Yash Toxic Movie Review : A Torturous Watch!
చిత్రం: టాక్సిక్ – ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్
రేటింగ్: ⭐ 1.75/5
నటీనటులు: యష్, నయనతార, కియారా అద్వాణీ, రుక్మిణీ వసంత్, తారా సుతారియా, హ్యూమా ఖురేషి తదితరులు
బ్యానర్లు: KVN Productions, Monster Mind Creations
నిర్మాతలు: వెంకట్ కే. నారాయణ, యష్
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గీతూ మోహన్ దాస్
సంగీతం: రవి బస్రూర్, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్చి
సినిమాటోగ్రఫీ (డీవోపీ): రాజీవ్ రవి
ఎడిటర్: ఉజ్వల్ కులకర్ణి
విడుదల తేదీ: 26 ఆగస్టు 2026
Yash Toxic Movie Review : A Torturous Watch!
యష్ నుంచి ‘కేజీఎఫ్ 2’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ‘టాక్సిక్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం, భారీ తారాగణం, గ్రాండ్ విజువల్స్, యాక్షన్, బోల్డ్ కంటెంట్‌తో సినిమా విడుదలకు ముందే హైప్ తెచ్చుకుంది. కానీ థియేటర్లో సినిమా మొదలైన తర్వాత ఆ అంచనాలు ఒక్కొక్కటిగా కూలిపోతాయి. సినిమా చూసే ప్రేక్షకుడికి చివరకు మిగిలేది కథపై గందరగోళం, సాగదీతపై విసుగు మాత్రమే.
కథ విషయానికొస్తే..
1947 తర్వాతి గోవా నేపథ్యంలో కథ సాగుతుంది. గ్యాంగ్‌స్టర్ ప్రపంచంలో తన అక్క గంగ (నయనతార)తో కలిసి రాయా (యష్) ఎదుగుతాడు. తన సోదరుడిని రాజులా చూడాలన్న అక్క కోరికతో రాయా హింసాత్మక మార్గంలో ముందుకు సాగుతాడు. ఈ క్రమంలో సాల్వదార్, అతని కుమార్తె రెబక్కా (తారా సుతారియా), సర్కస్ ఆర్టిస్ట్ నాడియా (కియారా అద్వాణీ), మెలిశా (రుక్మిణీ వసంత్) వంటి పాత్రలు రాయా జీవితంలోకి వస్తాయి. మరోవైపు రాయా కొడుకు టికెట్ పాత్రలో కూడా యష్ కనిపిస్తాడు. తండ్రి-కొడుకుల మధ్య విభేదాలు, కుటుంబ సంబంధాలు, ప్రేమ, హింస, గ్యాంగ్‌స్టర్ ప్రపంచం ఇలా చాలా అంశాలను కలపడానికి ప్రయత్నించారు. కానీ ఇన్ని ట్రాక్‌లను కలిపిన విధానం కథకు బలం ఇవ్వకుండా మరింత గందరగోళానికి గురిచేస్తుంది.
నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి..
యష్ తన పాత్రకు తగ్గట్టుగా భారీ స్క్రీన్ ప్రెజెన్స్ చూపించాడు. స్టైలింగ్, లుక్స్, యాక్షన్ సీక్వెన్సుల్లో అతని ఇమేజ్ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే చాలాచోట్ల ‘కేజీఎఫ్’ ఇమేజ్ నుంచి బయటకు రాలేదనే భావన కలుగుతుంది. రాయా పాత్రలో యష్ ఓకే అనిపించినా, మరో పాత్రలో కనిపించే యష్ పాత్ర ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అయ్యేలా లేదు. నయనతారకు మంచి పాత్ర ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఇంపాక్ట్ ఇవ్వలేకపోయింది. కియారా అద్వాణీ తనకు వచ్చిన అవకాశంలో మెప్పించే ప్రయత్నం చేసింది. తారా సుతారియా పాత్ర ఎక్కువగా గ్లామర్‌కే పరిమితమవుతుంది. రుక్మిణీ వసంత్‌కు మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నా, నటనకు సరైన స్కోప్ లేదు. హ్యూమా ఖురేషి సహా ఇతర నటీనటులు పెద్దగా గుర్తుండిపోయే స్థాయిలో ప్రభావం చూపలేకపోయారు.
టెక్నికల్ టీమ్ గురించి..
ఇక్కడే సినిమాకు కొంత ఊరట. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్‌గా ఉన్నాయి. ప్రతి ఫ్రేమ్ భారీగా, గ్రాండ్‌గా కనిపిస్తుంది. 1940–60ల కాలాన్ని ప్రతిబింబించే ప్రొడక్షన్ డిజైన్, రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. కానీ మంచి విజువల్స్‌ను మంచి కథతో కలపడంలో దర్శకురాలు విఫలమయ్యారు. రవి బస్రూర్, విశాల్ మిశ్రా, తనిష్క్ బాగ్చి సంగీతం కూడా అంచనాలను అందుకోలేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల మాత్రమే ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఎడిటింగ్ సినిమాకు పెద్ద మైనస్. దాదాపు మూడు గంటల నిడివి ఉన్న సినిమా మరింత కత్తిరించి ఉంటే కనీసం బోర్ కొంత తగ్గేది.
