Gopichand New Movie Title SINGA
యాక్షన్ హీరో గోపీచంద్ మరోసారి మాస్ ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ప్రత్యేక కానుకగా ఆయన కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రానికి ‘సింగ’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేసినట్లు ప్రకటించింది. విడుదలైన టైటిల్ గ్లింప్స్ ఆరంభం నుంచే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పక్షుల కిలకిలారావాలు, దట్టమైన అడవి వాతావరణం, ట్రైబల్ నేపథ్య సంగీతం కథలోని రహస్యాన్ని సూచిస్తూ ఆసక్తిని పెంచుతున్నాయి. చీకటిలో మెరుస్తున్న రెండు కళ్లను చూసి మొదట అడవిలో సంచరించే పాంథర్ అనిపించినా, వెంటనే గోపీచంద్‌ను రివీల్ చేస్తూ మేకర్స్ సర్ప్రైజ్ ఇచ్చారు. కళ్లలో ఆగ్రహం, చేతిలో గొడ్డలి, ప్రతీకారంతో రగిలిపోతున్న యోధుడిలా కనిపించిన గోపీచంద్ తన పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో అభిమానులను మెప్పించాడు. గడ్డం, మెలితిప్పిన మీసం, చెవిపోగు, రక్తం-చెమటతో నిండిన రగ్డ్ లుక్‌లో ఆయన కనిపించిన తీరు సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.
Gopichand New Movie Title SINGA
ఈ చిత్రంతో ప్రముఖ ఫైట్ మాస్టర్ వి. వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మలయాళ నటి అనార్కలి నజర్ హీరోయిన్గా నటిస్తుండగా, సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు.
ఇదిలా ఉండగా, గోపీచంద్ ప్రస్తుతం మరో ప్రతిష్టాత్మక చిత్రం ‘భరతవర్ష’లో కూడా నటిస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్‌తో ఆ చిత్ర బృందం కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసింది. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రీ.శ. 642 నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. గోపీచంద్ కెరీర్లో ఈ రెండు చిత్రాలు స్పెషల్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.