Producer DheerajMogilineni Interview About – Summer Holidays
కథలోని భావోద్వేగాలకు ప్రాధాన్యమిస్తూ ప్రేక్షకులకు విభిన్నమైన చిత్రాలను అందిస్తున్న నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని మరో ఆసక్తికరమైన ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఆయన నిర్మిస్తున్న మూవీ ‘సమ్మర్ హాలిడేస్’. చిన్ననాటి జ్ఞాపకాలు, కుటుంబ బంధాలు, పిల్లల మధ్య ఉండే స్వచ్ఛమైన స్నేహం, అమాయకత్వం నేపథ్యంలో దర్శకుడు శ్రీకర్ ఈ చిత్రాన్ని రూపొందించారు. మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబీ ఖుషి కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్ 6న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఇంటర్వ్యూలో నిర్మాత ధీరజ్ మొగిలినేని సినిమా విశేషాలను పంచుకున్నారు.
Producer DheerajMogilineni Interview About – Summer Holidays
నా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసిన కథ ఇది
‘సమ్మర్ హాలిడేస్’ కథ విన్నప్పుడు నా మనసుకు ఎంతో దగ్గరైన అనుభూతి కలిగింది. నా రియల్ లైఫ్‌లో జరిగిన ఎన్నో విషయాలు, చిన్నప్పుడు గడిపిన రోజులు గుర్తొచ్చాయి. సినిమాలో అమ్మమ్మ పాత్రలో జయసుధ గారు చెప్పే మాటలు మా అమ్మమ్మ మాట్లాడినట్లే అనిపించాయి. వాసుకి గారు చెప్పే డైలాగ్స్ వింటుంటే మా అమ్మ నాతో మాట్లాడుతున్న ఫీలింగ్ కలిగింది. ఈ కథలోని భావోద్వేగాలు నన్ను అంతలా కనెక్ట్ చేశాయి. వేసవి సెలవుల కోసం అమ్మమ్మ ఊరికి వెళ్లిన పిల్లలు రెండు నెలల తర్వాత తిరిగి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఎదురయ్యే భావోద్వేగాలు, అక్కడి స్నేహితులతో ఏర్పడే అనుబంధం, అరుణ్–రోహన్ పాత్రల మధ్య బాండింగ్, తండ్రీకొడుకుల మధ్య సాగే ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలను తాకుతాయి. ఈ చిత్రంతో నిర్మాతగా అవార్డులు సాధించాలనే ఆలోచన లేదు. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమాను చూసి ఆదరించి విజయవంతం చేయాలన్నదే నా కోరిక.
మళ్లీ చిల్డ్రన్స్ సినిమాల ట్రెండ్ రావాలి
సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి ప్రయత్నం విజయవంతమైతే, దాని ప్రభావంతో మరిన్ని కొత్త తరహా చిత్రాలు వస్తుంటాయి. ఒకప్పుడు ‘పెళ్లిచూపులు’ వంటి సినిమాల తర్వాత రొమాంటిక్ కామెడీల ట్రెండ్ తగ్గిపోయిందని అనుకున్నారు. ఆ తర్వాత ‘ప్రేమలు’ వంటి సినిమాలు తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. ‘లిటిల్ హార్ట్స్’ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే ‘సమ్మర్ హాలిడేస్’ విజయం సాధిస్తే, ఇండస్ట్రీలో మళ్లీ పిల్లల సినిమాలు నిర్మించేందుకు నిర్మాతలు ముందుకొస్తారని ఆశిస్తున్నాను. ఈ సినిమా ఇతర నిర్మాతలకు కూడా స్ఫూర్తిగా నిలవాలి. భవిష్యత్తులో పెద్ద సినిమాలు నిర్మించినా, పదేళ్ల తర్వాత నా ప్రొడక్షన్లో ‘సమ్మర్ హాలిడేస్’ అనే ప్రత్యేకమైన సినిమా వచ్చిందని గుర్తుచేసుకుంటాను. అంతటి ప్రత్యేకత ఈ చిత్రానికి ఉంది.
మంచి థియేటర్లు దొరికాయి.. ప్రేక్షకుల ఆదరణే ముఖ్యం
నేను నమ్మిన కథను బలంగా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలన్నదే నా ప్రయత్నం. మొదట ఈ సినిమాను వేసవి సెలవుల సమయంలో విడుదల చేయాలని అనుకున్నాం. అది సాధ్యం కాకపోవడంతో ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. దీపావళి పండుగ సీజన్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మంచి అవకాశంగా భావిస్తున్నాం. అక్టోబర్ 30న విడుదల కావాల్సిన కొన్ని సినిమాలు నవంబర్ 6కు వాయిదా పడతాయేమోనని ఆందోళన చెందాం. అయితే ప్రస్తుతానికి మా సినిమాకు దాదాపు సోలో రిలీజ్ దక్కినట్టుగా భావిస్తున్నాం. నవంబర్ 6న మా సినిమాకు మంచి థియేటర్లు లభిస్తున్నాయి. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తే మరిన్ని థియేటర్లు పెరుగుతాయని ఆశిస్తున్నాం.
చిన్న సినిమాలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అవసరం
ప్రత్యేకమైన కథలతో సినిమాలు చేసే కొత్త నిర్మాతలకు, చిన్న చిత్రాలను రూపొందించే వారికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభిస్తే బాగుంటుంది. ముఖ్యంగా స్థానికంగా తెరకెక్కించే చిత్రాలకు కొన్ని రాయితీలు కల్పిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుంది. ప్రస్తుతం థియేటర్ల నుంచి వచ్చే ఆదాయం తగ్గుతోంది. మరోవైపు ఓటీటీ సంస్థలు కూడా ఎక్కువగా పెద్ద సినిమాలపైనే దృష్టి పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న సినిమాలకు ప్రభుత్వ సహకారం ఎంతో ఉపయోగపడుతుంది.
తదుపరి సినిమాలు ఇవే..
ప్రస్తుతం మా సంస్థలో సంగీత్ శోభన్, అనస్వర నటిస్తున్న ‘అంతా రాములోరు చూస్కుంటారు’ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయింది. తొలుత డిసెంబర్లో విడుదల చేయాలనుకున్నాం. అయితే ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఫిబ్రవరికి వాయిదా వేశాం. దీంతోపాటు ‘35’ చిత్ర దర్శకుడు నందకిషోర్‌తో ఒక సినిమా, ‘కిష్కింధపురి’ దర్శకుడు కౌశిక్‌తో మరో సినిమా చేయబోతున్నాం. సంక్రాంతి తర్వాత ఈ రెండు చిత్రాలను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.