Nagarjuna Praises Palla Burusu
“సినిమా చూస్తున్నంతసేపూ నవ్వుతూనే ఉన్నాను. అదే సమయంలో కళ్లల్లో నీళ్లు వచ్చాయి. మనసు బరువెక్కింది. ఇంత మంచి సినిమా చేసినందుకు చాలా తృప్తిగా ఉంది’’ అని కింగ్ నాగార్జున అన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘పళ్ళ బురుసు’ ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘బలగం’ ఫేమ్ సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, ఇతర ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన లభించింది. కుటుంబ అనుబంధాలు, మన ఇంట్లో జరిగే చిన్న చిన్న సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది.
Nagarjuna Praises Palla Burusu
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. తల్లిదండ్రులను చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. చిన్నప్పుడు మనకు ఏ భయం వచ్చినా తల్లిదండ్రుల చేయి పట్టుకుంటామని, అదే విధంగా వారు పెద్దయ్యాక వారి బాధ్యతను మనం తీసుకోవాలని చెప్పారు. “తల్లిదండ్రులను చూసుకోవడం కంటే అదృష్టం మరొకటి ఉండదు. నేను నా తల్లిదండ్రులను చూసుకున్నాను. వాళ్లు నన్ను చిన్నప్పుడు చూసుకున్నారు. అమల కూడా తన తల్లిదండ్రులను ఎంతో అద్భుతంగా చూసుకుంటుంది. తల్లిదండ్రులను సేవించడం చాలా గొప్ప విషయం. ఉదయ్ కథ చెప్పినప్పుడు ఈ అంశమే నాకు గుర్తొచ్చింది. అయితే అతను కథను చాలా ఎంటర్టైనింగ్గా చెప్పాడు” అని నాగార్జున తెలిపారు. ‘పళ్ళ బురుసు’లో సుధాకర్ రెడ్డి శంభూతాత పాత్రలో అద్భుతంగా నటించారని, మురళీధర్ గౌడ్‌తో పాటు సినిమాలోని ప్రతి ఒక్కరూ మంచి నటన కనబరిచారని ప్రశంసించారు. ఇది మంచి టీమ్‌వర్క్‌తో రూపొందిన సినిమా అని, తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు. “నేను సినిమా చూశాను. చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. చూస్తున్నంతసేపూ నవ్వుతూనే ఉన్నాను. అదే సమయంలో కళ్లల్లో నీళ్లు వచ్చాయి, మనసు బరువెక్కింది. ఈ సినిమా చేసినందుకు మాకు చాలా తృప్తిగా ఉంది. అందరూ ప్రేమతో చేసిన సినిమా ఇది. ఖచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను” అని నాగార్జున అన్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్ 50వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా సంస్థ భవిష్యత్ ప్రణాళికలను కూడా నాగార్జున వెల్లడించారు. గతంలో తమ సంస్థ నిర్మాణంతో పాటు డిస్ట్రిబ్యూషన్లోనూ కీలకంగా వ్యవహరించిందని, అదే విధానాన్ని మరింత బలోపేతం చేస్తూ డిస్ట్రిబ్యూషన్‌ను విస్తరిస్తున్నామని తెలిపారు. “ఇకపై మరింత వేగంగా, మరింత బలంగా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాం. కొత్తవాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నాం. ‘లెనిన్’ తర్వాత ఇప్పుడు ‘పళ్ళ బురుసు’ను విడుదల చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ‘రంభ, ఊర్వశి, మేనక’తో పాటు మరో రెండు సినిమాలు కూడా ఉన్నాయి. నా ‘కింగ్ 100’ కూడా రాబోతోంది. ఇకపై అన్నపూర్ణ స్టూడియోస్ చాలా బిజీగా ఉంటుంది” అని చెప్పారు. కొత్త కథలతో ఎవరైనా వస్తే వాటిని నిర్మించేందుకు అన్నపూర్ణ స్టూడియోస్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని నాగార్జున స్పష్టం చేశారు.
నిర్మాత సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ.. ‘పళ్ళ బురుసు’ కథ మొదటిసారి విన్నప్పుడే సినిమాగా చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. “ఇది చాలా స్వీట్ స్టోరీ. ఇలాంటి కథను చేయడం ఎంతో సంతృప్తిని ఇస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ఎప్పుడూ కొత్త కథలను వెతుకుతూనే ఉంటుంది. ఈసారి ఎపిక్ స్టూడియోస్‌తో కలిసి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. కొత్తవాళ్లతో పాటు సీనియర్ నటులు కలిసి చేసిన సినిమా ఇది. కథలో మంచి ఎమోషన్‌తో పాటు లోతైన సందేశం కూడా ఉంది. ఈ సినిమా చేయడం మాకు చాలా ప్రౌడ్‌గా అనిపిస్తోంది” అని సుప్రియ అన్నారు.
