గెటప్ శ్రీను, జాఫర్ మధ్య ఇటీవల క్యాస్ట్ విషయంలో జరిగిన గొడవ సోషల్ మీడియాలో వైరల్ అయ్యిన సంగతి తెలిసిందే. “కులం పేరుతో సినిమాలు ఎందుకు?” అంటూ జాఫర్ ప్రశ్నించిన డైలాగ్ పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. అయితే పూర్తి వీడియో విడుదలయ్యాక అసలు విషయం బయటపడింది. ఇదొక సిరీస్ టైటిల్ అని, దీనికి ‘‘మేము ‘కాప్’లం’’ అనే టైటిల్‌ను రివీల్ చేశారు. ఈ టైటిల్‌లో “కాప్” అనేది పోలీస్ కాన్సెప్ట్‌ను సూచిస్తుందని, కులానికి సంబంధం లేదని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. గ్రామీణ నేపథ్యంలో కామెడీ, మిస్టరీ మేళవింపుతో రూపొందుతున్న ఈ సిరీస్ కథ సంక్రాంతి పండుగ సమయంలో జరిగే సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఓ చిన్న ఘటన గ్రామంలో పెద్ద గందరగోళానికి దారి తీస్తుంది. ఆ కేసును ఛేదించడానికి వచ్చిన ఇద్దరు పోలీసుల కథలో హాస్యంతో పాటు సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా ఇందులో ఉంటాయి.
ఈ సిరీస్‌లో నాగబాబు కొణిదెల Nagababu Konidela ప్రధాన పాత్రలో నటిస్తుండగా, గెటప్ శ్రీను, రవితేజ నన్నిమాల కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వీరి కామెడీ టైమింగ్, పాత్రల మధ్య ఉండే కన్ఫ్యూజన్ కథను మరింత ఎంటర్‌టైనింగ్‌గా మార్చనుంది. ‘వికటకవి’ ఫేమ్ దర్శకుడు ప్రదీప్ మద్దాలి ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. బి.వి.ఎస్. రవి, కౌముది కె నేమాని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. స్థానిక వాతావరణం, గ్రామీణ జీవితం, రాజకీయాల మేళవింపుతో ఈ సిరీస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. టైటిల్ చుట్టూ మొదలైన చర్చతో “మేము COPలం” సిరీస్‌కు మంచి బజ్ ఏర్పడింది. త్వరలోనే ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. స్ట్రీమింగ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రేక్షకులు కూడా ఈ కొత్త కాన్సెప్ట్‌ను ఎలా ఆవిష్కరించారో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.




