Jai Ho Ramanuja Telugu Movie Review
చిత్రం : జయహో రామానుజ
రేటింగ్ : 2/5
నటీనటులు : లయన్ డా. సాయి వెంకట్, సుమన్, జో శర్మ, ప్రవళ్లిక తదితరులు
బ్యానర్ : సుదర్శనం ప్రొడక్షన్స్
నిర్మాతలు : సాయిప్రసన్న, ప్రవళ్లిక
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : లయన్ డా. సాయి వెంకట్
విడుదల తేదీ : అక్టోబర్ 24, 2026
కథ విషయానికొస్తే..
11వ శతాబ్దంలో కులమత భేదాలు సమాజాన్ని ప్రభావితం చేస్తున్న సమయంలో, మానవులందరూ సమానమేననే గొప్ప సందేశాన్ని చాటిచెప్పిన మహనీయుడు శ్రీరామానుజాచార్యులు. ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలు, ఆధ్యాత్మిక బోధనలు, సమానత్వం కోసం చేసిన ప్రయత్నాల నేపథ్యంలో ‘జయహో రామానుజ’ తెరకెక్కింది. కంచిలో యాదవ ప్రకాశుల వద్ద విద్యను అభ్యసించడం నుంచి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రజలకు చేరువ చేయడం వరకు రామానుజాచార్యుల జీవిత ప్రయాణాన్ని ఇందులో చూపించారు. సమాజంలో ఉన్న అంతరాలను తొలగించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు, ఎదురైన సవాళ్లు, తన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి చేసిన కృషి కథలో ప్రధానాంశాలుగా నిలుస్తాయి. భక్తి, ఆధ్యాత్మికతతో పాటు సమానత్వం, మానవత్వం వంటి విలువలను ప్రేక్షకులకు పరిచయం చేయడమే ఈ సినిమా ప్రధాన ఉద్దేశం.

నటీనటుల పెర్ఫార్మెన్స్ గురించి..
శ్రీరామానుజాచార్యుల పాత్రలో లయన్ డా. సాయి వెంకట్ చక్కగా ఒదిగిపోయారు. ప్రధాన పాత్రతో పాటు శ్రీమహావిష్ణువు పాత్రలోనూ కనిపించి ఆధ్యాత్మిక వాతావరణాన్ని తీసుకొచ్చారు. దశావతారాల సన్నివేశాల్లో ఆయన నటన, సంభాషణలు ఆకట్టుకుంటాయి. జో శర్మ తన పాత్రకు న్యాయం చేశారు. ఢిల్లీ సుల్తాన్ పాత్రలో సుమన్ తనదైన శైలిలో నటించారు. నటి ప్రవల్లిక కృష్ణుడు, నారదుడు, రఘునాథస్వామి పాత్రల్లో నటించి ఆకట్టుకున్నారు. గురురాజ్‌తో పాటు ఇతర నటీనటులు తమ పాత్రల పరిధిలో నటించారు.
టెక్నికల్ టీమ్ గురించి..
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలను చేపట్టిన లయన్ డా. సాయి వెంకట్.. శ్రీరామానుజాచార్యుల జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఆధ్యాత్మిక అంశాలకు ప్రాధాన్యమిస్తూ కథను ముందుకు తీసుకెళ్లారు. సినిమాలోని పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. రామానుజాచార్యుల మహిమను చాటిచెప్పే గీతాలు కథలోని భక్తి భావాన్ని పెంచుతాయి. నేపథ్య సంగీతం సన్నివేశాలకు తగిన వాతావరణాన్ని అందించింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా దశావతారాల చిత్రీకరణ, గ్రాఫిక్స్ ఉపయోగించిన కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కంచి రాజకుమార్తెను దుష్టశక్తి నుంచి రక్షించే ఘట్టాన్ని గ్రాఫిక్స్‌తో ఆసక్తికరంగా తెరకెక్కించారు. అలాగే, ప్రీ క్లైమాక్స్‌లో చంద్రగిరి మహారాజు సమక్షంలో శ్రీవైష్ణవులు, శివభక్తుల మధ్య జరిగే వాదనకు ప్రాధాన్యం ఇచ్చారు. అయితే, కొన్ని సన్నివేశాల్లో కథనం నెమ్మదించడం సినిమాకు ప్రతికూలంగా మారింది. ఎడిటింగ్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకుని ఉంటే కథనం వేగంగా సాగడంతో పాటు సినిమా మరింత ఆసక్తికరంగా ఉండేది.

