Lenin Blockbuster Feels Like a Festival
“నాకు, అఖిల్, చైతన్యకి పండగలా ఉంది.. ఇల్లంతా కళకళలాడుతోంది” అంటూ అక్కినేని నాగార్జున చెప్పిన మాటలు ‘లెనిన్’ విజయోత్సవ వేడుకలో హైలైట్‌గా నిలిచాయి. అఖిల్ అక్కినేని హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ‘లెనిన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకుని విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ LLP, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం విడుదలైన కొద్ది రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి ట్రేడ్ వర్గాలను ఆకట్టుకుంది.
ఈ విజయాన్ని పురస్కరించుకుని సోమవారం ‘లెనిన్ బ్లాక్‌బస్టర్ వైభవం’ పేరుతో ప్రత్యేక సెలబ్రేషన్ నిర్వహించారు. ఈ వేడుకలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, చిత్రబృందానికి ప్రత్యేక షీల్డ్స్ అందజేసి చిత్ర విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు.
Lenin Blockbuster Feels Like a Festival
సినిమా విజయంతో ఆనందం వ్యక్తం చేసిన నాగార్జున మాట్లాడుతూ.. గతంలో బ్లాక్‌బస్టర్ సినిమాల విజయోత్సవాల్లో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు షీల్డ్స్ అందించడం ఆనవాయితీగా ఉండేదని, చాలా కాలం తర్వాత మళ్లీ ‘లెనిన్’ కోసం అలాంటి వేడుక నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రతీ ప్రాంతం నుంచి హౌస్‌ఫుల్ రిపోర్ట్స్ వస్తుండటం, షోలు పెంచుతున్నామని డిస్ట్రిబ్యూటర్లు చెప్పడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. కథ రూపకల్పనలో రచయిత సత్యానంద్, పాటల విషయంలో రామజోగయ్య శాస్త్రి, అలాగే అన్నపూర్ణ పోస్ట్ ప్రొడక్షన్ టీమ్ అందించిన సహకారం చిత్ర విజయానికి కీలకమైందని ప్రశంసించారు. ఈ ప్రేమ కోసం, ఈ అరుపుల కోసం అఖిల్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. నాకు, అఖిల్, చైతన్యకి ఇప్పుడు పండగలా ఉంది. ఇల్లంతా కళకళలాడుతోంది.” అంటూ అభిమానుల ప్రేమకు నాగార్జున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
అక్కినేని అభిమానులకు కృతజ్ఞతలు తెలిపిన నాగ చైతన్య, ఈ కథ విన్న రోజే అఖిల్ ఖచ్చితంగా విజయం సాధిస్తాడని నమ్మానన్నారు. లెనిన్ పాత్రకు అఖిల్ వ్యక్తిత్వానికి ఎలాంటి పోలికలు లేకపోయినా, ఆ పాత్ర కోసం అతను పూర్తిగా మారిపోయాడని ప్రశంసించారు.”ఓ అన్నయ్యగా, అభిమానిగా అఖిల్‌ను చూస్తే ఎంతో గర్వంగా ఉంది.” అని పేర్కొన్నారు. నాన్న కెరీర్లో వచ్చిన ‘శివ’, ‘అన్నమయ్య’, ‘నిన్నే పెళ్లాడుతా’ వంటి ధైర్యమైన నిర్ణయాలే ఈరోజు ‘లెనిన్’ రూపంలో మరోసారి కనిపించాయని అన్నారు. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు, నిర్మాత నాగవంశీ, సంగీత దర్శకుడు తమన్, హీరోయిన్ భాగ్యశ్రీతో పాటు మొత్తం చిత్రబృందాన్ని అభినందించారు.
భారీ విజయాన్ని అందించిన ప్రేక్షకులు, అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లకు అఖిల్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రెండో రోజు నుంచే అదనపు థియేటర్లు, షోలు ఇచ్చి సినిమాకు అండగా నిలిచిన డిస్ట్రిబ్యూటర్లకు ధన్యవాదాలు చెబుతూ… “మూడు రోజుల్లోనే ‘లెనిన్’ బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది.” అని అన్నారు. సినిమా కోసం శ్రమించిన పోస్ట్ ప్రొడక్షన్ టీమ్, టెక్నీషియన్లు, చిత్ర యూనిట్ సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ.. విడుదలైన మూడు రోజుల్లోనే చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సినిమాకు అదనపు షోలు కేటాయించి సహకరించిన డిస్ట్రిబ్యూటర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సినిమాను ఘనవిజయంగా నిలబెట్టిన ప్రేక్షకులకు దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ జోరు కొనసాగుతోంది
జూలై 10న విడుదలైన ‘లెనిన్’ కమర్షియల్‌గా బలమైన వసూళ్లతో దూసుకెళ్తోంది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి, విజయోత్సవ వేడుకలు జరుపుకోవడం చిత్ర విజయాన్ని మరోసారి నిరూపించింది. అభిమానుల మద్దతు, పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్‌తో ‘లెనిన్’ విజయ ప్రస్థానం ఇంకా కొనసాగుతుండగా, అక్కినేని కుటుంబంలో నిజంగానే పండగ వాతావరణం నెలకొంది.