Mayookha Movie Director Shree Tej SK Interview
థ్రిల్లర్ సినిమాలకు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా ఓటీటీ కాలంలో వరల్డ్ క్లాస్ థ్రిల్లర్స్‌ను చూస్తున్న ఆడియెన్స్‌కు కొత్త అనుభూతిని అందించడం అంత ఈజీ కాదు. అలాంటి ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో రూపొందిన సినిమా ‘మయూఖ’. పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి శ్రీ తేజ్ ఎస్.కె. దర్శకత్వం వహించారు. ప్రశ్విత ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై శశిధర్ నల్ల నిర్మించారు. అక్టోబర్ 9న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీ తేజ్ ఎస్.కె. సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
Mayookha Movie Director Shree Tej SK Interview
‘మయూఖ’కు ఇటీవల న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ మిస్టరీ మూవీ అవార్డ్ రావడం ఆనందంగా ఉందని శ్రీ తేజ్ తెలిపారు. థ్రిల్లర్ కేటగిరీలో కూడా ఈ చిత్రం సెకండ్ బెస్ట్‌గా నిలిచిందన్నారు. ఈ అవార్డ్‌ను తాము ఊహించలేదని, తమ సినిమా సెలెక్ట్ అయిందని తెలిసినప్పుడే టీమ్ మొత్తం ఎంతో సంతోషించిందని చెప్పారు. కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు కూడా సినిమాను అప్లై చేసినట్లు వెల్లడించారు. సినిమా ప్రమోషనల్ కంటెంట్‌లోనే కొరియన్, హాలీవుడ్ తరహా స్టోరీ టెల్లింగ్, కలర్ గ్రేడింగ్ కనిపిస్తుందని, కథ కూడా ప్రేక్షకులకు కొద్దికొద్దిగా రివీల్ అవుతూ సెకండాఫ్‌లో పీక్స్‌కు వెళ్తుందని అన్నారు.
‘మయూఖ’ హారర్ సినిమా కాదని, కంప్లీట్ థ్రిల్లర్ అని శ్రీ తేజ్ స్పష్టం చేశారు. స్మశానంలో దెయ్యాలు ఉన్నాయంటే ముందే మనం భయపడటానికి సిద్ధమవుతామని, కానీ మనం ప్రతిరోజూ ఉండే ఇంట్లోకి ఓ అపరిచిత వ్యక్తి వస్తే కలిగే భయం మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. హీరోయిన్ ఉండే ఫ్లాట్‌లోకి ఆ అపరిచిత వ్యక్తి ఎందుకు వచ్చాడు? అతను ఏం చేశాడు? హీరోయిన్‌తో అతనికి ఉన్న సంబంధం ఏంటి? అనే ప్రశ్నల చుట్టూ కథ ఆసక్తికరంగా సాగుతుందని తెలిపారు. దాదాపు 2 గంటల 10 నిమిషాల నిడివితో సినిమా ఉంటుందని చెప్పారు.
ఈ కథను మొదట ‘గులాబీ’ ఫేమ్ మహేశ్వరికి వినిపించామని శ్రీ తేజ్ తెలిపారు. అయితే ఆ సమయంలో తాము చెప్పిన మరో కథను ఆమె ఎంచుకున్నారని చెప్పారు. ‘మయూఖ’లోని పాత్రకు పాయల్ చెంగప్ప అయితే బాగా సరిపోతారని భావించి ఆమెను ఎంపిక చేశామని వెల్లడించారు. కన్నడలో పలు ఎంటర్టైనింగ్ సినిమాలు చేసిన పాయల్‌కు, వెబ్ సిరీస్‌ల ద్వారా తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి రీచ్ ఉందని చెప్పారు. ఈ సినిమాలో ఆమె పాత్రలోని స్ట్రగుల్స్‌ను ప్రేక్షకులు రిలేట్ చేసుకుంటారని, పాయల్ చెంగప్ప అద్భుతంగా నటించారని ప్రశంసించారు.