సినిమా ఎలా ఉందంటే..
మహనీయుల జీవితాలను తెరపై చూపించడం అంత సులభమైన విషయం కాదు. వారి ఆశయాలు, సిద్ధాంతాలు, జీవితంలోని కీలక ఘట్టాలను ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పాల్సి ఉంటుంది. ‘జయహో రామానుజ’ విషయంలో దర్శకుడు సాయి వెంకట్ అలాంటి ప్రయత్నమే చేశారు. శ్రీరామానుజాచార్యుల ఆధ్యాత్మిక ప్రస్థానాన్ని, ఆయన బోధించిన సమానత్వ భావనను కథలో భాగంగా చూపించారు. భక్తికి మాత్రమే పరిమితం కాకుండా, కులమత భేదాలకు అతీతంగా మానవులందరూ సమానమనే సందేశాన్ని అందించడంపై దృష్టి పెట్టారు. దశావతారాల ఘట్టాలు, ఆధ్యాత్మిక సంభాషణలు, చంద్రగిరి మహారాజు సమక్షంలో జరిగే వాదన వంటి సన్నివేశాలు సినిమాకు ప్రత్యేకతను తీసుకొచ్చాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి ఉన్నవారికి ఈ సన్నివేశాలు నచ్చే అవకాశం ఉంది. అయితే, కథను మరింత ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ కొన్ని చోట్ల నెమ్మదైన కథనం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. సన్నివేశాల మధ్య వేగం, ఎడిటింగ్ మరింత పకడ్బందీగా ఉండి ఉంటే సినిమా ప్రభావం పెరిగేది. మొత్తంగా చూస్తే, సందేశానికి ప్రాధాన్యమిచ్చిన ఈ చిత్రం ఆధ్యాత్మిక సినిమాలను ఇష్టపడేవారికి ఒక మోస్తరు అనుభూతిని అందిస్తుంది.
ప్లస్ పాయింట్స్
– శ్రీరామానుజాచార్యుల జీవితంలోని ముఖ్య ఘట్టాలు
– భక్తి, సమానత్వాన్ని మేళవించిన సందేశం
– దశావతారాల చిత్రీకరణ
– గ్రాఫిక్స్‌తో రూపొందించిన కొన్ని సన్నివేశాలు
– ఆధ్యాత్మిక భావాన్ని పెంచే పాటలు, సంభాషణలు
మైనస్ పాయింట్స్
కొన్ని చోట్ల నెమ్మదిగా సాగే కథనం
– ఎడిటింగ్‌లో లోపాలు
– మరింత ఆసక్తికరంగా మలచవచ్చిన కొన్ని సన్నివేశాలు
ఫైనల్‌గా చెప్పాలంటే..
‘జయహో రామానుజ’ భక్తి, ఆధ్యాత్మికతతో పాటు సమానత్వం, మానవత్వం వంటి విలువలను ప్రేక్షకులకు అందించే ప్రయత్నం. లయన్ డా. సాయి వెంకట్ నటన, దశావతారాల ఘట్టాలు, గ్రాఫిక్స్, సందేశాత్మక పాటలు సినిమాకు ప్రధాన బలాలు. అయితే, కథనం వేగంగా సాగి, ఎడిటింగ్ మరింత మెరుగ్గా ఉండి ఉంటే చిత్రం ఇంకాస్త ఆకట్టుకునేది. శ్రీరామానుజాచార్యుల జీవిత విశేషాలను తెలుసుకోవాలనుకునేవారికి, ఆధ్యాత్మిక చిత్రాలను ఇష్టపడేవారికి ఈ సినిమా ఒకసారి చూడదగినది.