Ranabaali Roars with Vijay Deverakonda
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రణబాలి’. ‘టాక్సీవాలా’ తర్వాత విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సంకృత్యన్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో, టీ-సిరీస్ సమర్పణలో రూపొందిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని విజయదశమి కానుకగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మూవీ టీమ్ సినిమా విశేషాలను పంచుకుంది.
Ranabaali Roars with Vijay Deverakonda
ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమ గర్వపడేలా ‘రణబాలి’ సినిమా ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు వస్తుందని అన్నారు. ఒక సాధారణ పీరియాడిక్ యాక్షన్ సినిమాగా మొదలైన ఈ ప్రయాణం, చరిత్రలో దాగి ఉన్న కొన్ని కీలక అధ్యాయాలను తెలుసుకున్న తర్వాత మరింత బలమైన ఉద్దేశంతో ముందుకు సాగిందని తెలిపారు. దర్శకుడు రాహుల్ సంకృత్యన్ కథను సిద్ధం చేయడానికి ఎంతో సమయం కేటాయించారని, తనకు చెప్పాలనుకున్న విషయాన్ని ఎక్కడా రాజీ పడకుండా తెరపైకి తీసుకొచ్చారని విజయ్ ప్రశంసించారు. రాహుల్ కేవలం కెరీర్ కోసం సినిమాలు చేయరని, ప్రేక్షకులకు గొప్ప కథలు చెప్పాలనే తపనతో చిత్రాలను రూపొందిస్తారని అన్నారు.
చరిత్రలో జరిగిన కరువు పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను ప్రస్తావించిన విజయ్ దేవరకొండ.. సుమారు 150 ఏళ్ల క్రితం సంభవించిన గ్రేట్ మద్రాస్ ఫామైన్ గురించి మాట్లాడారు. అప్పటి బ్రిటిష్ పాలనలో చోటుచేసుకున్న దారుణ పరిణామాలు లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్నాయని పేర్కొన్నారు. గత తరాలు ఎదుర్కొన్న బాధలు భవిష్యత్తు తరాలకు ఎదురుకాకూడదంటే నీరు, విద్యుత్, ఆహారాన్ని వృథా చేయకుండా జాగ్రత్తపడాలని సూచించారు. ఎలాంటి కష్టాలు ఎదురైనా ముందుకు సాగే ధైర్యం భారతీయుల్లో ఉందని చెప్పారు. ఈ సినిమా ద్వారా చరిత్రను తెలుసుకోవడంతో పాటు, మన పూర్వీకులు ఎదుర్కొన్న పరిస్థితులను అర్థం చేసుకునే అవకాశం ప్రేక్షకులకు లభిస్తుందని ఆయన మాటల్లో స్పష్టమైంది.
అలాగే ‘నోటా’ తర్వాత ఎదురైన పరిస్థితులు, ‘టాక్సీవాలా’ సమయంలో ఎదుర్కొన్న సవాళ్లను గుర్తుచేసుకున్న విజయ్ దేవరకొండ.. తనపై తనకు నమ్మకం ఉంచి, చేసే పనిలో పూర్తిస్థాయిలో కష్టపడటమే ముఖ్యమని అన్నారు. ‘రణబాలి’తో మరోసారి తనకు ప్రత్యేకమైన విజయ వేదిక లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
‘రణబాలి’ కేవలం వినోదం కోసం రూపొందించిన సినిమా మాత్రమే కాదని, మరుగున పడిపోయిన చరిత్రను ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయత్నమని దర్శకుడు రాహుల్ చెప్పారు. ఆకలి, అన్నం, ప్రజల పోరాటాలు, చరిత్రలో చోటుచేసుకున్న విషాద సంఘటనల నేపథ్యంలో ఈ కథను తెరకెక్కించామని అన్నారు. మన నేలపై పుట్టిన ఓ వీరుడి పోరాటాన్ని, అప్పటి పరిస్థితులను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పోషించిన రణబాలి పాత్ర తన కెరీర్లో ప్రత్యేకంగా నిలుస్తుందని దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెలిపారు. రాయలసీమ నేపథ్యం, అక్కడి భాష, జానపద కథలు, స్థానిక వీరుల గాథల నుంచి ఈ కథకు ప్రేరణ లభించిందని చెప్పారు.
‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ తర్వాత విజయ్‌తో కలిసి నటిస్తున్న ఈ మూడో చిత్రంలో తమ జంటను ప్రేక్షకులు సరికొత్త కోణంలో చూస్తారని రష్మిక చెప్పారు. ఇది పూర్తిస్థాయి ప్రేమకథ కాకపోయినా, అద్భుతమైన ప్రేమానుబంధంతో కూడిన ట్రాక్ ఉంటుందని, ఆ ఎమోషన్ కథకు మించి ఉంటుందని వివరించారు. తాను పోషించిన జయమ్మ పాత్ర ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుంది అని అన్నారు. ఈ సినిమా కోసం చిత్ర బృందం నెలల తరబడి ఎంతో కష్టపడిందని, సెట్స్‌లో వారి శ్రమను దగ్గరగా చూసిన వ్యక్తిగా సినిమా ప్రత్యేకత తనకు తెలుసని రష్మిక అన్నారు. ప్రేక్షకులు థియేటర్లలో అడుగుపెట్టినప్పుడు మరో ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతి పొందుతారని పేర్కొన్నారు.
ప్రొడ్యూసర్ నవీన్ యెర్నేని మాట్లాడుతూ – ‘రణబాలి లాంటి సినిమాను నిర్మించే అవకాశం అరుదుగా వస్తుంటుంది. మాకు ఎంతో సంతృప్తినిచ్చిన చిత్రమిది. ఇలాంటి గొప్ప కథను మా దగ్గరకు తీసుకొచ్చిన డైరెక్టర్ రాహుల్ కు థ్యాంక్స్. విజయ్, రశ్మిక వివాహం తర్వాత ఫస్ట్ చేస్తున్న సినిమా మాదే కావడం అదృష్టంగా భావిస్తున్నాం. మా మూవీకి వర్క్ చేసిన కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్స్’ అని చెప్పారు.
ప్రొడ్యూసర్ రవిశంకర్ మాట్లాడుతూ ‘ఇది మన కథ, మన కల్చర్ తో రూపొందిన సినిమా. మనకు తెలియని చరిత్రను చూపించే సినిమా. మన తెలుగు వీరుడి గొప్పదనం చెప్పే సినిమా. ఒక అల్లూరి, ఒక కొమరం భీమ్ లా మన తెలుగు హీరో రణబాలి. మా బంగారుకొండ విజయ్ దేవరకొండకు ఆయన పడిన కష్టానికి ఈ సినిమాతో పెద్ద హిట్ రావాలని కోరుకుంటున్నాం. రశ్మికతో మా సంస్థకు పాన్ ఇండియా హిట్స్ ఉన్నాయి. వీళ్లతో మళ్లీ మళ్లీ మూవీస్ చేసే అవకాశం రావాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.

దర్శకులు హరీష్ శంకర్, శివ నిర్వాణ, బుచ్చిబాబు సానా, వివేక్ ఆత్రేయ, శౌర్యువ్, రవికిరణ్ కోలా, రాహుల్ రవీంద్రన్ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరారు.
నటులు మైమ్ మధు, వినోద్ సాగర్, కంచెరపాలెం కిషోర్, వ్లాదిమిర్, లిరిసిస్టులు సరస్వతీపుత్ర రామజోగయ్యశాస్త్రి, డాక్టర్ చక్రవర్తుల, కేశవాదిత్య, ప్రొడక్షన్ డిజైనర్ శివంరావు నాగసాని, డీవోపీ జిష్ణు భట్టాజిష్ణు భట్టాచర్జీ, కొరియోగ్రాఫర్ విజయ్ పొలాకీ మాస్టర్, రైటర్ ప్రమోద్, కో ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని ఈ చిత్రంలో భాగం కావడం చాలా సంతోషంగా ఉందని ఈ సినిమా విజయంపై పూర్తి నమ్మకంగా ఉన్నామని అన్నారు.