Ameer Log: Emotions Beyond Language & Slang
హైదరాబాద్ బస్తీ జీవితం, అక్కడి మనుషుల అనుబంధాలు, సహజమైన మాట తీరు, చిన్న చిన్న ఎమోషన్స్‌ను తెరపై ఆవిష్కరిస్తూ రూపొందిన చిత్రం ‘అమీర్ లోగ్’. ‘అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన ఈ చిత్రానికి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రానా దగ్గుబాటికి చెందిన ‘స్పిరిట్ మీడియా’ ఈ సినిమాను తెలుగులో ఆగస్ట్ 21న గ్రాండ్‌గా విడుదల చేయబోతోంది. రిలీజ్‌కు ముందు ప్రమోషన్స్‌లో భాగంగా MC హరి, మనోజ్, శశిధర్ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
Ameer Log: Emotions Beyond Language & Slang
‘‘అమీర్ లోగ్’ను చూస్తున్నప్పుడు సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ కంటే హైదరాబాద్‌లోని ఓ బస్తీలోకి వెళ్లి అక్కడి జీవితాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతి కలుగుతుంది. అంత సహజంగా సినిమా తెరకెక్కింది. దర్శకుడు రమణా రెడ్డి సోమ కుటుంబానికి సంబంధించిన ఇంటినే షూటింగ్ లొకేషన్‌గా ఉపయోగించుకోవడం కూడా సినిమాకు మరింత నేచురల్ లుక్ తీసుకొచ్చింది. అక్కడి స్థానికులు మాకెంతో సహకరించారు. సినిమా నేచురల్‌గా అనిపించడానికి మరో ముఖ్య కారణం సింక్ సౌండ్. డైలాగ్స్‌ను అక్కడికక్కడే రికార్డ్ చేయడంతో షూటింగ్ సమయంలో చిన్న శబ్దం వచ్చినా సీన్‌ను ఆపాల్సి వచ్చేది. ఆకాశంలో విమానం వెళ్లినా, ఏసీ శబ్దం వచ్చినా షూటింగ్ ఆపేసేవాళ్లం. రోడ్లపై చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలకు మాత్రమే డబ్బింగ్ చెప్పాం’’.
మేం బస్తీల్లో పెరిగాం.. అందుకే పాత్రలు మరింత దగ్గరయ్యాయి
తెలంగాణ యాస, హైదరాబాద్ బస్తీ నేపథ్యం తమకు కొత్త కాదని MC హరి, మనోజ్, శశిధర్ అంటున్నారు. తాము కూడా బస్తీ వాతావరణంలో పెరగడంతో సినిమాలోని పాత్రలను సహజంగా చేయగలిగామని చెప్పారు. తమకు తెలిసిన మనుషులనే తెరపై చూస్తున్నట్టుగా అనిపించేలా పాత్రలను తీర్చిదిద్దామని, దర్శకుడు రమణా రెడ్డి కూడా ఎలాంటి ఆర్భాటం లేకుండా చాలా సింపుల్‌గా సినిమాను తెరకెక్కించారని తెలిపారు. సినిమాలో MC హరి, మనోజ్, శశిధర్ ప్రధానంగా కనిపించినప్పటికీ.. కథను ముందుకు నడిపించడంలో మహిళా పాత్రలకు చాలా ప్రాధాన్యత ఉందని వారు స్పష్టం చేశారు.
అమ్మానాన్నలు, అక్క, అన్న, వదిన, పక్కింటి వాళ్లు.. ఇలా ప్రతి పాత్రకు కథలో ఓ ప్రత్యేకమైన స్థానం ఉంటుందని చెప్పారు. అందుకే ఇది కేవలం ముగ్గురు హీరోల సినిమా కాదని, కుటుంబంలోని ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే కథ అని తెలిపారు. సినిమా అవుట్‌పుట్‌పై దర్శకుడు రమణా రెడ్డి చాలా కాన్ఫిడెంట్‌గా ఉండటానికి కారణం ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా తెరపైకి తీసుకురావడమేనని హీరోలు చెబుతున్నారు. సినిమా పూర్తయిన తర్వాత తాము కూడా అవుట్‌పుట్ చూసి ఎంతో కాన్ఫిడెన్స్ పొందామని, మంచి ప్రొడక్ట్ తమ చేతుల్లో ఉందనే నమ్మకంతోనే ప్రమోషన్స్ చేస్తున్నామని తెలిపారు.
‘స్పిరిట్ మీడియా’ ద్వారా సినిమా విడుదల కావడం తమకు ఎంతో ప్లస్ పాయింట్ అని హీరోలు చెప్పారు. రానా దగ్గుబాటి టీమ్ ఇప్పటికే సినిమాను చూసిందని, ముందుగా హైదరాబాద్‌పై ఫోకస్ పెట్టి, ఆ తర్వాత ఇతర ప్రాంతాల్లో సినిమాను ప్రమోట్ చేయాలని సూచించారని తెలిపారు. త్వరలో రానా దగ్గుబాటి కూడా సినిమాను చూడనున్నారని వెల్లడించారు. సినిమాలోని ఎమోషన్స్‌ను సంగీత దర్శకుడు స్మరణ్ తన మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో మరింత ఎలివేట్ చేశారని హీరోలు ప్రశంసించారు. పాటలు ‘అమీర్ లోగ్’కు ప్రాణంగా నిలుస్తాయని, ఆర్ఆర్ సినిమా అనుభూతిని మరో స్థాయికి తీసుకెళ్లిందని అన్నారు.
రెగ్యులర్ తెలుగు సినిమాల తరహాలో కాకుండా ‘అమీర్ లోగ్’లో హిందీ, ఉర్దూ పదాలు సహజంగా వినిపిస్తాయని హీరోలు చెప్పారు. హైదరాబాద్‌లో మాట్లాడే భాషలో సహజంగానే తెలుగు, హిందీ, ఉర్దూ కలిసిపోతాయని, అదే నేటివిటీని సినిమాలో చూపించామని తెలిపారు. అయితే ప్రేక్షకులకు అర్థం కానంత కఠినమైన భాషను ఉపయోగించలేదని, సాధారణ ప్రేక్షకులు సులభంగా అర్థం చేసుకునేలా డైలాగ్స్‌ను రూపొందించామని చెప్పారు. చివరగా ‘అమీర్ లోగ్’ ప్రత్యేకతను ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇది కేవలం ఒక భాషకు, ఒక యాసకు సంబంధించిన సినిమా కాదు.. మనుషుల ఎమోషన్స్‌కు సంబంధించిన సినిమా అని హీరోలు చెబుతున్నారు. హైదరాబాద్ బస్తీ నేటివిటీతో తెరకెక్కినప్పటికీ, అందులోని భావోద్వేగాలు మాత్రం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతాయని వారు నమ్మకం వ్యక్తం చేశారు.