తిరస్కరించబడితే దాన్ని స్వీకరించండి
ఒక్కడు కాదు 100 మంది కాదన్నా కుంగిపోకూడదు
మీకు టాలెంట్ ఉన్నంతకాలం ఎవ్వరూ మిమ్మల్ని ఆపలేడు
టాలీవుడ్లో తన ప్రత్యేకమైన స్టైల్, పంచ్ డైలాగ్స్, రియలిస్టిక్ కథలతో గుర్తింపు పొందిన దర్శకుడు పూరి జగన్నాథ్ మరో కోణంలోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సినిమాలకే పరిమితం కాకుండా, తన ఆలోచనలను నేరుగా ప్రజలతో పంచుకోవాలని భావించిన ఆయన, “Puri Jagannadh Musings” పూరి జగన్నాథ్ మ్యూజింగ్స్ అనే ఆడియో సిరీస్ ద్వారా వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ మ్యూజింగ్స్‌లో పూరి తన జీవిత అనుభవాలు, సమాజంపై ఉన్న అభిప్రాయాలు, వ్యక్తిత్వ వికాసం, విజయాలు-, విఫలాలపై నేర్చుకున్న పాఠాలు వంటి విషయాలను సూటిగా, సరళంగా, కొన్నిసార్లు కఠినమైన నిజాలతో చెబుతుంటారు. ఆయన చెప్పే ప్రతి మాటలో జీవితాన్ని చూసే కోణం, ఆలోచింపజేసే లోతు కనిపిస్తుంది.
ప్రతి ఆడియో ఒక చిన్న గుణపాఠంలా ఉండి, వినేవారిలో ఆత్మపరిశీలనకు దారి తీస్తుంది.
తాజాగా తిరస్కరణ (రిజెక్షన్)పై ఒక గొప్ప సందేశాన్ని షేర్ చేశారు పూరి జగన్నాథ్. అదే ఏమిదో చదివేద్దాం రండి.
“ తిరస్కరించబడితే దాన్ని స్వీకరించండి. జీవితంలో రిజెక్షన్ అనేది సహజం. అది ఒక ఉద్యోగం, అవకాశం కావచ్చు ఒక సంబంధం కావచ్చు లేదా మీరు ఎంతో ఆశించిన కల కావచ్చు. రిజెక్షన్ ఎదురైనప్పుడు గుండె బరువెక్కిపోద్ది లేకపోతే నీరసం వచ్చేస్తది. అయినా సరే ఈ రిజెక్షన్‌ను ఒక సమస్యలా కాకుండా ఒక కొత్త ప్రారంభంలా భావించడం నేర్చుకోవాలి. ఎవడో మిమ్మల్ని కాదన్నంత మాత్రాన మీ విలువ తగ్గిపోదు. ఏమో అంతకంటే మంచి అవకాశం మీకు రావచ్చేమో ఎవడికి తెలుసు. తిరస్కరణ ఒక అవకాశం. ఎవరైనా మిమ్మల్ని రిజెక్ట్ చేస్తే దాన్ని ఒక మంచి అవకాశంగా ఫీల్ అవ్వండి. లైఫ్ లో సక్సెస్ అయిన ఎంతో మంది ఒకప్పుడు ఎవరితోనో రిజెక్ట్ కాబడినోళ్లే ఒకరి రిజెక్షన్ మిమ్మల్ని ఆపలేదు. మనం ఎన్నిసార్లు రిజెక్ట్ అయితే అంత కసి పెరుగుతుంది. ఆ అనుభవాలని మనం వాడుకుంటూ ముందుకు పోవడమే. నిజానికి రిజెక్షన్ చాలా బాధగా ఉంటది. ఒక్కోసారి మనం హెల్ప్ చేసిన వాళ్ళు కూడా మనల్ని రిజెక్ట్ చేయొచ్చు. అప్పుడు ఇంకా బాధగా ఉంటది. అన్ని రిజెక్షన్స్ ని మనం యక్సెప్ట్ చేయటమే ఎవరో రిజెక్ట్ చేశారన్న బాధ మనల్ని బలహీన పరచకూడదు. ఒకవేళ మీరు ఏమైనా తప్పు చేశారేమో చెక్ చేసుకోండి ఏదైనా లోపాలు ఉంటే సందిద్దుకోండి.
మీలో స్కిల్, లేదా టాలెంట్ ఉన్నంత కాలం మిమ్మల్ని ఎవ్వడు ఆపలేడు. రిజెక్ట్ అయిన ప్రతిసారి మీ టాలెంట్ ని ఇంకా పెంచుకోవడం ఎలా ఆలోచించండి. దానికోసం కావాలంటే చదువుకోండి లేదా కష్టపడి నేర్చుకోండి. రిజెక్ట్ అయిన ప్రతిసారి మీరు ఒక్కో మెట్టు ఎక్కేలా మీ టాలెంట్ ని పెంచుకోండి. ఒక తలుపు మూసుకుంటే ఇంకో తలుపు తెరుచుకుంటది. రిజెక్షన్ వల్ల మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతినకూడదు. ముఖ్యంగా ఎవరైనా మనల్ని కాదంటే ఒక్కసారిగా మనం ఒంటరిగా అయిపోయిన ఫీలింగ్ కలుగుద్ది. ఒక్కరు కాదు మిమ్మల్ని 100 మంది కాదన్నా సరే మీరు కుంగిపోకూడదు.
కొంతమంది మనల్ని అవమానించి మరీ రిజెక్ట్ చేస్తారు. అయినా సరే పట్టించుకోవద్దు. ఎందుకంటే ఒక్కోసారి మన పొటెన్షియల్ మనకే తెలియదు. ఏమో మనం, మనం అనుకున్న దానికంటే ఇంకా ఎత్తుకు వెళ్తామేమో ఎవడికి తెలుసు. అలాగే మీకు కూడా మీ శక్తి తెలీదు కాబట్టి ఎవడో కాదన్నాడని నో చెప్పాడని వద్దన్నాడని బాధపడొద్దు మన గురించి మనకే తెలియదు వాడికేం తెలుసు వాడి బొంద..’’ అని పూరి జగన్నాథ్ చెప్పడం ప్రతిఒక్కరికీ ఆలోచింపజేసేలా ఉంది.







