Dulquer Pooja Hegde ‘Sri Sri’ First Look
మలయాళ స్టార్ అయినా తెలుగులోనూ వెర్సటైల్ యాక్టర్‌గా గుర్తింపును తెచ్చుకున్నాడు దుల్కల్ సల్మాన్. ప్రస్తుతం వరుస తెలుగు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు దుల్కర్. తాజాగా తను నటిస్తున్న కొత్త సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేశారు. రవి నెలకుదిటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇషాన్ సక్సేనా కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి ‘శ్రీ శ్రీ’ అనే అందమైన, అచ్చ తెలుగు టైటిల్‌ను ఫిక్స్ చేశారు. దీనికి ‘ప్రేమ మరోసారి కొత్తగా పుడుతుంది’ అని క్యాప్షన్ ఇవ్వడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ప్రేమ, వినోదం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల సమ్మేళనంగా రూపొందుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే తొలిసారిగా జోడీ కట్టడం విశేషం. ఇప్పటికే విడుదలైన వర్కింగ్ స్టిల్స్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించగా, తాజాగా చిత్రబృందం సినిమా టైటిల్‌తో పాటు ఆకట్టుకునే ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది.
Dulquer Pooja Hegde ‘Sri Sri’ First Look
ఈ పోస్టర్లో దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే ఇద్దరూ ఓ కాంపౌండ్ గోడపై కూర్చుని సరదాగా ముచ్చటిస్తున్న దృశ్యం ఎంతో సహజంగా, నేచురల్‌గా కనిపిస్తోంది. పాస్టెల్ బ్లూ షర్ట్, గ్రే ట్రౌజర్, కళ్లద్దాలతో సింపుల్ లుక్‌లో కనిపించిన దుల్కర్ తన చిరునవ్వుతో ఆకట్టుకుంటే, లైట్ బ్లూ సల్వార్ సూట్లో పూజా హెగ్డే అతని వైపు ప్రేమగా చూస్తూ చిరునవ్వులు చిందిస్తోంది. ఇద్దరి మధ్య కనిపిస్తున్న సహజమైన కెమిస్ట్రీ పోస్టర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. వారి దుస్తులు, హావభావాలను బట్టి ఇద్దరూ కాలేజ్ క్లాస్మేట్స్గా కనిపిస్తుండగా, పోస్టర్‌లోని మినిమలిస్టిక్ బ్యాక్‌డ్రాప్ అమాయకత్వం, నాస్టాల్జియా, మధురమైన జ్ఞాపకాలను గుర్తుచేస్తోంది. వారి రిలాక్స్డ్ బాడీ లాంగ్వేజ్ స్నేహం, అనుబంధం, మాటల్లో చెప్పలేని ప్రేమను అందంగా ప్రతిబింబిస్తోంది. మొత్తంగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్‌ను నింపుతూ, హృదయాన్ని హత్తుకునే మరో అందమైన ప్రేమకథను చూసే ఆసక్తిని మరింత పెంచుతోంది.
ఈ చిత్రానికి అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. సినిమాటోగ్రఫీని అనయ్ ఓం గోస్వామి అందిస్తుండగా, సంగీతాన్ని జీవీ. ప్రకాష్ కుమార్ సమకూరుస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా పనిచేస్తున్నారు. ఈ ప్రతిభావంతులైన టెక్నికల్ టీమ్ కలిసి సినిమాను విజువల్‌గా గ్రాండ్‌గా, భావోద్వేగపరంగా మరింత హృద్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో భారీగా విడుదల చేయనున్నారు.