‘మయూఖ’ అంటే ఆశాకిరణం అని అర్థమని, సినిమా చివరి వరకు చూసిన తర్వాత టైటిల్‌కు పూర్తి జస్టిఫికేషన్ లభిస్తుందని శ్రీ తేజ్ చెప్పారు. తాను రూపొందించిన చివరి షార్ట్ ఫిలిం పేరు కూడా ‘మయూఖ’నేనని తెలిపారు. ఆ షార్ట్ ఫిలింను పూర్తి చేయకముందే తాను అమెరికా వెళ్లానని, అదే సమయంలో రాజమౌళి గారు ఓ పాపను దత్తత తీసుకుని ఆమెకు ‘మయూఖ’ అని పేరు పెట్టారని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ప్రొఫెషనల్ కెరీర్లో కొనసాగుతున్న సమయంలో ‘మయూఖ’ కథను నిర్మాత శశిధర్ నల్లకు చెప్పగా, కథ నచ్చడంతో సినిమాగా చేయడానికి ముందుకు వచ్చారని చెప్పారు.
మంచి కథను రాయడం మాత్రమే కాకుండా దాన్ని విజువల్‌గా, ఆడియో పరంగా కూడా ఆకట్టుకునేలా తెరకెక్కించినప్పుడే సినిమా ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుందని శ్రీ తేజ్ అన్నారు. అందుకే ‘మయూఖ’ మేకింగ్‌లో విజువల్స్, సౌండ్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని చెప్పారు. శిబి మాత్యూ అలెక్స్ సినిమాకు మంచి సంగీతాన్ని అందించారని తెలిపారు. ప్రస్తుతం ప్రేక్షకులు కొరియన్, హాలీవుడ్ థ్రిల్లర్స్‌ను కూడా చూస్తున్నారని, అలాంటి క్వాలిటీ కంటెంట్ మన దగ్గర ఎందుకు రాదు అని చాలామంది అనుకుంటున్నారని శ్రీ తేజ్ అన్నారు. తాము కూడా అలాంటి కొత్త అనుభూతిని ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో ‘మయూఖ’ రూపొందించామని చెప్పారు. సినిమాలో ఎమోషన్ కంటే ప్రేక్షకులకు ఎక్కువగా ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నామని, నిర్మాత శశిధర్ నల్ల నుంచి పూర్తి సహకారం లభించిందని తెలిపారు.
దాదాపు 20 ఏళ్ల క్రితమే షార్ట్ ఫిలింస్ రూపొందించానని, ఆ తర్వాత అమెరికా వెళ్లి న్యూయార్క్ ఫిలిం అకాడెమీలో డైరెక్షన్ కోర్స్ చేసినట్లు శ్రీ తేజ్ వెల్లడించారు. దర్శకత్వం ఎప్పుడూ తన ప్రాధాన్యతగానే ఉందని, సినిమా మేకింగ్‌పై పూర్తి అవగాహన కోసం ప్రొడక్షన్లోనూ అనుభవం సంపాదించుకున్నానని చెప్పారు. ‘తంత్రం’, ‘సూత్రవాక్యం’ వంటి సినిమాలను తెలుగులో రిలీజ్ చేశామని, సినిమా బండి ప్రొడక్షన్స్ బ్యానర్లో ఇప్పటివరకు రెండు సినిమాలు చేశామని తెలిపారు. మంచి కథలు దొరికితే కొత్త టాలెంట్‌ను ఎప్పుడూ ప్రోత్సహిస్తామని చెప్పారు.
ఉపేంద్ర, రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాథ్, జొనాథన్ నోలన్ వంటి దర్శకులంటే తనకు ఇష్టమని వెల్లడించిన శ్రీ తేజ్.. తన తదుపరి దర్శకత్వంలో ఓ ఎమోషనల్ సైన్స్ ఫిక్షన్ మూవీ చేయబోతున్నట్లు తెలిపారు. ఆ సినిమా క్లీన్ యు సర్టిఫికెట్ పొందేలా ఉంటుందని చెప్పారు.