Heartfelt Melody from Srinivasa Mangapuram
జై కృష్ణ ఘట్టమనేని, రాషా తడానీ జంటగా దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘శ్రీనివాస మంగాపురం’. నిర్మాత అశ్వినీదత్ సమర్పణలో చందమామ కథలు బ్యానర్‌పై పి. కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకోగా, తాజాగా చిత్ర బృందం మరో హృదయాన్ని తాకే లవ్ మెలోడీని సోమవారం విడుదల చేసింది. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ స్వరపరిచిన ఈ మెలోడీకి నాగ్ అర్జున్ రెడ్డి భావోద్వేగభరితమైన సాహిత్యాన్ని అందించారు. గాయకుడు కపిల్ కపిలన్ తన మధురమైన గాత్రంతో పాటలోని ప్రేమ, విరహ వేదనను ఎంతో నేచురల్‌గా చూపించారు.
Heartfelt Melody from Srinivasa Mangapuram
“రావే ఇటు రావే నా చెలియా.. నా ప్రాణం నన్ను వీడి నీవైపే కదిలేనే.. రావే ఇటు రావే నా చెలియా.. ఏకాంతం చెరలోనే బందీనై ఉన్నానే.. కాలం అడ్డున్నా, ఏ గాయం కోస్తున్నా, నీకై వేచున్నా…” అంటూ సాగే ఈ పాట ప్రేమలోని ఆవేదన, ఎదురుచూపులు, విరహ బాధను హృదయానికి హత్తుకునేలా వ్యక్తపరుస్తోంది. పాటలో జై కృష్ణ ఘట్టమనేని, రాషా తడానీ మధ్య కెమిస్ట్రీ ఎంతో సహజంగా కనిపించగా, ప్రేమలో దూరమైన ఇద్దరి భావోద్వేగాలను అద్భుతంగా ఆవిష్కరించారు. అందమైన లోకేషన్లు, ఆకట్టుకునే విజువల్స్, అజయ్ భూపతి స్టైలిష్ ప్రెజెంటేషన్ ఈ మెలోడీకి మరింత బలం చేకూర్చాయి. దీంతో ఈ పాటకు సోషల్ మీడియాలో కూడా మంచి స్పందన లభిస్తోంది.
ఈ చిత్రంలో మోహన్ బాబు, నరేష్, బ్రహ్మాజీ, కిక్ శ్యామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రేమ, భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాల నేపథ్యంలో రూపొందుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం జూలై 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.