RamaniKalyanamTeluguMovieReview :
రివ్యూ : రమణి కళ్యాణం
వైకల్యాల కంటే మనసే గొప్పదని చెప్పే ‘రమణి కళ్యాణం’
నటీనటులు : సూర్య వశిష్ట, దీప్షిక చంద్రన్, శ్రీనివాస రెడ్డి, లోహిత్ కుమార్, ప్రభావతి, చైతన్య జొన్నలగడ్డ, యాంకర్ శ్యామల, కిర్రాక్ సీత తదితరులు
కథ, దర్శకత్వం : విజయ్ ఆదిరెడ్డి
బ్యానర్ : కైట్స్ క్రియేటివ్స్
నిర్మాతలు : విజయ్ ఆదిరెడ్డి, మనోజ్ చింతిరెడ్డి, శ్రీనాథ్ పసుపులేటి, సంజయ్ వెంపరాల
సినిమాటోగ్రఫీ : అరవింద్ తిరుకోవెల
ఎడిటర్ : రవితేజ గిరజాల
మ్యూజిక్ – : సూరజ్ ఎస్ కురుప్
విడుదల తేదీ : 22-/05/2026
నిడివి : 2 గంటల 6 నిమిషాలు
కంటి చూపు లేని అమ్మాయి, నడవలేని అబ్బాయి మధ్య ప్రేమకథగా తెరకెక్కిన చిత్రం ‘రమణి కళ్యాణం’. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌తో ఆసక్తి పెంచిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుందో ఈ రివ్యూలో చూద్దాం.
RamaniKalyanamTeluguMovieReview :
కథ విషయానికొస్తే..
చిన్నతనంలో జరిగిన ప్రమాదంతో కంటిచూపు కోల్పోయిన సంజన (దీప్షిక చంద్రన్) జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొంటూ పబ్‌లో సింగర్‌గా పనిచేస్తుంది. అనాథ పిల్లలు, బామ్మతో చిన్న ప్రపంచాన్ని నిర్మించుకున్న ఆమెకు, పక్షవాతం కారణంగా వీల్‌చైర్‌కే పరిమితమైన రాజ్ (సూర్య వశిష్ట) పరిచయం అవుతాడు. మొదట చిన్న గొడవతో మొదలైన వీరి పరిచయం, తర్వాత ప్రేమగా మారుతుంది. అయితే తమ శారీరక పరిస్థితులకంటే సమాజం చూపే దృష్టే వీరి ప్రేమకు పెద్ద అడ్డంకిగా మారుతుంది. చివరకు ఈ ఇద్దరి ప్రేమ ఎలాంటి పరీక్షలను ఎదుర్కొంది? వాళ్లను విడదీయాలని చూసింది ఎవరు? అనేదే ‘రమణి కళ్యాణం’ కథ.
ఎవరెలా చేశారంటే ..
ఈ సినిమాలో నటీనటులందరూ తమ పాత్రలకు సహజత్వాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కిచ్చా సుదీప్తో ‘మార్క్’, విజయ్ ఆంటోనీతో ‘మార్గన్’ తర్వాత ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన దీప్షిక్ చంద్రన్ పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న పాత్రలో నటించింది. సంజన పాత్రలో ఆమె నటించిన తీరు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కంటిచూపు లేని అమ్మాయి పాత్రలో ఆమె చూపించిన హావభావాలు, డైలాగ్ డెలివరీ చాలా నేచురల్‌గా అనిపిస్తాయి. ఎక్కడా అతిగా నటించకుండా, పాత్ర భావోద్వేగాలను సున్నితంగా ప్రదర్శించింది. అలాగే ‘బుట్టబొమ్మ’, ‘దేవికా అండ్ డానీ’ వెబ్ సిరీస్ తర్వాత సూర్య వశిష్ట నటించిన చిత్రమిది. రాజ్ పాత్రలో సూర్య వశిష్ట మంచి మెచ్యూరిటీ చూపించాడు. వీల్‌చైర్‌కే పరిమితమైన యువకుడి బాధ, అసహాయతను తన నటనలో బాగా చూపించే ప్రయత్నం చేశాడు. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో అతని పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. ఇక శ్రీనివాస రెడ్డి ఈ సినిమాలో కామెడీకి భిన్నంగా ఎమోషనల్ టచ్ ఉన్న పాత్రలో కనిపించి మంచి ఇంపాక్ట్ తీసుకొచ్చాడు. కథలో కీలకమైన పాత్రగా నిలుస్తూ తన అనుభవాన్ని మరోసారి చూపించాడు. యాంకర్ శ్యామల, చైతన్య జొన్నలగడ్డ, లోహిత్ కుమార్, ప్రభావతి తదితరులు తమ పాత్రల పరిధిలో మెప్పించారు. అయితే కథ మొత్తం భావోద్వేగాల చుట్టూనే తిరగడంతో కొన్ని సన్నివేశాలు కాస్త నెమ్మదిగా అనిపిస్తాయి.
టెక్నికల్ టీమ్ విషయానికొస్తే..
