Vijay Kamisetty Debuts with Roshan Kanakala
తెలుగు సినీ ప్రేక్షకులను మరోసారి సరికొత్త ఫాంటసీ ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు ఓ ప్రతిష్టాత్మక సై-ఫై ఎంటర్టైనర్ సిద్ధమవుతోంది. వినూత్న కథలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వీఐ ఆనంద్ అందించిన కథ ఆధారంగా తెరకెక్కనున్న ఈ భారీ కాన్సెప్ట్ చిత్రం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది.
రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న ఈ చిత్రంతో ఎన్నో విజయవంతమైన సినిమాలకు బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసిన విజయ్ కామిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విజయ్ కామిశెట్టి గతంలో వీఐ ఆనంద్ వద్ద చీఫ్ అసోసియేట్ డైరెక్టర్, డైలాగ్ రైటర్‌గా పనిచేశారు. ‘టైగర్’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’, ‘డిస్కో రాజా’, ప్రస్తుతం రూపొందుతున్న ‘స్వయంభు’ వంటి చిత్రాల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన, ఈ సినిమాతో దర్శకుడిగానే కాకుండా స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తుండటం విశేషం. గహజి హీరోయిన్గా కనిపించనుంది. సత్య, సుదర్శన్, రవితేజ నన్నిమల ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Vijay Kamisetty Debuts with Roshan Kanakala
గుత్తా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ సహకారం అందిస్తోంది. ఫాంటసీ, ప్రేమ, కామెడీ, మిస్టరీ, అత్యాధునిక సైన్స్ ఫిక్షన్ అంశాలను సమ్మిళితం చేస్తూ రూపొందుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు పూర్తి స్థాయి థియేట్రికల్ అనుభూతిని అందించనుందని చిత్రబృందం చెబుతోంది. కథలోని ప్రతి మలుపు, విజువల్ ట్రీట్, భావోద్వేగాలు ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయని నిర్మాతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్‌లోని కాకతీయ హిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సంప్రదాయ పూజా కార్యక్రమాల మధ్య సినిమా ప్రారంభమైంది. హీరో నిఖిల్ ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కెకె సెంథిల్ కుమార్ కెమెరాను స్విచ్ ఆన్ చేశారు. కథ అందించిన వీఐ ఆనంద్ చిత్రబృందానికి స్క్రిప్ట్‌ను అందజేయడమే కాకుండా, తొలి షాట్‌కు దర్శకత్వం వహిస్తూ యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తుండగా, అన్వేష్ వరాల సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్‌గా, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. సహ నిర్మాతగా తరుణ్ రెడ్డి , క్రియేటివ్ ప్రొడ్యూసర్లుగా వీఐ ఆనంద్, అనూష వేలుస్వామి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా భాస్కర్ బండి, శైలేంద్ర కుమార్ పనిచేస్తున్నారు.
Vijay Kamisetty Debuts with Roshan Kanakala
ప్రస్తుతం ప్రీ- ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతుండగా, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే టైటిల్, ఫస్ట్ లుక్‌తో పాటు పలు ఆసక్తికరమైన అప్డేట్స్ను త్వరలో ప్రకటించనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.

ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకకు దర్శకుడు విజయ్ కామిశెట్టి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు, సినీ మిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరై చిత్ర యూనిట్‌కు తమ శుభాకాంక్షలు తెలియజేశారు.
దర్శకుడిగా విజయ్ కామిశెట్టి కొత్త ప్రయాణం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ, కెరీర్లో మరింత ముందుకు వెళ్లాలని.. ఈ హై- కాన్సెప్ట్ సై-ఫై ఎంటర్టైనర్ ఘన విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. ఆత్మీయ వాతావరణంలో జరిగిన ఈ ప్రారంభోత్సవం చిత్ర బృందంలో మరింత ఉత్సాహాన్ని నింపింది.
