Ravi Teja Irumudi Kattu Song Release
మాస్ మహారాజా రవితేజ హీరోగా, దర్శకుడు శివ నిర్వాణ రూపొందిస్తున్న ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఇరుముడి’. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, వీడియో గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచగా, తాజాగా సంగీత ప్రయాణానికి భక్తి పరిమళాలను అద్దుతూ తొలి అడుగు వేసింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి విడుదలైన తొలి గీతం ‘ఇరుముడి కట్టు’ భక్తి, భావోద్వేగం, సంప్రదాయాల సమ్మేళనంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
Ravi Teja Irumudi Kattu Song Release
అయ్యప్ప స్వామి భక్తుల జీవితంలో అత్యంత పవిత్రమైన ఘట్టమైన మండల దీక్ష నుంచి శబరిమల యాత్ర వరకు సాగిన ఆధ్యాత్మిక అనుభూతిని ఈ పాట అద్భుతంగా ప్రతిబింబిస్తుంది. “కట్టు కట్టు కట్టు ఇరుముడి కట్టు… ఎక్కు ఎక్కు ఎక్కు శబరిమల ఎక్కు” అనే పల్లవి వినిపించిన క్షణం నుంచే ప్రతి అయ్యప్ప భక్తుడి హృదయంలో భక్తి జ్యోతి వెలిగేలా ఈ గీతాన్ని తీర్చిదిద్దారు.
సంగీత దర్శకుడు జి.వి. ప్రకాశ్ కుమార్ ఈ పాటకు అందించిన స్వరాలు భక్తి పారవశ్యాన్ని కలిగించేలా ఉన్నాయి. సంప్రదాయ వాద్యాల నాదంతో పాటు ఆధ్యాత్మికతను మేళవించిన సంగీతం ప్రతి చరణాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లింది. పాట వినిపించే ప్రతి క్షణం శబరిమల యాత్రలో అడుగులు వేస్తున్న అనుభూతిని కలిగిస్తుంది.
Ravi Teja Irumudi Kattu Song Release
ఈ గీతానికి దర్శకుడు శివ నిర్వాణ, గేయరచయిత కళ్యాణ్ చక్రవర్తి కలిసి అందించిన సాహిత్యం అయ్యప్ప స్వామి భక్తి గొప్పతనాన్ని ఎంతో హృద్యంగా ఆవిష్కరించింది. అయ్యప్ప మాల ధరించడం వెనుక ఉన్న ఆధ్యాత్మికత, నియమ నిష్ఠలు, త్యాగం, ఆత్మశుద్ధి, జీవన విలువలను ప్రతి పదంలో ప్రతిధ్వనించేలా రాశారు. కేవలం భక్తి గీతంగా కాకుండా, ప్రతి భక్తుడు అనుసరించే ఆచార వ్యవహారాలకు ఈ పాట అద్దం పట్టినట్టుగా అనిపిస్తుంది. గాయకుడు అనంతు తన శక్తివంతమైన గాత్రంతో ప్రతి పదానికి భక్తి భావాన్ని జోడించారు. ఆయన ఆలాపనలో కనిపించే ఆవేశం, ఆరాధన, ఆత్మీయత పాటను మరో స్థాయికి తీసుకెళ్లాయి. సంగీతం, సాహిత్యం, గానం మూడు కలిసినప్పుడు కలిగే ఆధ్యాత్మిక అనుభూతికి ‘ఇరుముడి కట్టు’ చక్కని ఉదాహరణగా నిలిచింది.
ఈ పాటలో రవితేజ అయ్యప్ప స్వామి మాల ధరించిన భక్తుడి పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారు. ఆయన రూపం, హావభావాలు, భక్తి నిండిన నటన ఈ గీతానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా ఇరుముడిని భుజాన ధరించి శబరిమల యాత్రకు సిద్ధమయ్యే దృశ్యాలు ఎంతో సహజంగా, హృద్యంగా తెరకెక్కాయి. బాబా భాస్కర్ అందించిన నృత్య రూపకల్పనలో ఎక్కడా ఆర్భాటం కనిపించదు. సంప్రదాయ భక్తి నృత్య శైలిని అనుసరిస్తూ ప్రతి కదలికలో అయ్యప్ప భక్తి స్ఫూర్తిని ప్రతిబింబించేలా కొరియోగ్రఫీ రూపొందించారు. ఇందులో రవితేజ భార్యగా ప్రియా భవానీ శంకర్, కుమార్తెగా బేబీ నక్షత్ర కనిపించే భావోద్వేగ సన్నివేశాలు పాటకు కుటుంబ అనుబంధాన్ని జోడించాయి. యాత్రకు బయలుదేరే భక్తుడి వెనుక ఉండే కుటుంబ ప్రేమ, ఆశీర్వాదం, ఎదురుచూపులు హృదయాన్ని తాకేలా చిత్రీకరించారు. ఈ చిన్న చిన్న భావోద్వేగాలే ‘ఇరుముడి’ కథలోని ఆత్మను పరిచయం చేస్తున్నాయి.
నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ, సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైన్, ప్రవీణ్ పూడి ఎడిటింగ్ అందిస్తున్న ఈ చిత్రానికి జి.వి. ప్రకాశ్ కుమార్ సంగీతం ప్రధాన బలంగా నిలవనుంది.ఈ చిత్రం ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు రానుంది.