టెక్నికల్‌గా ‘రమణి కళ్యాణం’ మంచి ప్రయత్నంగా కనిపిస్తుంది. అరవింద్ తిరుకోవెల సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రత్యేకమైన ఫీల్ తీసుకొచ్చింది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో లైటింగ్, ఫ్రేమింగ్ కథ మూడ్‌ను బాగా క్యారీ చేశాయి. విజువల్స్ మొత్తం సాఫ్ట్ టోన్‌లో ఉండటం ప్రేమకథకు ప్లస్ అయింది. సూరజ్ ఎస్ కురుప్ అందించిన నేపథ్య సంగీతం కొన్ని కీలక సన్నివేశాలకు బలంగా నిలిచింది. ముఖ్యంగా హీరో, హీరోయిన్ మధ్య వచ్చే భావోద్వేగ క్షణాల్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మంచి ఇంపాక్ట్ ఇస్తుంది. అయితే పాటల విషయంలో మాత్రం మరింత బలమైన ట్యూన్స్ ఉంటే బాగుండేదనిపిస్తుంది. ఎడిటర్ రవితేజ గిరజాల సినిమా నేరేషన్‌ను క్లీన్‌గా నడిపించే ప్రయత్నం చేసినా, కొన్ని సన్నివేశాలు కాస్త నెమ్మదిగా అనిపిస్తాయి. ముఖ్యంగా సెకండాఫ్‌లో కొంత ట్రిమ్ చేసి ఉంటే సినిమా మరింత క్రిస్పీగా ఉండేది. ఇలాంటి సెన్సిటివ్ లవ్ స్టోరీని హ్యాండిల్ చేయడంలో దర్శకుడు విజయ్ ఆదిరెడ్డి తన ప్రయత్నాన్ని చూపించాడు. పాత్రల భావోద్వేగాలను సహజంగా చూపించే ప్రయత్నం చేశాడు. నిర్మాణ విలువలు కూడా కథకు తగ్గట్టుగా ఉన్నాయి. నిర్మాతలు కంటెంట్‌పై మంచి శ్రద్ధ పెట్టిన విషయం స్క్రీన్‌పై కనిపిస్తుంది.
RamaniKalyanamTeluguMovieReview :
సినిమా ఎలా ఉందంటే..
‘రమణి కళ్యాణం’.. సాధారణ ప్రేమకథలా మొదలైనా, శారీరక వైకల్యాల కంటే మనసు బలంగా ఉంటే జీవితాన్ని ఎలా ఎదుర్కోవచ్చో చెప్పే ప్రయత్నం చేస్తుంది. దర్శకుడు విజయ్ ఆదిరెడ్డి కథను పూర్తిగా ఎమోషన్స్ చుట్టూనే నడిపించారు. మొదటి భాగంలో హీరో, హీరోయిన్ పాత్రల పరిచయం, వాళ్ల మధ్య పెరిగే అనుబంధాన్ని నెమ్మదిగా చూపించారు. సంజన పాత్రలో ఉన్న ధైర్యం, ఆమె ఎదుర్కొనే మానసిక భయాలను చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా కారు ప్రమాదానికి సంబంధించిన ట్రామాను హ్యాండిల్ చేసిన సన్నివేశాలు సహజంగా అనిపిస్తాయి. ఇద్దరు దివ్యాంగుల మధ్య ప్రేమను చూపించడంలో కొన్ని చోట్ల దర్శకుడి ఆలోచన కొత్తగా అనిపించినా, ఆ ప్రేమ మరింత బలంగా కనెక్ట్ అయ్యేలా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు ఇంకాస్త లోతుగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. హీరో, హీరోయిన్ మధ్య ప్రేమ ఎలా బలపడిందన్న అంశం మరింత ప్రభావవంతంగా రాసి ఉంటే కథకు ఇంకా బలం వచ్చేది. ఇంటర్వెల్ ట్విస్ట్, ప్రీ-క్లైమాక్స్‌లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతాయి. అలాగే “వైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదు” అనే సందేశాన్ని డైలాగ్స్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే కొన్ని చోట్ల ఫిలాసఫీ, బాధ ఎక్కువై కథ కాస్త హెవీగా అనిపిస్తుంది. మధ్య మధ్యలో వచ్చే కామెడీ ట్రాక్ పెద్దగా వర్కౌట్ కాలేదు. కొన్ని సాంగ్స్, డ్రీమ్ సీక్వెన్స్‌లు కథ ప్రవాహాన్ని కాస్త నెమ్మదింపజేస్తాయి. అయినా కూడా, ఎమోషనల్ లవ్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘రమణి కళ్యాణం’ ఓ డీసెంట్ ఫీల్ ఇచ్చే సినిమా.
ప్లస్ పాయింట్స్ :
ఎమోషనల్ లవ్ స్టోరీ
దీప్షిక చంద్రన్ నటన
ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్స్
కొన్ని భావోద్వేగ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్ :
నెమ్మదిగా సాగే కథనం
బలంగా కనెక్ట్ కాని లవ్ ట్రాక్
వర్కౌట్ కాని కామెడీ
సాగదీతగా అనిపించే సీన్స్
గుర్తుండిపోయే పాటలు లేకపోవడం
ఫైనల్‌గా ఒక్క మాటలో చెప్పాలంటే : భావోద్వేగాలతో నడిచే ఈ ‘రమణి కళ్యాణం’ అన్ని వర్గాల ప్రేక్షకులను పూర్తిగా మెప్పించకపోయినా, ఎమోషనల్ లవ్ డ్రామాలను ఇష్టపడేవారికి కొంతవరకు కనెక్ట్ అవుతుంది.
రేటింగ్ : 2.75/5