Naga Vamsi Sensational Comments on Heros and Ticket Prices
టాలీవుడ్లో సినిమా టికెట్ ధరల పెంపు అంశం ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది. పెద్ద సినిమాలు విడుదలైన ప్రతిసారీ టికెట్ రేట్ల పెంపు, ప్రేక్షకులపై పడే భారం, నిర్మాతల వాదనలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నాగవంశీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో చర్చకు దారితీశాయి. సినిమా ప్రమోషన్ల సమయంలో హీరోలు చేసే ప్రకటనలు, టికెట్ ధరల పెంపు నిర్ణయాలపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన నాగవంశీ.. టికెట్ ధరల పెంపు, హీరోల ప్రకటనలు, మీడియా వైఖరిపై చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
Naga Vamsi Sensational Comments on Heros and Ticket Prices
‘రణబాలి’ మూవీ ప్రమోషన్స్ సమయంలో ఆయన సినిమాలకు ఎట్టి పరిస్థితుల్లో టికెట్ రేట్లు పెంచబోమని విజయ్ దేవరకొండ చెప్పగా.. దీనిపై నాగవంశీని ఓ విలేఖరి వివరణ అడగగా.. ఆయన మాట్లాడుతూ..
పబ్లిసిటీ సమయంలో హీరోలు చాలా విషయాలు చెబుతుంటారని, అయితే వారు చెప్పినవన్నీ జరుగుతాయా? అని నాగవంశీ ప్రశ్నించారు. టికెట్ ధరలను పెంచాలా వద్దా అనేది హీరోలు నిర్ణయించే విషయం కాదని, ఆ నిర్ణయం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల చేతుల్లోనే ఉంటుందని స్పష్టం చేశారు.
టికెట్ ధరలను పెంచినప్పుడు దానిపై అనవసరమైన నెగెటివిటీని సృష్టిస్తున్నారని నాగవంశీ అభిప్రాయపడ్డారు. సినిమా టికెట్ ధరలు పెంచారనే విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తూ ప్రేక్షకుల్లో ప్రతికూల అభిప్రాయాన్ని కలిగిస్తున్నారని, దీనివల్ల సినీ పరిశ్రమకు నష్టం జరుగుతోందని అన్నారు. మీడియా కూడా కొన్ని సందర్భాల్లో సినిమాలపై నెగెటివిటీ పెంచడం ద్వారా ఇండస్ట్రీని బ్యాడ్ చేస్తోందని విమర్శించారు. టికెట్ ధరల పెంపుపై జరుగుతున్న చర్చలో వాస్తవ పరిస్థితులను కూడా అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల టికెట్ ధరల్లో చాలా వ్యత్యాసం ఉందని, ఏపీలో పంచాయతీ, మున్సిపాలిటీలను బట్టి ధరలు మారుతుంటాయని తెలిపారు. టికెట్ ధరలు మరీ తక్కువగా ఉన్నప్పుడే పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.
ఇక ‘జైలర్ 2’ తెలుగు హక్కులను దాదాపు రూ.45 కోట్ల ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసినట్లు నాగవంశీ వెల్లడించారు. మొదట్లో అంత భారీ రేటుకు తీసుకోవడంపై చాలామంది ఆందోళన వ్యక్తం చేశారని, అయితే వసూళ్లు చూసిన తర్వాత డిస్ట్రిబ్యూటర్లకు కమిషన్ వస్తుందనే నమ్మకం కలిగిందన్నారు. రజనీకాంత్, నెల్సన్, అనిరుధ్లపై నమ్మకంతో రిస్క్ చేశామని, ఇప్పుడు మంచి ఫలితం దక్కుతుండటం సంతోషంగా ఉందని తెలిపారు.