nara-rohith-kapali-first-look
వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న నారా రోహిత్ తాజాగా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘కపాలి’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. రామ్ గన్ని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చాలా కాలం తర్వాత హన్సిక మోత్వానీ హీరోయిన్గా నటిస్తోంది. సప్త అశ్వ మీడియా వర్క్స్ బ్యానర్‌పై విజయ్ కృష్ణ లింగమనేని సమర్పణలో కళ్యాణ్ చక్రవర్తి మంథినా, భాను కిరణ్ ప్రతాప్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
nara-rohith-kapali-first-look
శనివారం నారా రోహిత్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలు పెంచుతోంది. పోస్టర్లో కనిపించని ఓ అతీంద్రియ శక్తితో తీవ్ర భావోద్వేగాల మధ్య పోరాడుతున్న వ్యక్తిగా నారా రోహిత్ కనిపిస్తున్నాడు. గుబురు గడ్డం, భయానకమైన చూపులు, తీవ్రమైన హావభావాలు ఆయన పాత్రలోని ఇంటెన్సిటీని బలంగా ప్రతిబింబిస్తున్నాయి. పోస్టర్లో ఆయన తలపై కిరీటంలా విస్తరించిన వంకర చెట్టు కొమ్మలు, బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించే ప్రాచీన చిహ్నాలు ఈ సినిమా మిస్టరీ, క్షుద్రశక్తులు, పురాణ అంశాల కలయికతో రూపొందుతోందనే సంకేతాలను ఇస్తున్నాయి. పోస్టర్ ముందుభాగంలో ఎర్రటి కళ్లతో భయానకంగా కనిపించే మహిళా రూపం ఓ అతీంద్రియ శక్తిని సూచిస్తుండగా, ఆమె పక్కనే తుపాకులతో సిద్ధంగా ఉన్న పోలీసులు, ఇతర పోలీసు అధికారులు కనిపిస్తున్నారు.
అంతేకాదు, ఓ పోలీసు వాహనం ప్రకాశవంతమైన యాగ వలయంపై నిలిచి ఉండటం ఈ కథలో పోలీసు వ్యవస్థ కూడా ఓ భయానక పారానార్మల్ మిస్టరీలో చిక్కుకోబోతుందనే ఆసక్తికరమైన హింట్‌ను ఇస్తోంది. మొత్తంగా చూస్తే, ‘కపాలి’ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచడమే కాకుండా, నారా రోహిత్ కెరీర్లో మరో విభిన్నమైన సైకలాజికల్ థ్రిల్లర్‌గా నిలవబోతుందనే అంచనాలను మరింత బలపరిచింది.