వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్‌పై ఇటీవల సోషల్ మీడియాలో పలు రూమర్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలన్నింటికీ చిత్రబృందం తాజాగా ఫుల్ క్లారిటీ ఇచ్చింది. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీ స్టూడియోస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ -ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇక రిలీజ్ విషయంలో వస్తున్న ఊహాగానాలపై మేకర్స్ గట్టిగా స్పందించారు. వెంకటేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో నటిస్తున్నారని, అది సంక్రాంతికి విడుదల కానుండటంతో అనిల్ రావిపూడి సినిమా సమ్మర్‌కు వాయిదా పడుతుందని వచ్చిన వార్తలను పూర్తిగా ఖండించారు. అలాంటి బేస్‌లెస్ రూమర్స్‌ను నమ్మవద్దని స్పష్టం చేశారు. ఈ చిత్రం 2027 సంక్రాంతి బరిలోకి దిగడం ఖాయమని మరోసారి అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే పూజా కార్యక్రమాలతో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని వెల్లడించారు.
ఇక అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్‌లో ఇప్పటికే ఎఫ్2, ఎఫ్3, సంక్రాంతి వస్తున్నాం లాంటి హిట్స్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఈ కొత్త చిత్రం వీరిద్దరి కాంబినేషన్‌లో ఐదో సినిమా కావడం ప్రత్యేకం. అలాగే దర్శకుడిగా తన కెరీర్‌కు ‘పటాస్’తో శ్రీకారం చుట్టిన కళ్యాణ్ రామ్‌తో అనిల్ రావిపూడి చేస్తున్న రెండో సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగాయి.
మొత్తానికి రూమర్స్‌కి ఫుల్ స్టాప్ పడగా వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ సంక్రాంతి 2027లో భారీ ఎంటర్‌టైనర్‌గా రానుందన్నది ఇప్పుడు క్లియర్ అయ్యింది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ను ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు ప్రకటించాల్సి ఉంది.





