ఆస్కార్ రూల్ మారింది: భారతీయ సినిమాలకు గోల్డెన్ ఛాన్స్
దేశాల కంటే దర్శకులకు ప్రాధాన్యం..
ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అకాడమీ అవార్డ్స్ Academy Awards మరోసారి తన నిబంధనలను సరికొత్త దిశలో మార్చుకుంది. 2027లో జరిగే 99వ అవార్డుల నేపథ్యంలో విడుదలైన తాజా గైడ్‌లైన్స్ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. ఈ మార్పులు కేవలం టెక్నికల్ రూల్స్ మాత్రమే కాకుండా, గ్లోబల్ సినిమా నిర్మాణ విధానాన్ని ప్రభావితం చేసేలా ఉండటం విశేషం.
ఇప్పటి వరకు “బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్” అవార్డు గెలిస్తే అది ఆ దేశానికి దక్కిన గౌరవంగా భావించేవారు. కానీ కొత్త మార్పులతో ఈ క్రెడిట్ పూర్తిగా దర్శకుడికి మళ్లింది. ఇకపై అవార్డు స్టాచ్యుపై సినిమా పేరుతో పాటు దర్శకుడి పేరు అధికారికంగా నమోదు అవుతుంది. దీని వల్ల వ్యక్తిగత క్రియేటివిటీకి మరింత విలువ పెరగనుంది.
ఇది భారతీయ సినిమాకు పెద్ద గుడ్ న్యూస్‌గా చెప్పొచ్చు. గతంలో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా Film Federation of India ద్వారా ఒక్క సినిమా మాత్రమే అధికారికంగా పంపే అవకాశం ఉండేది. ఇప్పుడు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో అవార్డులు గెలుచుకున్న చిత్రాలు నేరుగా ఆస్కార్ రేసులోకి రావచ్చు. అంటే ఒకే ఏడాది ఇండియా నుంచి అనేక సినిమాలు పోటీ పడే అవకాశం ఏర్పడింది. ఇది ప్రాంతీయ చిత్రాలకు భారీ అవకాశంగా మారనుంది.
నటీనటులకు అరుదైన అవకాశం :
ఇప్పటి వరకు ఒక నటుడు ఒకే విభాగంలో ఒకేసారి రెండు సినిమాలకు నామినేట్ అయ్యే అవకాశం లేదు. కానీ కొత్త రూల్స్ ప్రకారం ఒకే ఏడాది రెండు గొప్ప ప్రదర్శనలు ఇస్తే, రెండింటికీ నామినేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇది యాక్టర్ల కెరీర్‌కు గేమ్‌చేంజర్‌గా మారొచ్చు.
ఏఐపై కఠిన వైఖరి :
సినిమాల్లో ఏఐ Artificial Intelligence వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో అకాడమీ స్పష్టమైన మరో కొత్త రూల్ తీసుకొచ్చింది. ఆస్కార్ కోసం పరిగణించబడే చిత్రాలు “మనుషుల సృజనాత్మకతతో తయారైనవే కావాలి” అని నిబంధన విధించింది. ఏఐతో రూపొందించిన పాత్రలు లేదా స్క్రీన్‌ప్లేలకు గుర్తింపు ఉండదని ప్రకటించడం ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది.
టెక్నికల్ విభాగాల్లో మార్పులు
కొత్త గైడ్‌లైన్స్‌లో కొన్ని టెక్నికల్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. కాస్టింగ్ విభాగంలో అవార్డు స్టాచ్యుల సంఖ్య పెంచడం, సినిమాటోగ్రఫీ విభాగంలో షార్ట్‌లిస్ట్ విస్తరణ వంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఇవి బ్యాక్ఎండ్ టాలెంట్‌కు మరింత గుర్తింపు తీసుకురానున్నాయి.
భారతీయ సినిమాకు ఇదే సరైన సమయం
ఈ మార్పులు చూస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది. ప్రపంచ సినిమా ఇప్పుడు దేశాల ఆధిపత్యం నుంచి బయటపడుతూ, కంటెంట్ ఆధారిత పోటీ వైపు అడుగులు వేస్తోంది. ఈ పరిస్థితుల్లో భాష, ప్రాంతం అనే అడ్డంకులు లేకుండా భారతీయ చిత్రాలు గ్లోబల్ స్థాయిలో మరింత ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫైనల్‌గా ఆస్కార్ తీసుకొచ్చిన ఈ పెను మార్పులతో .. ఇప్పుడు గెలిచేది దేశం కాదు, గొప్ప కథ చెప్పిన దర్శకుడే అని చెప్పుకోవచ్చు.




