Yash Toxic Trailer
రాకింగ్ స్టార్ యశ్ అభిమానులు మాత్రమే కాదు.. ఇండియన్ సినిమా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. అవార్డు విన్నింగ్ దర్శకురాలు గీతు మోహన్‌దాస్ తెరకెక్కించిన ఈ యాక్షన్ మాగ్నమ్ ఓపస్ ట్రైలర్ తాజాగా బెంగళూరులో గ్రాండ్‌గా విడుదలైంది.
Yash Toxic Trailer
ట్రైలర్ చూస్తే పవర్, లవ్, బెట్రేయల్, రివెంజ్ చుట్టూ అల్లుకున్న ఓ డార్క్ అండ్ వైల్డ్ గ్యాంగ్‌స్టర్ ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లేలా కనిపిస్తోంది. భారీ యాక్షన్ సీక్వెన్సులు, డార్క్ విజువల్స్, అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్‌తో ‘టాక్సిక్’ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ముఖ్యంగా ‘యశ్ వర్సెస్ యశ్’ కాన్సెప్ట్ ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాయా, టికెట్ అనే విభిన్న షేడ్స్‌లో తండ్రి, కొడుకులుగా యశ్ కనిపించనుండటం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. యశ్ యాక్షన్‌లోని ఇంటెన్సిటీ, వైల్డ్నెస్, స్టైల్ ప్రతి ఫ్రేమ్‌లోనూ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ‘టాక్సిక్’ కేవలం యాక్షన్ సినిమానే కాదని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. రాయా, అతని కుమారుడి మధ్య ఉన్న సంక్లిష్టమైన బంధం కథలో కీలకమైన భావోద్వేగంగా కనిపిస్తోంది. ప్రేమ, కుటుంబం, ద్రోహం, అధికారం, ప్రతీకారం వంటి అంశాలను భారీ గ్యాంగ్‌స్టర్ వరల్డ్‌తో ముడిపెట్టినట్లు తెలుస్తోంది. నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి పాత్రలు కూడా కథలో కీలకంగా ఉండనున్నాయి.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రాకింగ్ స్టార్ యశ్ మాట్లాడుతూ ‘టాక్సిక్’ వెనుక ఉన్న తన విజన్‌ను వెల్లడించారు. ఇండియన్ సినిమాను గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పై నిలబెట్టాలనే సంకల్పంతో ఈ సినిమాను రూపొందించామని ఆయన తెలిపారు. “ఇది నా సినిమా కాదు.. ఇండియన్ సినిమా. ఎంతోమంది ప్రతిభావంతులు కలిసి ఈ సినిమాను రూపొందించారు. ఇండియన్ సినిమాను గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పై నిలబెట్టాలనే సంకల్పంతో ఈ సినిమా చేశాం. కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించాం. దాదాపు 200 రోజుల పాటు షూటింగ్ జరిగింది. ప్రతి ఒక్కరూ ఎంతో ప్యాషన్‌తో, హార్డ్ వర్క్‌తో పనిచేశారు. గీతు మోహన్‌దాస్ చాలా ప్యాషనేట్ డైరెక్టర్. ఈ సినిమా కోసం ఆమె ఎన్నో త్యాగాలు చేశారు. ఆమెపై ప్రతి ఒక్కరూ గర్వపడతారు. నిర్మాత వెంకట్ గారు ఎక్కడా రాజీ పడలేదు. మాకు కావాల్సిన ప్రతిదీ సమకూర్చారు. ఆయన ప్యాషన్‌తోనే ఇలాంటి సినిమా సాధ్యమైంది. ఇది చాలా హానెస్ట్ ఫిలిం. ప్రతి ఒక్కరూ అంతే హానెస్ట్‌గా పనిచేశారు” అని యశ్ అన్నారు. తన పాత్ర గురించి మాట్లాడుతూ.. ‘టాక్సిక్’ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేసిన సినిమా అని చెప్పారు. ఇందులో రెండు, మూడు విభిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రయాణంలో తన భార్య రాధిక అందించిన సహకారాన్ని ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. నయనతార, కియారా, తారా, హుమా, రుక్మిణి వసంత్‌లపై కూడా యశ్ ప్రశంసలు కురిపించారు. ప్రతి హీరోయిన్ పాత్రకు సినిమాలో సమానమైన ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు.
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ట్రైలర్‌ను ప్రశంసిస్తూ.. యశ్ ప్రతి సినిమాతో ఎదుగుతున్న తీరు తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందన్నారు. గీతు మోహన్‌దాస్ విజువల్ టేకింగ్ అద్భుతంగా ఉందని, సినిమా ప్రతి అంశం మైండ్ బ్లోయింగ్‌గా అనిపించిందని తెలిపారు.
నిర్మాత కేవీఎన్ మాట్లాడుతూ.. ఇది చాలా బోల్డ్ విజన్‌తో రూపొందించిన సినిమా అని చెప్పారు. యశ్ లేకపోతే ‘టాక్సిక్’ సాధ్యపడేది కాదని, నటుడిగానే కాకుండా రైటర్‌గా, క్రియేటివ్‌గా కూడా ఆయన ఎంతో సహకరించారని తెలిపారు. సినిమా దేశ సరిహద్దులు దాటి ప్రేక్షకులను అలరిస్తుందని, గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పై ఇండియన్ సినిమాను మరింత ఎలివేట్ చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
దర్శకురాలు గీతు మోహన్‌దాస్ మాట్లాడుతూ.. నిర్మాత కేవీఎన్ అందించిన సహకారం వల్లే ఇంత భారీ స్థాయిలో సినిమా చేయగలిగామని చెప్పారు. యశ్‌ను వండర్ఫుల్ యాక్టర్‌తో పాటు బ్రిలియంట్ ప్రొడ్యూసర్, అద్భుతమైన కో-రైటర్‌గా అభివర్ణించారు. యశ్ తనకు పెద్ద ఎమోషన్ అని, ఈ సినిమా జర్నీని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు.
నయనతార కూడా ‘టాక్సిక్’ తనకు చాలా స్పెషల్ ఫిలిం అని పేర్కొన్నారు. యశ్ ఈ సినిమా కోసం నాలుగేళ్ల పాటు తన జీవితాన్ని అంకితం చేశారని, ఆయన హార్డ్ వర్క్, డెడికేషన్ ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. కియారా అద్వానీ తన కెరీర్లో ‘టాక్సిక్’ చాలా స్పెషల్ అని చెబుతూ, ‘బిఫోర్ టాక్సిక్.. ఆఫ్టర్ టాక్సిక్’ అనేలా సినిమా ఉండబోతోందని ఆసక్తిని పెంచారు.
హుమా ఖురేషి ట్రైలర్‌ను మెస్మరైజింగ్‌గా అభివర్ణించగా, రుక్మిణి వసంత్ ఈ సినిమా తనకు గొప్ప అనుభవాన్ని ఇచ్చిందని తెలిపారు.
కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’కు గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. యశ్, నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇంగ్లిష్, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ఆగస్టు 26న హిందీ, తెలుగు, తమిళం, మలయాళంలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.