Purushaha Telugu Movie Review :
రివ్యూ : పురుషః.. పురుషులందు పుణ్యపురుషులు వేరయా..భార్యాబాధితుల రామా వినరా వేమ
నటీనటులు : పవన్ కళ్యాణ్ బత్తుల, వైష్ణవి కొక్కుర, సప్తగిరి, రాజ్ కుమార్ కసిరెడ్డి, వెన్నెల కిషోర్, వీటీవీ గణేష్, రాజీవ్ కనకాల, విషిక కీర్తి, హాసిని సుధీర్, పమ్మి సాయి, హరితేజ, గబి రాక్ తదితరులు
దర్శకత్వం : వీరు వులవల
బ్యానర్ : కళ్యాణ్ ప్రొడక్షన్స్
నిర్మాత : బత్తుల కోటేశ్వరరావు
సినిమాటోగ్రఫీ : సతీష్ ముత్యాల
ఎడిటర్ : కోటి
మ్యూజిక్ – : శ్రవణ్ భరద్వాజ్
విడుదల తేదీ : 22-/05/2026
నిడివి : 2 గంటల 19 నిమిషాలు
Purushaha Telugu Movie Review :
భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు, అనుమానాలు, ఈగోలు వీటి ఆధారంగా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘పురుషః’. భార్యా బాధితుల కాన్సెప్ట్ మీద ఎన్ని జోకులు, కథలు వచ్చినా ప్రేక్షకులు మళ్లీ మళ్లీ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా మగాళ్లకు ఇది వెంటనే కనెక్ట్ అయ్యే ఎమోషన్. ఆడవాళ్ల అధికారం, అనుమానాలు, ఇంట్లో జరిగే ఫన్నీ వార్స్ మధ్య నలిగిపోయే భర్తల కథలను వినోదాత్మకంగా చూపించిన సినిమాలు ఎప్పుడూ మంచి ఆదరణ పొందాయి. ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’, ‘ఎఫ్2’ లాంటి చిత్రాలు అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు అదే లైన్లో, మరింత బోల్డ్ కామెడీతో, రిలేటబుల్ సిచ్యువేషన్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది పురుషః. టీజర్, ట్రైలర్స్‌తోనే నవ్వులు పంచిన ఈ సినిమా.. థియేటర్లో కూడా అదే స్థాయిలో ఎంటర్టైన్ చేసిందా? భార్యాబాధితుల గుండెల్లో చోటు సంపాదించుకుందా అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ విషయానికొస్తే..
చిన్నప్పటి నుంచి గోవింద్ (పవన్ కళ్యాణ్), సత్తిబాబు (సప్తగిరి), శ్రీను (కసిరెడ్డి రాజ్ కుమార్) ముగ్గురూ విడదీయరాని స్నేహితులు. జీవితంలో ఏ విషయం అయినా ఒకరితో ఒకరు పంచుకునే ఈ ఫ్రెండ్స్‌కి పెళ్లి తర్వాత అసలు పరీక్ష మొదలవుతుంది. గోవింద్ కమల (రాయంచ కొక్కుర)ను ప్రేమించి పెళ్లి చేసుకోగా, సత్తిబాబు లక్ష్మిని (హాసిని సుధీర్), శ్రీను గీత (విశిక)లను వివాహం చేసుకుంటారు. మొదట హ్యాపీగా సాగిన వీరి మ్యారీడ్ లైఫ్‌లో చిన్న చిన్న అనుమానాలు, ఈగోలు, అపార్థాలు పెరిగి చివరకు విడాకుల దాకా వెళ్తాయి. తమ భర్తలపై విసుగెత్తిపోయిన భార్యలు కోర్టులో డైవోర్స్ కేసులు వేస్తారు. కానీ విచిత్రంగా కోర్ట్ చుట్టూ తిరిగేది మాత్రం ఈ ముగ్గురు భర్తలే. వాయిదాల మీద వాయిదాలు పడుతుండగా, వారి బాధను గమనించిన జడ్జ్ (వీటీవీ గణేష్) అసలు సమస్య ఎక్కడ మొదలైందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఇదే సమయంలో కాస్త రిలాక్స్ కావాలని ఈ ముగ్గురు తమ కామన్ ఫ్రెండ్ కిస్సు (వెన్నెల కిషోర్) పెళ్లికి వెళ్తారు. అక్కడ ఓ పాత డైరీ బయటపడటంతో కథ అసలు మలుపు తిరుగుతుంది. ఆ డైరీలో వీరి చిన్ననాటి అల్లర్లు, గోవింద్ గతం, రోజీతో అతని ప్రేమకథతో పాటు కొన్ని షాకింగ్ విషయాలు బయటకు వస్తాయి. దానికి తోడు పెళ్లిలో దేవిక అనే అమ్మాయితో వీరి సన్నిహిత్యం భార్యల అనుమానాలకు మరింత ఆజ్యం పోస్తుంది. అసలు గోవింద్ గతం ఏమిటి? ఆ డైరీలో ఉన్న నిజాలు ఏంటి? కిస్ చేసిన పనుల వల్ల ఈ ముగ్గురి జీవితాలు ఎలా గందరగోళమయ్యాయి? చివరికి ఈ భార్యాభర్తల మధ్య అపార్థాలు తొలగాయా? లేక నిజంగానే విడాకులతో ముగిసిందా? అనేదే `పురుషః` కథ.
