహన్, సౌండ్‌గా అనస్వర రాజన్, జడేజాగా అనిల్ కరెళ్ల, రాబిన్‌గా రవి ఆంటోనీ కనిపించనున్నట్టు రివీల్ చేశారు.
ఈ సినిమా పూజా కార్యక్రమాలు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ చిత్ర బృందానికి స్క్రిప్ట్‌ను అందజేశారు. శ్రీ విష్ణు క్లాప్ కొట్టగా, దర్శకులు శివ నిర్వాణ, బాబీ తొలి షాట్‌కు దర్శకత్వం వహించారు. చందు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ కార్యక్రమంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభమైన ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌లోకి అడుగుపెట్టనుంది. సినిమా కథ, చిత్రీకరణ షెడ్యూల్స్, ఇతర వివరాలను మేకర్స్ రానున్న రోజుల్లో వెల్లడించనున్నారు. వివేక్ సాగర్ సంగీతాన్ని అందిస్తుండగా, తేని ఈశ్వర్ ISC సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటర్‌గా, జీఎం శేఖర్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.