Chiranjeevi Takes on AI Misuse
ఏఐ, డీప్‌ఫేక్ టెక్నాలజీల దుర్వినియోగంపై మెగాస్టార్ చిరంజీవి గళమెత్తారు. ముఖ్యంగా సినీ కళాకారులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన, మార్ఫింగ్ చేసిన వీడియోలను సృష్టిస్తున్న ఘటనలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆయన.. ఈ సమస్యకు పరిష్కారం దిశగా కీలక ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయి, ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో రామ్ చరణ్ కూడా పాల్గొన్నారు.
Chiranjeevi Takes on AI Misuse
ఇటీవల సోషల్ మీడియా వేదికగా డీప్‌ఫేక్ వీడియోలపై తన ఆవేదనను వ్యక్తం చేసిన చిరంజీవి.. ఈ సమస్యను సంబంధిత ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే అమిత్ షాను కలిసి, ఏఐ సాంకేతికతను దుర్వినియోగం చేయడం వల్ల కళాకారుల వ్యక్తిగత గౌరవం, హక్కులు, సృజనాత్మకతకు ఎదురవుతున్న ముప్పును వివరించారు.
సాంకేతికత అభివృద్ధి సానుకూల ప్రయోజనాలను అందించాల్సింది పోయి.. కొందరు దానిని అసభ్యకరమైన కంటెంట్‌ను సృష్టించడానికి, వ్యక్తుల ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ఉపయోగిస్తుండటం ఆందోళనకరమని చిరంజీవి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇటువంటి ఘటనలను కేవలం సోషల్ మీడియా సమస్యగా చూడకుండా, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టపరమైన రక్షణను మరింత బలోపేతం చేయాలని కోరారు.
చిరంజీవి లేవనెత్తిన అంశాలపై అమిత్ షా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ సమస్యను ప్రభుత్వం అత్యవసరంగా పరిశీలించి, అవసరమైన రక్షణ చర్యలు, కఠినమైన శిక్షల అమలుకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తుందని హామీ ఇచ్చారు. ఈ విషయంపై పూర్తి వివరాలతో లిఖితపూర్వక వినతిపత్రం సమర్పించాలని సూచించడంతో పాటు, ఈ వ్యవహారాన్ని సమన్వయం చేసే బాధ్యతను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి అప్పగించారు.
కేంద్ర హోంమంత్రి స్పందనపై చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. కళాకారుల గౌరవాన్ని కాపాడటంతో పాటు, ఏఐ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసే దిశగా ఈ భేటీ కీలక ముందడుగు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.