Dharmasthala Niyojakavargam Trailer Launch Event
పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో విభిన్నమైన కథతో రూపొందుతున్న చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మేరుం భాస్కర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జై జ్ఞాన ప్రభ తోట కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు. సుమన్, సాయికుమార్, నటరాజ్, రాయంచ కొక్కుర, వరుణ్ సందేశ్, వితికా షేరు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.
Dharmasthala Niyojakavargam Trailer Launch Event
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మేరుం భాస్కర్ మాట్లాడుతూ, “దర్శకుడు జై జ్ఞాన ప్రభ సినిమాను పూర్తి క్లారిటీతో తెరకెక్కించారు. 45 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలని నిర్ణయించుకుని, ప్యాచ్‌వర్క్‌తో సహా అదే సమయంలో పూర్తి చేశాం. సినిమా అవుట్‌పుట్‌పై మాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రేక్షకులు థియేటర్లలో ఆదరిస్తారని ఆశిస్తున్నాం” అన్నారు.
నటుడు శివకుమార్ మాట్లాడుతూ, “సినిమాపై ప్యాషన్‌తో పనిచేసే బ్యానర్ ఇది. ఇలాంటి నిర్మాణ సంస్థలు మరింత విజయవంతం కావాలి. ఈ సినిమాలో నాకు ఒక అందమైన పాత్ర లభించింది. దర్శకుడు కొత్తవారైనా, ఆయన పనితీరులో ఎక్కడా ఆ విషయం కనిపించలేదు. ఎంతో స్పష్టతతో సినిమాను రూపొందించారు” అని అన్నారు.
హీరోయిన్ వితికా షేరు మాట్లాడుతూ, “ఈ సినిమా కథ వినకముందే పాటలు విన్నాను. పాటలు ఎంతో ఆకట్టుకోవడంతో పాటు కథ కూడా నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యాను. దర్శకుడికి ఇది తొలి సినిమా అయినప్పటికీ చాలా ప్రతిభతో తెరకెక్కించారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న నేను, ఇందులో డిఫరెంట్ క్యారెక్టర్ ఉండటంతో వెంటనే ఓకే చెప్పాను. సెప్టెంబర్ 4న ప్రేక్షకులతో కలిసి థియేటర్లలో సినిమా చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మా చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట మాట్లాడుతూ, “మంచి కథతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకునే పాటలు కూడా మా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మహావీర్ అందించిన సంగీతం సినిమాకు ఎంతో బలం. చంద్రబోస్ గారి సాహిత్యం మరో హైలైట్‌గా ఉంటుంది. నిర్మాత భాస్కర్ గారు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. ప్రతి నటీనటుడు ఎంతో సహకరించారు. సినిమాలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. కొత్త దర్శకుడైన నాకు ఇంత మంచి టీమ్ దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. మా సినిమా ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తుందనే నమ్మకం ఉంది. సెప్టెంబర్ 4న థియేటర్లలో చూసి ఆదరించండి” అని కోరారు.
నటుడు నటరాజ్ మాట్లాడుతూ, “ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. చంద్రబోస్ గారు అద్భుతమైన పాటలు రాశారు. దర్శకుడు జ్ఞాన ప్రభ గారిని చూస్తుంటే ఇది ఆయన తొలి సినిమా అనిపించలేదు. ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమాను తెరకెక్కించారు. వితికా, శివకుమార్‌తో కలిసి నాకు ఎక్కువ సన్నివేశాలు ఉన్నాయి. ముఖ్యంగా శివకుమార్‌తో చేసిన ఫైట్ సీన్స్ బాగా వచ్చాయి. మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. మీ ఆశీస్సులు కావాలి” అన్నారు.
ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ, “‘ధర్మస్థల నియోజకవర్గం’ కోసం ఐదు విభిన్నమైన పాటలు రాసే అవకాశం ఇచ్చిన దర్శకుడికి ధన్యవాదాలు. పాటల పరంగా నాకు ‘రంగస్థలం’ తర్వాత అంతటి సంతృప్తిని ఇచ్చిన సినిమా ఇదే. విభిన్న సందర్భాలకు భిన్నమైన సాహిత్యం రాసే అవకాశం ఈ చిత్రంతో దక్కింది. ‘న్యాయం చేయరా దేవుడా’, ‘ధర్మో రక్షతి రక్షితః’, ‘ఆరంభం’, ‘కొడుకో కొడుకో’, ‘కాలం’ అంటూ ఐదు పాటలు కథలో కీలక సందర్భాల్లో వస్తాయి. మహావీర్ తన సంగీతంతో వాటికి మరింత ప్రాణం పోశారు” అన్నారు.
వితికా షేరు పాత్ర గురించి మాట్లాడుతూ, “ఈ సినిమాలో ఆమెకు చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ దక్కింది. కథలో ఆమె పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. సరైన సమయంలో ఆమెకు సరైన పాత్ర దొరికింది” అని చంద్రబోస్ పేర్కొన్నారు. అలాగే దర్శకుడు జై జ్ఞాన ప్రభపై ప్రశంసలు కురిపిస్తూ, “మంచి సినిమా చేస్తే డబ్బులు వస్తాయనే నమ్మకంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆయన వద్ద ఇంకా ఎన్నో మంచి కథలు ఉన్నాయి. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు చేస్తారని నమ్ముతున్నాను. ఈ చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ తప్పకుండా దక్కాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ట్ డైరెక్టర్ భార్గవాచారి నౌండ్ల, సంగీత దర్శకుడు మహావీర్ ఏలేందర్ సహా చిత్ర యూనిట్ సభ్యులు సినిమా విశేషాలను పంచుకుంటూ ప్రేక్షకుల ఆదరణ కోరారు.