New Rudhra Stills from Mahesh Babu Varanasi
సూపర్‌స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ నుంచి రెండు సరికొత్త స్టిల్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇప్పటికే సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేలా ఉన్న ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా ఈ రెండు స్టిల్స్‌లో హీరో రుద్ర పాత్రలోని భిన్నమైన షేడ్స్‌ను చూపించడం ఆసక్తిని పెంచుతోంది.
New Rudhra Stills from Mahesh Babu Varanasi
మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదలైన తొలి స్టిల్‌లో రుద్ర ప్రకృతితో మమేకమైన వాతావరణంలో కనిపిస్తున్నాడు. అడవి ప్రాంతాన్ని తలపించే నేపథ్యానికి మధ్య వెదురు కర్రలతో ఏర్పాటు చేసిన బెడ్‌పై రిలాక్స్ అవుతూ కూల్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇది పాత్రలోని సింప్లిసిటీతో పాటు అడ్వెంచర్ టచ్‌ను కూడా హైలైట్ చేస్తోంది. క్యాజువల్ డ్రెస్, పొడవాటి జుట్టు, గడ్డంతో మహేష్ బాబు కొత్త లుక్‌లో కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఇక రెండో స్టిల్ మాత్రం పూర్తిగా మరో మూడ్‌ను చూపిస్తోంది. విశాలమైన పచ్చిక బయళ్ల మధ్య నిలబడి వెనక్కి తిరిగి చూస్తున్న రుద్ర.. ఏదో కీలకమైన విషయాన్ని గమనిస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు. ముఖంలో ప్రశాంతతతో పాటు ఏదో అన్వేషిస్తున్న వ్యక్తి భావన కనిపించడం ఈ స్టిల్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెండు ఫొటోలు కలిపి చూస్తే రుద్ర పాత్ర కేవలం యాక్షన్‌కే పరిమితం కాకుండా భావోద్వేగాలు, సాహసం, సున్నితత్వం వంటి విభిన్న కోణాలను కలిగి ఉండబోతున్నట్లు అనిపిస్తోంది.
ఈ కొత్త స్టిల్స్‌ను విడుదల చేస్తూ ‘Fierce isn’t his only shade…’ అంటూ రాజమౌళి చేసిన ట్వీట్ ఇప్పుడు మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. “రుద్రలో కనిపించేది కేవలం ఫియర్స్ షేడ్ మాత్రమే కాదు.. ఇంకా ఎన్నో కోణాలు ఉన్నాయి” అనే అర్థం వచ్చేలా రాజమౌళి ఈ క్యాప్షన్‌ను పెట్టారు.
గతంలో ‘వారణాసి’కు సంబంధించిన వివరాలను వెల్లడించినప్పుడు కూడా రుద్ర పాత్రలో తెలివితేటలు, సున్నితత్వం, తీవ్రత వంటి విభిన్న లక్షణాలు ఉంటాయని రాజమౌళి పేర్కొన్నారు. ముఖ్యంగా ఫియర్స్‌గా కనిపించడం మాత్రమే కాకుండా, అదే సమయంలో ఫ్రాజైల్‌గా కూడా పాత్రను ఆవిష్కరించగలిగే నటుడి అవసరం ఉందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
భారీ విజువల్ అడ్వెంచర్‌గా ‘వారణాసి’
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’పై ఇండియన్ సినిమా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందుతోంది. కథ వేల సంవత్సరాల కాలాన్ని, పలు ఖండాలను దాటే సాహస యాత్రగా ఉండబోతున్నట్లు ఇప్పటికే చిత్రబృందం వెల్లడించింది. వారణాసితో పాటు ఆఫ్రికా, అంటార్కిటికా, ప్రాచీన రోమ్ వంటి విభిన్న నేపథ్యాలు సినిమాలో కనిపించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఆఫ్రికా షెడ్యూల్లోని వాస్తవ లొకేషన్లలో చిత్రీకరించిన సన్నివేశాలే ఇప్పుడు విడుదలైన స్టిల్స్‌లో కనిపిస్తున్నట్లు సమాచారం. కిలిమంజారో, మసాయి మారా ప్రాంతాల సహజ అందాలను సినిమాలో భాగం చేయడం ద్వారా రాజమౌళి విజువల్స్‌కు మరింత సహజత్వాన్ని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల్లో ఒకటిగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ ప్రస్తుతం షూటింగ్ ఫైనల్ స్టేజ్‌లో ఉంది. ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.
ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, పాత్రల లుక్స్ భారీ అంచనాలను క్రియేట్ చేయగా.. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా వచ్చిన ఈ రెండు కొత్త స్టిల్స్ రుద్ర పాత్రపై మరింత క్యూరియాసిటీని పెంచాయి.