దర్శకుడు ఉదయ్ చౌహాన్ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచీ నాగార్జునకు తాను వీరాభిమానినని, ఆయనకు కథ చెప్పే అవకాశం రావడం తన అదృష్టమని అన్నారు. “నాగార్జున గారి సినిమాల ప్రభావం నాపై ఎంతో ఉంది. అలాంటి ఆయనకు నా కథ చెప్పే అవకాశం వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. కథ విన్న వెంటనే ఆయన అంగీకరించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సుప్రియ గారు కూడా కథ విన్న వెంటనే సినిమా చేస్తానని చెప్పారు” అని తెలిపారు. ‘పళ్ళ బురుసు’ అనే టైటిల్ వెనుక ఉన్న ఆలోచనను కూడా దర్శకుడు వివరించారు. “పళ్ళ బురుసు అంటే టూత్ బ్రష్. పొద్దున్నే నిద్రలేచిన వెంటనే మనం ఉపయోగించే ఒక చిన్న వస్తువుతో ఒక కథ చెప్పాలి. చిన్న విషయాన్ని పెద్ద కథగా మార్చి, అందులో కొత్తదనం, తాజాదనం తీసుకురావాలనే ఆలోచనతో ఈ సినిమా చేశాను. మన ఇళ్లలో జరిగే చిన్న చిన్న గొడవలు, సంఘటనలను పరిశీలించి వాటిని కథలోకి తీసుకొచ్చాను. కుటుంబంతో కలిసి చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యే సినిమా ఇది. అందరి మనసులను హత్తుకునేలా ఉంటుంది” అని ఉదయ్ చెప్పారు.
నిర్మాత వివేక్ కృష్ణాణి మాట్లాడుతూ.. అన్నపూర్ణ స్టూడియోస్‌తో కలిసి పనిచేయడం తనకు ఎంతో గౌరవంగా ఉందన్నారు. దర్శకుడు ఉదయ్ తన విజన్‌తో సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని తెలిపారు. ఈ ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పారు.
మురళీధర్ గౌడ్ మాట్లాడుతూ.. అన్నపూర్ణ స్టూడియోస్ వంటి గొప్ప సంస్థలో పనిచేసే అవకాశం రావడం తన అదృష్టమన్నారు. ‘పళ్ళ బురుసు’ ప్రేక్షకులను అలరించడంతో పాటు కొన్ని అంశాలపై ఆలోచింపజేస్తుందని చెప్పారు.
‘బలగం’ ఫేమ్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పటివరకు తాను 79 సినిమాల్లో నటించానని, హీరోగా ఇది తనకు మూడో సినిమా అని తెలిపారు. ‘పళ్ళ బురుసు’ అనే పేరు వినడానికి చిన్నగా అనిపించవచ్చు. కానీ సినిమా చూడటానికి మాత్రం చాలా పెద్దగా ఉంటుంది అని ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు.
హీరోయిన్ గోమతి మాట్లాడుతూ.. ఈ సినిమాతో నటిగా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. అన్నపూర్ణ స్టూడియో తనకు హోమ్లాంటిదని, ఇలాంటి మంచి కథలో భాగమయ్యే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
ప్రజ్వల్ మాట్లాడుతూ.. అన్నపూర్ణ స్టూడియోస్‌లో నటించే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందని, సినిమా చూస్తున్నంతసేపూ ప్రేక్షకులు హ్యాపీగా ఫీల్ అవుతారని అన్నారు.
సంగీత దర్శకుడు పవన్ సీహెచ్ మాట్లాడుతూ.. ఇలాంటి ప్రత్యేకమైన కథలను ప్రోత్సహిస్తున్న నాగార్జునకు కృతజ్ఞతలు తెలిపారు. సినిమాను మొత్తం టీమ్ ఎంతో ఎంజాయ్ చేస్తూ రూపొందించిందని చెప్పారు.
లిరిసిస్ట్ సురేష్ గంగుల మాట్లాడుతూ.. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఒక సినిమాకు అన్ని పాటలు రాయడం తన అదృష్టమని అన్నారు. పాటలు రాస్తున్న సమయంలో ఒక పల్లెను చూస్తూ రాస్తున్న అనుభూతి కలిగిందని తెలిపారు.
కుటుంబ అనుబంధాలు, హాస్యం, భావోద్వేగాలను మేళవించిన ‘పళ్ళ బురుసు’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని చిత్రబృందం చెబుతోంది. ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.