PawanTej Konidela JANTA First Look Launched
మెగా ఫ్యామిలీ నుంచి మరో ఆసక్తికరమైన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. కొణిదెల పవన్ తేజ్ హీరోగా నటిస్తున్న నూతన చిత్రం ‘జంట’. ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను తాజాగా ఘనంగా ఆవిష్కరించారు. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ప్రేమ, యాక్షన్, భావోద్వేగాల మేళవింపుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ‘యుద్ధం రాముడితో కాదు రాజ్యంతో..’ అనే పవర్ఫుల్ క్యాప్షన్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
PawanTej Konidela JANTA First Look Launched
వసుంధర ఆర్ట్స్ బ్యానర్‌పై రాజేష్ గునిశెట్టి, వీరు యాదవ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజశేఖర్ యాదవ్ దర్శకత్వం వహిస్తున్నారు. పాడని కుమార్ హీరోయిన్గా నటిస్తోంది. అమలాపురం పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరగనుంది. దాదాపు రెండు నెలల పాటు ఇక్కడే చిత్రీకరణ నిర్వహించేందుకు చిత్రబృందం ప్లాన్ చేసింది.
ఈ సందర్భంగా నిర్వహించిన టైటిల్, ఫస్ట్ లుక్ లాంఛ్ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మెట్ల రమణబాబు, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో మెట్ల రమణబాబు మాట్లాడుతూ.. గతంలో ‘దసరా బుల్లోడు’ నుంచి ఎన్నో సినిమాల షూటింగ్స్ ఈ ప్రాంతంలో జరిగాయని గుర్తుచేశారు. ఇప్పుడు ‘జంట’ చిత్రాన్ని కూడా అమలాపురంలో తెరకెక్కించనుండటం సంతోషంగా ఉందన్నారు. హీరో పవన్ తేజ్‌కు ఇది రెండో సినిమా అని, ఈ చిత్రంతో మెగా ఫ్యామిలీలో మరో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ.. ప్రకృతి అందాలకు నెలవైన అమలాపురంలో సినిమా షూటింగ్ ప్రారంభం కావడం ఆనందంగా ఉందన్నారు. ఇక్కడ మరిన్ని చిత్రాల షూటింగ్స్ జరగాలని, తద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరగాలని ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో స్టూడియోలు ఉన్నట్లే, అమలాపురం పరిసర ప్రాంతాల్లో అద్భుతమైన ప్రకృతి లొకేషన్లు ఉన్నాయని, వాటిని నేచర్ స్టూడియోగా అభివర్ణించవచ్చని అన్నారు. ‘జంట’ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకున్నారు.
నిర్మాత రాజేష్ గునిశెట్టి మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ కోసం గత రెండేళ్లుగా కష్టపడుతున్నామని తెలిపారు. కథకు అమలాపురం ప్రాంతం సరిగ్గా సరిపోతుందని భావించి ఇక్కడ షూటింగ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. స్థానిక ప్రాంతానికి చెందిన నిర్మాతలుగా తమ సినిమా ఇక్కడే చిత్రీకరణ జరుపుకోవడం ప్రత్యేక ఆనందాన్నిస్తోందన్నారు. దర్శకుడు రాజశేఖర్ యాదవ్ ఈ కథను అద్భుతంగా తెరకెక్కించగలరని, ఆయన ప్రతిభతో టాలీవుడ్‌కు ఒక కొత్త తరహా క్రియేటివ్ డైరెక్టర్ పరిచయం కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.
హీరోయిన్ పాడని కుమార్ మాట్లాడుతూ.. ‘జంట’ తన తొలి తెలుగు సినిమా అని, ఈ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. తనకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. షూటింగ్లో పాల్గొనేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు.
హీరో పవన్ తేజ్ కొణిదెల మాట్లాడుతూ.. తమ సినిమాకు ఆశీస్సులు అందించిన అతిథులకు కృతజ్ఞతలు తెలిపారు. తొలుత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేయాలని భావించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లోనూ సినిమా చిత్రీకరణలు జరగాలనే ఉద్దేశంతో అమలాపురాన్ని ఎంచుకున్నామని వెల్లడించారు. సినిమా మొత్తం ఇక్కడే చిత్రీకరించనున్నట్లు చెప్పారు.
దర్శకుడు రాజశేఖర్ యాదవ్‌తో కలిసి రెండేళ్లుగా ఈ కథపై ప్రయాణిస్తున్నానని, మంచి సినిమా అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. ఇతర సినిమాల అవకాశాలు వచ్చినప్పటికీ ‘జంట’ కోసమే ఎదురుచూశానని చెప్పారు. ఈ సినిమాలో బలమైన కథతో పాటు మంచి ఎమోషనల్ డ్రైవ్, మాస్ అంశాలు ఉంటాయని వెల్లడించారు. ఇప్పటివరకు చూడని ఓ కొత్త తరహా కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. ‘యుద్ధం రాముడితో కాదు రాజ్యంతో..’ అనే క్యాప్షన్ కథకు సరిగ్గా సరిపోతుందని, ఈ క్యాప్షన్ చూసి చాలామంది ఫోన్ చేసి సినిమా గురించి అడుగుతున్నారని తెలిపారు. ‘జంట’తో బ్లాక్‌బస్టర్ అందుకుంటామని పవన్ తేజ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక డీవోపీ రాహుల్ శ్రీ వాస్తవ్ మాట్లాడుతూ.. రెండు నెలల పాటు అమలాపురంలో షూటింగ్ జరగనుందని, స్థానికుల సహకారం కావాలని కోరారు. ఫైట్ మాస్టర్ గౌరీ శంకర్ మాట్లాడుతూ.. దర్శకుడు చెప్పిన కథలో యుద్ధం ఓ ఊరి మీదకు వస్తే ఎదురయ్యే పరిస్థితులు, భావోద్వేగాలు తనను ఆకట్టుకున్నాయని తెలిపారు.