Yami Gautam ‘Nayyi Navelli’ Set for Dussehra Release
ఈ దసరా పండుగను కుటుంబ సమేతంగా నవ్వులు, వినోదం, ఫాంటసీతో ఆస్వాదించేందుకు ఓ సరికొత్త ఫ్యామిలీ ఎంటర్టైనర్ సిద్ధమవుతోంది. అమెజాన్ MGM స్టూడియోస్, కలర్ ఎల్లో సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘నయ్యి నవెల్లి’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. యామీ గౌతమ్ ధార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ ఫాంటసీ కామెడీ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 16న దేశవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఆనంద్ ఎల్. రాయ్, హిమాన్షు శర్మ నిర్మిస్తుండగా, బాలాజీ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. హిమాన్షు శర్మ, దివ్య నిధి శర్మ కథను అందించారు. జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
Yami Gautam ‘Nayyi Navelli’ Set for Dussehra Release
మీరట్ నగరానికి చెందిన ఓ చలాకీ కుటుంబంలోకి కొత్త కోడలు అడుగుపెట్టడంతో కథ మొదలవుతుంది. ఆమె రాకతో అప్పటివరకు సాధారణంగా ఉన్న ఆ ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోతుంది. కుటుంబ సభ్యులందరితో కలిసిపోయే ఆమెను చూసి అందరూ ముచ్చటపడుతుంటారు. అయితే ఇంట్లోని ఓ యువకుడికి మాత్రం ఆమెపై అనుమానం మొదలవుతుంది. అందరికీ ఆదర్శంగా, ఎంతో పర్ఫెక్ట్గా కనిపిస్తున్న తన వదిన నిజానికి ఓ మాంత్రికురాలేమో? అనే సందేహం అతడిలో కలుగుతుంది. ఆ అనుమానం నిజమేనా? ఆమె చుట్టూ దాగి ఉన్న రహస్యమేంటి? ఆ ఇంట్లో చోటుచేసుకునే వింత సంఘటనలు ఎలాంటి గందరగోళానికి దారితీస్తాయి? అన్నదే ‘నయ్యి నవెల్లి’లో ఆసక్తికరంగా ఆవిష్కరించనున్నారు. ఫాంటసీ, కామెడీ, అడ్వెంచర్ అంశాలను కుటుంబ అనుబంధాలతో మేళవించిన ఈ కథ ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించనుందని మేకర్స్ చెబుతున్నారు.

అమెజాన్ MGM స్టూడియోస్ ప్రతినిధి నిఖిల్ మధోక్ మాట్లాడుతూ, ఈ సినిమా దసరా పండుగకు సరైన చిత్రంగా నిలుస్తుందని అన్నారు. యామీ గౌతమ్ తన పాత్రలో అద్భుతంగా నటించారని, కుటుంబ ప్రేక్షకులకు ఈ దసరాకు ‘నయ్యి నవెల్లి’ బెస్ట్ ఛాయిస్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు.
నిర్మాత ఆనంద్ ఎల్. రాయ్ మాట్లాడుతూ, “నయ్యి నవెల్లి ప్రతి మలుపులో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. హాస్యం, ఫాంటసీ, అడ్వెంచర్ కలగలిసిన ఈ కథకు యామీ గౌతమ్ పర్ఫెక్ట్ ఛాయిస్. అమెజాన్ MGM స్టూడియోస్‌తో మా తొలి కలయికగా వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను అద్భుతంగా అలరిస్తుందనే నమ్మకం ఉంది” అన్నారు. కామెడీ, ఫాంటసీ, కుటుంబ అనుబంధాలు, ఆసక్తికరమైన మలుపులతో రూపొందుతున్న ‘నయ్యి నవెల్లి’ దసరా సెలవులను మరింత సందడిగా మార్చేందుకు సిద్ధమవుతోంది.