Havish ‘Konchem Konchem’ from Nenu Ready
యంగ్ హీరో హవీష్ హీరోగా, కమర్షియల్ ఎంటర్టైనర్స్కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘నేను రెడీ’. ఇప్పటికే టీజర్, ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుల్లో అంచనాలను పెంచారు. హార్నిక్స్ ఇండియా ఎల్ఎల్పీ బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ, నిఖిల కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కావ్యా థాపర్ హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ నర్గీస్ ఫక్రీ ప్రత్యేక ఆకర్షణగా కనిపించనుంది.
Havish ‘Konchem Konchem’ from Nenu Ready
ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ‘కొంచెం కొంచెం’ అంటూ సాగే ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. మెలోడీ స్పెషలిస్ట్ మిక్కీ జే మేయర్ కంపోజ్ చేసిన ఈ పాట పూర్తి స్థాయి రొమాంటిక్ మెలోడీగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం ప్రేమలోని అందమైన భావాలను సరదాగా ఆవిష్కరించగా, సమీరా భరద్వాజ్ తన మధురమైన గాత్రంతో పాటకు మరింత ప్రాణం పోశారు. పాటలో హవీష్, కావ్యా థాపర్ మధ్య కనిపించే కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక బాలీవుడ్ భామ నర్గీస్ ఫక్రీ స్టైలిష్ స్పెషల్ అప్పియరెన్స్, గ్లామరస్ డ్యాన్స్ మూవ్స్ ఈ సాంగ్‌కు అదనపు ఆకర్షణగా మారాయి. విజువల్స్, మెలోడీ, లిరిక్స్ అన్నీ కలిసివచ్చి ఈ పాటను ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి తీసుకెళ్లాయి.
ఈ సందర్భంగా నిర్వహించిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌కు దర్శకుడు బాబీ కొల్లి, నిర్మాత కేఎల్ నారాయణ ముఖ్య అతిథులుగా మూవీ టీమ్‌కు బెస్ట్ విషెస్ అందించారు. హీరో హవీష్ మాట్లాడుతూ ‘నాకు వ్యక్తిగతంగా కాస్త సిగ్గు ఎక్కువ. కానీ త్రినాథరావు గారు నాతో ఇలాంటి రొమాంటిక్ సాంగ్ చేయించారు. యాక్టింగ్‌లో నాకు అత్యంత కష్టమైనది రొమాన్స్ చేయడమే. ఆయన కథ చెప్పినప్పుడే చాలా ఎంటర్టైన్ అయ్యాను. ఆయన దర్శకత్వంలో సినిమా చేయాలనే కోరిక ఈ సినిమాతో నెరవేరింది. నటన అంటే నాకు ఎంతో ఇష్టం. ఈ సినిమా అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చింది. నా కెరీర్లో ఇది బెస్ట్ మూవీ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే పూర్తి స్థాయి ఎంటర్టైనర్ ఇది’ అని అన్నారు.
హీరోయిన్ కావ్యా థాపర్ మాట్లాడుతూ ‘ఈ సినిమా చేయడం చాలా మంచి అనుభవం. ప్రేక్షకులకు సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఇంకా ఎన్నో సర్ప్రైజ్లు ఉన్నాయి. పాటలు, సినిమా రెండూ ప్రేక్షకులను అలరిస్తాయని నమ్ముతున్నాను’ అని చెప్పింది.
దర్శకుడు త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నర్గీస్ ఫక్రీని తీసుకురావడంలో నిర్మాతలు వెంటనే సహకరించారు. ఇది పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇప్పటికే ఇండస్ట్రీలో పలువురికి సినిమా చూపించాం. మా సినిమాపై మాకు పూర్తి నమ్మకం ఉంది. హవీష్ ఈ చిత్రంలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’ అని చెప్పారు.
నిర్మాత కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ ‘ఈ కథను హవీష్ మొదటి సిట్టింగ్‌లోనే ఓకే చేశారు. ఏడాదిలోపే సినిమాను పూర్తి చేశాం. హవీష్‌కు నటనపై ఉన్న ప్రేమ, త్రినాథరావు గారి దర్శకత్వం ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెడతాయి. అత్యున్నత నిర్మాణ విలువలతో, కుటుంబం మొత్తం కలిసి చూసేలా ఈ చిత్రాన్ని రూపొందించాం’ అని అన్నారు.
మైత్రి డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ ‘సినిమా చూసిన తర్వాత పూర్తి నమ్మకం వచ్చింది. ప్రేక్షకులు త్రినాథరావు నక్కిన నుంచి ఆశించే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి. ప్రతి పాట బాగా వచ్చింది. ప్రతి పాత్రకు సరైన నటీనటులను ఎంపిక చేశారు. ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.