EVV Cinemas Production with Harsh Roshan
ఈవీవీ సినిమా బ్యానర్‌పై ఆర్యన్ రాజేష్ తొలి నిర్మాణం
హర్ష్ రోషన్ హీరోగా ఇంటెన్స్ లవ్ డ్రామా ప్రారంభం
తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్న లెజెండరీ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ పెద్ద కొడుకు ఆర్యన్ రాజేష్ చాలా రోజుల తర్వాత నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఈవీవీ సినిమా బ్యానర్‌పై ఆయన ఫస్ట్ ప్రాజెక్టును శనివారం ప్రకటించారు. ఈ.వీ.వీ. సత్యనారాయణ స్థాపించిన ఈ ప్రతిష్ఠాత్మక బ్యానర్‌పై ఆర్యన్ రాజేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం. ఈవీవీ సినిమా ప్రొడక్షన్ నెం.10గా, ఎన్వీఆర్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెం.1 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎన్.వి. కృష్ణారెడ్డి, ఆర్యన్ రాజేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఓ ఇంటెన్స్ లవ్ డ్రామాగా రూపుదిద్దుకోనుంది. భావోద్వేగాలు, సంబంధాలు, వాస్తవికత ప్రధానాంశాలుగా ఈ కథ ప్రేక్షకుల ముందుకు రానుంది.
EVV Cinemas Production with Harsh Roshan
ఈ చిత్రంలో యంగ్ యాక్టర్ హర్ష్ రోషన్ హీరోగా నటిస్తుండగా, హీరోయిన్గా ప్రియాంక ఆచర్ నటిస్తుంది. ‘కోర్ట్’, ‘బ్యాండ్‌మేళం’లాంటి చిత్రాలతో తనదైన నటనతో ప్రశంసలు అందుకున్న హర్ష్ రోషన్, టాలీవుడ్లో మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వరుస చిత్రాలతో మంచి జోరుమీదున్న ఈ యువ హీరో, ఇప్పుడు మరో భావోద్వేగభరితమైన ప్రేమకథతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు.

ఈ చిత్రానికి అరుణ్ బాలాజీ, శ్రీ రంజని కలిసి దర్శకత్వం వహిస్తున్నారు. నిజ జీవిత భావోద్వేగాలు, సంబంధాల సంక్లిష్టతను తెరపై సహజంగా ఆవిష్కరించే ప్రయత్నంగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు చిత్రబృందం చెబుతోంది. ప్రేమ, అనుబంధం, జీవిత సత్యాల మధ్య సాగే ఈ కథ ప్రేక్షకుల హృదయాలను తాకేలా ఉండబోతోందని సమాచారం.
తాజాగా ఈ సినిమా శుభ ముహూర్తపు పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈవీవీ సినిమా, ఎన్వీఆర్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం బలమైన కథనం, సహజమైన భావోద్వేగాలు, ఆకట్టుకునే ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక వైపు ఈవీవీ సినిమా వంటి లెజెండరీ బ్యానర్, మరోవైపు ఆర్యన్ రాజేష్ నిర్మాతగా తొలి అడుగు, అలాగే హర్ష్ రోషన్ వంటి ప్రామిసింగ్ యువ హీరో కలయికతో ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది.

తెలుగు ప్రేక్షకులకు ఎన్నో గుర్తుండిపోయే వినోదాత్మక చిత్రాలను అందించిన ఈవీవీ సినిమా బ్యానర్ గతంలో ‘చాలా బాగుంది’, ‘మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది’, ‘తొట్టి గ్యాంగ్’, ‘అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ’, ‘ఫిట్టింగ్ మాస్టర్’, ‘నువ్వంటే నాకిష్టం’, ‘కితకితలు’ వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు అదే బ్యానర్ నుంచి రాబోతున్న ఈ కొత్త ప్రేమకథ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.