ఎవరెలా చేశారంటే ..
గోవింద్ పాత్రతో హీరోగా పరిచయమైన పవన్ కళ్యాణ్ బత్తుల తొలి సినిమానే అయినప్పటికీ చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. కొత్త హీరోల్లో కనిపించే అతిగా నటించాలనే ప్రయత్నం కాకుండా, చాలా నేచురల్‌గా క్యారెక్టర్లోకి వెళ్లిపోయాడు. ముఖ్యంగా భార్య బాధితుడిగా పడే ఇబ్బందులు, కామెడీ సన్నివేశాల్లో కన్ఫ్యూజన్, అలాగే ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ప్రేమకథలో ఎమోషన్స్‌ను మంచి ఈజ్‌తో క్యారీ చేశాడు. కొన్ని చోట్ల కేవలం ఎక్స్‌ప్రెషన్స్‌తోనే సన్నివేశాలను నిలబెట్టే ప్రయత్నం చేయడం ఆకట్టుకుంటుంది. లుక్స్ పరంగానూ మంచి స్క్రీన్ ప్రెజెన్స్ చూపించిన పవన్ కళ్యాణ్ బత్తులకి హీరోగా మంచి ఫ్యూచర్ ఉందనే ఫీలింగ్ కలుగుతుంది.
ఇక ఈ సినిమాకు అసలు ఎనర్జీ ఇచ్చింది సప్తగిరి, కసిరెడ్డి రాజ్‌కుమార్‌ల కామెడీ ట్రాక్. ఇద్దరూ తమ టైమింగ్, బాడీ లాంగ్వేజ్, వన్ లైనర్స్‌తో చాలాసార్లు నవ్వులు పూయించారు. ముఖ్యంగా భార్యలతో వచ్చే సన్నివేశాల్లో వీరి కామెడీ బాగా వర్కౌట్ అయింది. వెన్నెల కిషోర్ పాత్ర చిన్నదే అయినప్పటికీ, స్క్రీన్‌పై కనిపించినంతసేపు తన మార్క్ ఎంటర్టైన్మెంట్ అందించాడు. హీరోయిన్లలో రాయంచ కొక్కుర స్క్రీన్‌పై అందంగా కనిపించడమే కాకుండా, కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. విషిక, హాసిని సుధీర్ తమ పాత్రల పరిధిలో కామెడీతో పాటు రిలేషన్షిప్ కాన్ఫ్లిక్ట్స్ను బాగానే ప్రెజెంట్ చేశారు. వీటీవీ గణేష్ జడ్జ్ పాత్రలో తనదైన స్టైల్ కామెడీని అందించగా, రాజీవ్ కనకాల, పమ్మి సాయి వంటి నటులు కథకు అవసరమైన సపోర్ట్ ఇచ్చారు. మొత్తంగా చూస్తే కామెడీని డ్రైవ్ చేసే సపోర్టింగ్ క్యాస్ట్ మధ్య కూడా పవన్ కళ్యాణ్ బత్తుల తన ప్రెజెన్స్‌తో ప్రత్యేకంగా నిలిచాడని చెప్పొచ్చు.
టెక్నికల్ విషయానికొస్తే..
టెక్నికల్‌గా ‘పురుషః’ చిన్న సినిమా అనే ఫీల్ ఇవ్వకుండా, ప్రతి ఫ్రేమ్‌లోనూ మంచి ప్రొడక్షన్ వాల్యూస్‌తో కనిపిస్తుంది. ముఖ్యంగా కళ్యాణ్ ప్రొడక్షన్స్ ఎక్కడా రాజీ పడకుండా సినిమాను రిచ్‌గా ప్రెజెంట్ చేసిన తీరు స్పష్టంగా కనిపిస్తుంది. పెళ్లి ఎపిసోడ్స్, ఫ్లాష్‌బ్యాక్ లవ్ స్టోరీ, కలర్‌ఫుల్ లొకేషన్స్‌ను విజువల్‌గా ఎంతో ఆహ్లాదకరంగా చూపించడంలో సినిమాటోగ్రాఫర్ సతీష్ ముత్యాల మంచి మార్కులు కొట్టేశాడు. కొన్ని ఫ్రేమ్స్ అయితే చిన్న బడ్జెట్ సినిమా అన్న భావననే మర్చిపోయేలా ఉంటాయి. శ్రావణ్ భరద్వాజ్ అందించిన సంగీతం కథకు సరిపోయేలా ఉంది. పాటలు ఓకే అనిపించినా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం కొన్ని కీలక సన్నివేశాల్లో ఎమోషన్‌ను, కామెడీని బాగా ఎలివేట్ చేసింది. ముఖ్యంగా కోర్ట్ సీన్స్, ఫ్రెండ్స్ మధ్య వచ్చే కామెడీ ఎపిసోడ్స్‌కు ఆర్ఆర్ మంచి సపోర్ట్ ఇచ్చింది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త క్రిస్ప్నెస్ ఉంటే బాగుండేదనిపించినా, మొత్తం మీద 2 గంటల 19 నిమిషాల రన్‌టైమ్ పెద్దగా బోర్ కొట్టించదు. కొన్ని చోట్ల వీఎఫ్ఎక్స్ అవసరానికి మించి ఉపయోగించిన ఫీల్ వచ్చినా, నిర్మాణ విలువలు మాత్రం సినిమాకు మంచి లిఫ్ట్ ఇచ్చాయి. మొత్తంగా టెక్నికల్‌గా ‘పురుషః’ తన రేంజ్‌కు మించిన ఔట్పుట్ ఇచ్చిన సినిమాగా చెప్పొచ్చు.