Yash Toxic Movie Review : A Torturous Watch!
సినిమా ఎలా ఉందంటే..
సినిమా ఓపెనింగ్ మాత్రం ఆసక్తిని రేకెత్తిస్తుంది. యష్ ఎంట్రీ, భారీ యాక్షన్ బ్లాక్ ప్రేక్షకుడిలో అంచనాలు పెంచుతాయి. కానీ ఆ తర్వాత కథ ముందుకు వెళ్లే కొద్దీ సమస్య మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్‌లో యాక్షన్, గన్స్, బోల్డ్ సీన్స్, హింస వరుసగా వస్తుంటాయి. కానీ వాటిని కలిపే బలమైన కథనం, ఎమోషన్ కనిపించదు. అన్నాచెల్లెళ్ల బంధం, ప్రేమ కథలు, విలన్ ట్రాక్‌లు, తండ్రి-కొడుకుల సంఘర్షణ.. ఇలా ఒకేసారి చాలా కథలను చెప్పే ప్రయత్నం చేశారు. ఫలితంగా ఏ ఒక్క ట్రాక్ కూడా బలంగా ఎస్టాబ్లిష్ కాలేదు. ‘కేజీఎఫ్’లో యాక్షన్‌తో పాటు మదర్ సెంటిమెంట్ కథను ముందుకు నడిపించింది. కానీ ‘టాక్సిక్’లో యాక్షన్, రొమాన్స్ ఉన్నప్పటికీ వాటి మధ్య బలమైన ఎమోషనల్ కనెక్షన్ కనిపించదు. అందుకే భారీ సీన్లు వచ్చినా ప్రేక్షకుడికి ఎమోషన్ కలగదు. సెకండాఫ్‌లో అయినా సినిమా పుంజుకుంటుందేమో అనుకుంటే నిరాశే ఎదురవుతుంది. కొత్త పాత్రలు, కొత్త ట్విస్టులు కథను మరింత చిరాకు తెప్పిస్తాయి. చివర్లో వచ్చే సైకాలజికల్ ట్విస్ట్ కూడా అప్పటికే సహనం కోల్పోయిన ప్రేక్షకుడికి పెద్దగా ఉపశమనం ఇవ్వదు.

ప్లస్ పాయింట్స్ :
– యష్ స్క్రీన్ ప్రెజెన్స్
– గ్రాండ్ విజువల్స్
– ప్రొడక్షన్ డిజైన్
– సినిమాటోగ్రఫీ
– భారీ యాక్షన్ బ్లాక్స్
మైనస్ పాయింట్స్ :
– బలహీనమైన కథనం
– గందరగోళంగా సాగే స్క్రీన్‌ప్లే
– ఎమోషన్ పూర్తిగా మిస్ అవ్వడం
– అవసరానికి మించిన రొమాన్స్, బోల్డ్ సీన్స్
– యాక్షన్‌లో ఇంపాక్ట్ లేకపోవడం
– మూడు గంటలకు దగ్గరగా ఉండే నిడివి
– నెమ్మదిగా సాగే ఎడిటింగ్
– తెలుగు డబ్బింగ్లో కొన్ని చోట్ల సహజత్వం లేకపోవడం
– చాలా పాత్రలు ఉన్నా ఏ ఒక్కటి బలంగా గుర్తుండకపోవడం
ఫైనల్‌గా చెప్పాలంటే..
‘టాక్సిక్’ పేరు పెట్టుకున్న ఈ సినిమా ప్రేక్షకుడికి నిజంగానే ‘టాక్సిక్ ఎక్స్పీరియన్స్’ ఇచ్చేలా ఉంది. భారీ బడ్జెట్, గ్రాండ్ విజువల్స్, యష్ ఇమేజ్, యాక్షన్, రొమాన్స్.. ఇవన్నీ ఉన్నా సినిమా మొత్తాన్ని నిలబెట్టే కథ, ఎమోషన్, ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లే మాత్రం కనిపించవు.
వైలెన్స్, రొమాన్స్ తప్ప సినిమాలో గుర్తుండిపోయే సన్నివేశాలు చాలా తక్కువ. మూడు గంటల పాటు కథను భరించడం ప్రేక్షకుడికి పెద్ద టాస్క్. ‘టాక్సిక్ కాదు.. టార్చర్’ అనే మాట ఈ సినిమాకు బాగా సరిపోతుంది.
మొత్తంగా ‘టాక్సిక్’ యష్ కెరీర్లో భారీ అంచనాల మధ్య వచ్చిన నిరాశపరిచే సినిమాగా మిగిలే అవకాశం ఉంది. సినిమా చూడటం కంటే.. స్కిప్ చేయడమే బెటర్..
రేటింగ్: 1.75/5 ⭐