Ram Charan–Sukumar Reunite RC17 Gears Up
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త సినిమాపై మరోసారి ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయనున్నట్లు రెండేళ్ల క్రితమే ప్రకటించారు. అయితే పలు కారణాలతో ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చడంలో జాప్యం జరిగింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పనుల్లో వేగం పెరగడంతో అభిమానుల్లో అంచనాలు మొదలయ్యాయి.
Ram Charan–Sukumar Reunite RC17 Gears Up
ఈ నేపథ్యంలో బుధవారం ఫిల్మ్‌నగర్‌లో చిత్ర బృందం మూవీ ఆఫీస్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు సుకుమార్, నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, సంస్థ సీఈవో చెర్రీతో పాటు దర్శకుడు బుచ్చిబాబు సానా పాల్గొన్నారు. ఈ పరిణామంతో సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు చివరి దశకు చేరుకున్నాయని, ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా దాదాపుగా పూర్తయ్యాయని సమాచారం. ఈ క్రమంలో దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 20న సినిమాను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అనంతరం డిసెంబర్ మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారట.
రామ్ చరణ్ కెరీర్లో 17వ చిత్రంగా రూపొందనున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘రంగస్థలం’తో పల్లెటూరి నేపథ్యంలో అద్భుతమైన కథను ఆవిష్కరించిన సుకుమార్.. ఈసారి అర్బన్ బ్యాక్‌డ్రాప్‌లో పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ను తెరకెక్కించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ సినిమా కథ, రామ్ చరణ్ పాత్ర ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి నెలకొంది.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇప్పటివరకు సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమాలకు ఎక్కువగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అయితే ఈసారి ఆర్సీ 17 కోసం అనిరుధ్ రవిచందర్‌ను సంగీత దర్శకుడిగా తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే సుకుమార్‌తో అనిరుధ్‌కు ఇదే తొలి సినిమా కానుంది. హీరోయిన్‌తో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులకు సంబంధించిన వివరాలను చిత్ర బృందం త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.