Niharika Konidela Pocket Rockets Teaser
నిహారిక కొణిదెల నిర్మాణంలో రూపొందుతున్న మరో ఆసక్తికరమైన చిత్రం ‘పాకెట్ రాకెట్స్’. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు రుద్ర అత్రి దర్శకత్వం వహిస్తున్నారు. పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. త్రినాథ్ వర్మ, నూతన నటుడు నిర్మల్ హీరోలుగా, శ్రియా కొంతం హీరోయిన్గా నటిస్తుండగా.. జేడీ చక్రవర్తి కీలక పాత్రలో కనిపించనున్నారు. గ్యాంబ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Niharika Konidela Pocket Rockets Teaser
తాజాగా ఈ సినిమా నుంచి ‘ది ఫస్ట్ హ్యాండ్’ పేరుతో టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మూవీ టీమ్ సినిమాపై తమ అభిప్రాయాలను పంచుకుంది.
నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. ‘‘పాకెట్ రాకెట్స్’ చిత్రాన్ని జులైలో ప్రారంభించాం. దర్శకుడు రుద్రతో మాకు ఎన్నో ఏళ్లుగా పరిచయం ఉంది. టీజర్ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ఇందులో అంజి, ఏసు, జేడీ చక్రవర్తి గారి పాత్రలు అద్భుతంగా ఉంటాయి. కేవలం ఆరు నెలల్లోనే సినిమాను పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేశాం. డిసెంబర్ 11న మా సినిమా థియేటర్లలోకి వస్తుంది. అప్పటివరకు మేమంతా మీ సోషల్ మీడియాలోకి, మీ ఇంట్లోకి వచ్చేస్తాం’’ అని అన్నారు.
జేడీ చక్రవర్తి మాట్లాడుతూ.. ‘‘నా జీవితంలో నిహారిక లాంటి గొప్ప నిర్మాతను చూడలేదు. అక్టోబర్‌లో ఈ సినిమా కోసం షూటింగ్ చేశాను. నవంబర్‌లో టీజర్ విడుదల చేస్తామని చెప్పారు. డిసెంబర్లో సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా స్కేల్‌ను మన్యం రమేష్ గారు ఎంతో పెంచారు. దర్శకుడు రుద్ర ఈ చిత్రాన్ని ఎంతో గొప్పగా తెరకెక్కించారు”అని అన్నారు.
నిర్మాత రాహుల్ రాఘవేంద్ర మాట్లాడుతూ.. తాము ఇప్పటివరకు డిజిటల్ కంటెంట్‌తో ప్రయాణం సాగించామని, ‘పాకెట్ రాకెట్స్’ తమకు తొలి సినిమా అని తెలిపారు. నిహారికతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం ఆనందంగా ఉందని, రుద్ర చెప్పిన కథ తమకు బాగా నచ్చిందని చెప్పారు. ప్రేక్షకులు రెండు గంటల పాటు ఫోన్‌ను పక్కనపెట్టి సినిమాను ఆస్వాదించేలా ‘పాకెట్ రాకెట్స్’ ఉంటుందని అన్నారు.
దర్శకుడు రుద్ర అత్రి మాట్లాడుతూ.. టీజర్ ప్రేక్షకులకు నచ్చిందని భావిస్తున్నా. సినిమా ఇంత వేగంగా పూర్తవడానికి నిహారిక ఇచ్చిన ప్రోత్సాహం, తన టీమ్ అందించిన సహకారమే కారణమని పేర్కొంటూ ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
హీరో త్రినాథ్ వర్మ మాట్లాడుతూ.. ఈ సినిమాలో తాను అంజి అనే పాత్రలో కనిపిస్తానని తెలిపారు. జీవితాన్ని మార్చుకోవాలని, సరైన అవకాశం కోసం ఎదురుచూసే యువకుడి పాత్రలో నటించినట్లు చెప్పారు. ఆ పాత్రతో వ్యక్తిగతంగా కనెక్ట్ అయ్యానని, తనకు మరోసారి హీరోగా నిలబడే అవకాశం ఇచ్చిన నిహారిక, మన్యం రమేష్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఇద్దరు యువకులు తమ జీవితాలను మెరుగుపరుచుకోవడానికి ఏం చేశారనేది ఈ సినిమాలో ఆసక్తికరంగా చూపించామని చెప్పారు.
హీరో నిర్మల్ మాట్లాడుతూ.. ‘పాకెట్ రాకెట్స్’ తన తొలి సినిమా అని, తనపై నమ్మకంతో అవకాశం ఇచ్చిన నిహారిక, దర్శకుడు రుద్రలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్ర బృందంతో పనిచేయడం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పారు.
హీరోయిన్ శ్రియా కొంతం మాట్లాడుతూ.. ఈ సినిమాలో తాను హారిక అనే పాత్రను పోషించానని, ఆ పాత్ర ప్రేక్షకులకు దగ్గరవుతుందని అన్నారు. మంచి సినిమాలో మంచి పాత్ర చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందని, నిహారిక నిర్మాణంలో పనిచేయడం సంతోషంగా ఉందని తెలిపారు. టీజర్లో చూసిన దానికంటే సినిమా పది రెట్లు బాగుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
మ్యూజిక్ డైరెక్టర్ గ్యానీ, ఎడిటర్ అన్వల్ అలీ కార్యక్రమంలో పాల్గొని సినిమా విజయంపై కాన్ఫిడెంట్‌గా ఉన్నామని అన్నారు.