సినిమా ఎలా ఉందంటే..
సమాజంలో మగవాళ్లు పడే కష్టాలు, భార్యాభర్తల మధ్య వచ్చే ఈగో క్లాషెస్ చుట్టూ తిరిగే ఈ కథ కంప్లీట్ ఎంటర్టైనర్గా సాగింది. దర్శకుడు వీరు ఎంచుకున్న కథ పూర్తిగా కొత్తది కాకపోయినా, దాన్ని ప్రస్తుత జనరేషన్‌కు కనెక్ట్ అయ్యేలా ట్రీట్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. భార్యాభర్తల మధ్య చిన్న అపార్థాలు ఎలా పెద్ద సమస్యలుగా మారుతాయనే అంశాన్ని కామెడీ టచ్‌తో చెప్పడంలో ఆయన కొంతవరకు సక్సెస్ అయ్యాడు. డైలాగ్స్‌లో కూడా రిలేటబుల్ ఫన్ కనిపిస్తుంది. ఈ రోజుల్లో పెళ్లైన ప్రతి మగాడి జీవితంలోనూ చిన్న చిన్న అపార్థాలు, ఈగోలు, అనుమానాలు కామన్ అయిపోయాయి. చీటికీ మాటికీ భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు మెట్లు ఎక్కడం, కౌన్సెలింగ్లకు వెళ్లడం ఇవన్నీ సమాజంలో తరచూ కనిపించే సన్నివేశాలే. అలాంటి రిలేటబుల్ పాయింట్‌ను తీసుకుని దర్శకుడు పురుషఃను పూర్తిగా వినోదాత్మకంగా తెరకెక్కించాడు. భార్యాభర్తల మధ్య జరిగే వార్‌ను కామెడీగా చూపిస్తూ, మధ్య మధ్యలో ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశాడు. చివరికి “భార్యల్ని యుద్ధంతో కాదు.. ప్రేమతో గెలవాలి” అని చెబుతూ కనెక్ట్ అయ్యే మెసేజ్‌తో కథను ముగించాడు. ఆ మెసేజ్‌కి వెళ్లే ప్రయాణంలో జరిగే గందరగోళం, ఫ్రెండ్స్ మధ్య సరదా, భార్యాభర్తల తగాదాలే ఈ సినిమాకి ప్రధాన వినోదం.
ప్లస్ పాయింట్స్ :
పవన్ కళ్యాణ్ బత్తుల నేచురల్ పెర్ఫార్మెన్స్
సప్తగిరి, కసిరెడ్డి రాజ్‌కుమార్ కామెడీ టైమింగ్
రిలేటబుల్ మ్యారీడ్ లైఫ్ కామెడీ
కలర్‌ఫుల్ విజువల్స్, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్
కొన్ని వన్‌లైనర్స్, కోర్ట్ కామెడీ సీన్స్
ఎమోషన్‌తో ముగిసే క్లైమాక్స్
మైనస్ పాయింట్స్ :
రెగ్యులర్ స్టోరీ లైన్
కొన్ని చోట్ల సాగదీత అనిపించే సన్నివేశాలు
పాటలు పెద్దగా గుర్తుండకపోవడం
అవసరానికి మించిన వీఎఫ్ఎక్స్
Purushaha Telugu Movie Review :
ఫైనల్‌గా : నవ్వుల మీదే నడిచే ఓ రిలేటబుల్ ఎంటర్టైనర్.. లాజిక్స్ పక్కనపెట్టి ఫ్యామిలీతో కలిసి సరదాగా నవ్వుకోవాలనుకునే వారికి ‘పురుషః’ పర్ఫెక్ట్గా చెప్పుకోవచ్చు.
రేటింగ్ : 3/5 ⭐⭐⭐☆☆